Nani: ఆ సందర్భం వస్తే నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటా! 

‘టక్‌ జగదీష్‌’ ట్రైలర్‌ విడుదల వేడుక. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.

Updated : 01 Sep 2021 21:37 IST

 

హైదరాబాద్‌: ‘పరిస్థితులు బాగోనప్పుడు కాదు పరిస్థితులు బాగుండి, నా చిత్రాల్ని థియేటర్లలో కాకుండా ఓటీటీకి ఇచ్చినప్పుడు ఎవరో చేయాల్సిన అవసరం లేదు నటుడిగా నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటా’ అని నటుడు నాని తెలిపారు. ఈయన కథానాయకుడిగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. సెప్టెంబరు 10 నుంచి ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదల వేడుకని చిత్రబృందం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ...‘‘భావోద్వేగాల్ని తెరకెక్కించడంలో శివ నిర్వాణకి మంచి పట్టుంది. మేమిద్దరం కలిసి చేసిన ‘నిన్నుకోరి’, ఆయన గత చిత్రం ‘మజిలీ’కి మించిన ఎమోషన్‌ ‘టక్‌ జగదీష్‌’లో ఉంటుంది. కుటుంబ సమేతంగా చూసే ఈ సినిమా వినాయక చవితికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం చూసిన వారికి ఆనందభాష్పాలు రావడం గ్యారెంటీ. సినిమా పూర్తయ్యాక పండగరోజు చాలా బాగా గడిచిందని ఫీలవుతారు. ఈ కథ, పోరాట సన్నివేశాల గురించి శివ నాతో చెప్పినప్పుడు ఎమోషనే కాదు యాక్షన్‌లోనూ ఆయనకి గ్రిప్‌ ఉందని అర్థమైంది. ఇది ఇప్పటి వరకు మనం చూడని కొత్త నేపథ్యంలో సాగే కథ కాదు. ఉత్కంఠపెంచే మలుపులు తదితర అంశాలు ఉండవు. బాల్యంలో మనం చూసిన పండగలాంటి సినిమాల్ని ఇప్పుడు మిస్‌ అవుతున్నాం. ఆ లోటుని తీరుస్తూ, మధుర జ్ఞాపకాల్ని గుర్తుచేసే చిత్రమిది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నామని నాపై కొందరు ఆరోపించారు. వారిపై నాకు గౌరవం ఉంది. వాళ్లున్న పరిస్థితుల్లో అలా స్పందించడం తప్పేం కాదు. నాని వాళ్ల కుటుంబ సభ్యుడే. నేనూ వాళ్లలో ఒకడినే. ఆ కాసేపు బయటివాడ్ని చేశారనే బాధ ఉంది. పరిస్థితులు బాగోనప్పుడు కాదు పరిస్థితులు బాగుండి, నా చిత్రాల్ని థియేటర్లలో కాకుండా ఓటీటీకి ఇచ్చినప్పుడు ఎవరో చేయాల్సిన అవసరం లేదు నటుడిగా నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటా’ అని అన్నారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం రెండేళ్లు శ్రమించాం. ఈ సినిమా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నాం. ఫలానా సన్నివేశానికి చప్పట్లు, విజిల్స్‌ పడుతుంటే ఆనందించాలనుకున్నాం. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీకి వెళ్లక తప్పలేదు.ఇందుకు చాలా బాధగా ఉంది. ఒక్కో నిర్మాణ సంస్థకి ఒక్కోరకమైన సమస్యలుంటాయి. ఎవరి వీలుని బట్టి వారు తమ సినిమాని విడుదల చేస్తారు. అందరినీ ఒకేలా చూడకండి. మా సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రతి గ్రామానికి చేరుతుంది. పండగరోజు టక్‌ జగదీష్‌ అదిరిపోతుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయిక రీతూవర్మ, ప్రవీణ్‌, తిరువీర్‌, నిర్మాతలు సాహుగారపాటి, హరీశ్‌ పెద్ది తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు