Cannes 2023: ఊర్వశి రౌతేలా మొసలి నెక్లెస్‌ ధర రూ.276 కోట్లట.. జోక్‌ బాగుందంటూ కామెంట్లు

కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో (Cannes 2023) ఊర్వశి రౌతేలా ధరించిన నెక్లెస్‌పై (Crocodile necklace) నెట్టింట చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె టీమ్‌ దీని ధరను తెలిపింది.

Updated : 23 May 2023 14:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 76వ కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో (Cannes 2023) తన అందాలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఇందులో భాగంగా మే 16న ఆమె వేసుకున్న కాస్ట్యూమ్‌ (crocodile necklace) నెట్టింట వైరలైన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేశారు. ముఖ్యంగా ఆమె పెట్టుకున్న మొసలి నెక్లెస్‌పై భారీగా ట్రోల్‌ చేశారు.

ఆ రోజు పింక్‌ కలర్‌ గౌనులో మెరిసిన ఊర్వశి.. మెడలో తనకెంతో ఇష్టమైన మొసలి నెక్లెస్‌, చెవులకు మొసలి రింగులు పెట్టుకుంది. ఆ తర్వాత దీనిపై నెట్టింట చర్చ మొదలైంది. అంత పెద్ద వేడుకకు ఫేక్ నెక్లెస్‌ పెట్టుకుని వెళ్లారా అని ఆమెను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు. కొందరు ప్రముఖులు కూడా విమర్శించారు. దీంతో ఆమె టీమ్‌ దీని ధర తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. ‘‘ఊర్వశి ధరించిన నెక్లెస్‌ ఫేక్‌ కాదు. దాని ధర రూ.276 కోట్ల దాకా ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్‌ అభిరుచిని తెలుపుతుంది. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలు రెండింటికి ఇది చిహ్నం’’ అని పేర్కొంది. ప్రస్తుతం దీని ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘నెక్లెస్‌ అంత ధర ఉంటుందా? జోక్‌ బాగుంది’, అని ఒకరు.. ఆమె ధరించినది నిజమైనది కాదని మరొకరు సామాజిక మాధ్యమాల వేదికగా కౌంటర్‌ ఇస్తున్నారు.

కేన్స్‌ వేడుకలో ఊర్వశి రోజుకో రకమైన స్టైల్‌లో హొయలోలికిస్తోంది. తాజాగా ముదురు నీలి రంగు లిప్‌స్టిక్‌తో సందడి చేసింది. గతంలో ఐశ్వర్య రాయ్‌ వేసుకున్న పర్పుల్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ కూడా అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇక ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో కలిసి ఆడిపాడిన ఊర్వశి తాజాగా ‘ఏజెంట్‌’లోనూ కనిపించి అలరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని