‘జైలర్‌’, ‘ఓ మైగాడ్‌2’, ‘గదర్‌2’.. సినీ చరిత్రలో ఇదొక రికార్డు!

గత వారం విడుదలై రజనీకాంత్‌ ‘జైలర్‌’, చిరంజీవి ‘భోళా శంకర్‌’, అక్షయ్‌ కుమార్  ‘ఓ మై గాడ్‌2’, సన్నీ దేఓల్‌ ‘గదర్‌2’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డును సృష్టించాయి.

Updated : 14 Aug 2023 15:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా తర్వాత దాదాపు అన్ని రంగాలు తిరిగి కోలుకున్నా.. సినిమా రంగానికి ఓటీటీ వేదికలు ప్రతిబంధకంగా మారాయి. దీంతో హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే గానీ థియేటర్లలో టికెట్‌ చిరగని పరిస్థితి. ప్రేక్షకులను థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడమూ కష్టమైపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడం మరో మైనస్‌. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల బాలీవుడ్‌, కోలీవుడ్‌ నుంచి విడుదలైన చిత్రాలు థియేటర్లకు ఊపిరిపోశాయి. అంతేకాదు కొత్త రికార్డులను నెలకొల్పాయి. గత వారం ఇటు తెలుగు, తమిళ భాషలతో పాటు, హిందీలోనూ ఆసక్తికర చిత్రాలు విడులైన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ ‘జైలర్‌’, చిరంజీవి ‘భోళా శంకర్‌’, అక్షయ్‌ కుమార్  ‘ఓ మై గాడ్‌2’, సన్నీ దేఓల్‌ ‘గదర్‌2’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఆగస్టు 11 నుంచి 13 వరకూ ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద రూ.390 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూళ్లను రాబట్టినట్లు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. భారతీయ సినీ చరిత్రలో  ఒక వీకెండ్‌లో ఇన్ని కోట్ల కలెక్షన్స్‌ రావడం ఇదే తొలిసారని తెలిపింది. ఈ వారాంతంలో దేశవ్యాప్తంగా 2.10 కోట్ల మంది థియేటర్‌లో సినిమాలను వీక్షించారట. గత పదేళ్లలో ఈ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్‌కు రావడం ఒక రికార్డు అని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తెలిపింది. కరోనా తర్వాత థియేటర్‌లో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాశీష్‌ సర్కార్‌, మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కమల్‌ సంతోషం వ్యక్తం చేశారు.

బాక్సాఫీస్‌ వద్ద ‘జైలర్‌’ హంగామా

రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జైలర్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు రాబడుతోంది. వీకెండ్‌ ముగిసే సమయానికి రూ.300కోట్ల(గ్రాస్‌)కు దగ్గరగా ఉంది. ఈ మార్కును అత్యంత వేగంగా అందుకున్న రెండో చిత్రం ‘జైలర్‌’కావడం విశేషం.  గతంలో రజనీ నటించిన ‘2.ఓ’ నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు(గ్రాస్‌) వసూలు చేసింది.  ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ‘జైలర్‌’ హవా కొనసాగుతోంది. నాలుగు రోజుల్లో రూ.32కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.

రాణించిన పీవీఆర్‌ ఐనాక్స్‌ షేర్లు

వీకెండ్‌ వసూళ్లు రాణించడంతో పీవీఆర్‌ షేర్లు సోమవారం లాభపడ్డాయి. ప్రస్తుత చిత్రాలు రాణించడంతోపాటు.. షారుక్‌ ‘జవాన్‌’, ప్రభాస్‌ ‘సలార్‌’, ఆయుష్మాన్‌ ఖురానా ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ వంటి చిత్రాలపై అంచనాలున్నాయి. ఈ క్రమంలో పీవీఆర్‌ ఐనాక్స్‌కు కొన్ని బ్రోకరేజీ సంస్థలు బై రేటింగ్‌ ఇస్తున్నాయి. దీంతో పీవీఆర్‌ ఐనాక్స్‌ షేర్లు సోమవారం 5 శాతం మేర లాభపడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రూ.1,716.40 వద్ద ట్రేడవువుతున్నాయి. పీవీఆర్‌, ఐనాక్స్‌ సంస్థలు విలీనం అనంతరం విలీన సంస్థకు దేశవ్యాప్తంగా 115 నగరాల్లో 1708 స్క్రీన్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని