జ్వరంతో ఉన్నా.. చిరు నాకోసం ఎదురుచూశారు

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘చూడాలని వుంది!’తో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు నటుడు తేజ. బాలనటుడిగా పలువురు స్టార్‌ హీరో సినిమాల్లో మెప్పించిన తేజ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం..

Updated : 03 Feb 2021 09:47 IST

మెగాస్టార్‌ నుంచి ఎన్నో నేర్చుకున్నా : తేజ

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘చూడాలని వుంది!’తో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు నటుడు తేజ. బాలనటుడిగా పలు సినిమాల్లో మెప్పించిన తేజ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘జాంబిరెడ్డి’. ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న తేజ.. తన మొదటి సినిమా చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర విషయం గురించి తెలియజేశారు.

‘‘మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున, మహేశ్‌బాబు సినిమాల్లో నేను బాలనటుడిగా నటించాను. మహేశ్‌తో ‘యువరాజు’, ‘రాజకుమారుడు’ చేశాను. వాళ్లందరితో నాకు మంచి అనుబంధం‌ ఉంది. ముఖ్యంగా మెగాస్టార్‌ కథానాయకుడిగా నటించిన ‘చూడాలని వుంది!’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్‌’, ‘అందరివాడు’ సినిమాల్లో నేను బాలనటుడిగా మంచి పాత్రలు పోషించాను. ‘చూడాలని వుంది!’ నా మొదటి చిత్రం. ఆ సినిమా షూట్‌లో జరిగిన ఓ విషయం నాకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. చిత్రీకరణలో భాగంగా తలకోనలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్‌ చేస్తున్న సమయంలో చిరు సర్‌ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. చికిత్స తీసుకుని మరీ షూట్‌లో పాల్గొన్నారు. అప్పుడు నా వయసు సుమారు మూడేళ్లు. అయితే, షూట్‌లో భాగంగా చిరు-నాకూ మధ్య ఓ సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది’

‘సీన్‌లో భాగంగా చిరంజీవి.. కొలనులో నుంచి నన్ను అలా పైకి లేపాలి. షాట్‌ రెడీ కాగానే ఆయన వెంటనే కొలనులోకి దిగి నిల్చున్నారు. నేను మాత్రం దిగనని మారాం చేశాను. దాంతో ఆయన ఆ ఒక్క షాట్‌ కోసం దాదాపు రెండు గంటలపాటు కొలనులో నిల్చున్నారు. ఆ తర్వాత రోజు ఆయనకు జ్వరం మరింత ఎక్కువైంది. ఈ ఘటన వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సినిమాపట్ల ఆయన చూపించే మక్కువ, సహనటులకు ఇచ్చే గౌరవం.. ఇలా ఎన్నో గొప్ప విషయాలను ఆయన నుంచే నేర్చుకున్నాను’ అని తేజ ఆనాటి ఘటనను నెమరువేసుకున్నారు.

ఇదీ చదవండి

మంచి సినిమా తీశాం.. ఆశీర్వదించండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని