vaishnavi chaitanya: ‘బేబి’ కథ విన్నాక నా జీవితమే గుర్తొచ్చింది

‘‘అవకాశం కోసం ఎన్నో ఆఫీసులు తిరిగాను. ఆడిషన్స్‌ ఇచ్చాను. ఎనిమిదేళ్ల కష్టం తర్వాత ఊహించని రీతిలో కథానాయికగా ఓ గొప్ప అవకాశం వచ్చింది. అదే ‘బేబి’ చిత్రం.

Updated : 12 Jul 2023 10:33 IST

‘‘అవకాశం కోసం ఎన్నో ఆఫీసులు తిరిగాను. ఆడిషన్స్‌ ఇచ్చాను. ఎనిమిదేళ్ల కష్టం తర్వాత ఊహించని రీతిలో కథానాయికగా ఓ గొప్ప అవకాశం వచ్చింది. అదే ‘బేబి’ చిత్రం. ఇంత మంచి కథలో భాగం అవుతానని కలలో కూడా అనుకోలేద’’న్నారు వైష్ణవి చైతన్య. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ముచ్చటించారు.

  • ‘‘కొన్ని విషయాలు విన్నప్పుడు ఎలా స్పందించాలో కూడా అర్థం కాక అలా ఉండిపోతాం. ‘బేబి’ అవకాశం దక్కేవరకూ నా పరిస్థితి అదే. అప్పటివరకు నేనొక యూట్యూబర్‌గా, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానే తెలుసు.
  • కథానాయిక కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చా. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్‌గానే ఉండిపోతానేమో అనుకునేదాన్ని. ఆ దశలో సాయిరాజేశ్‌ ఈ కథ చెప్పినప్పుడు షాక్‌కి గురయ్యా. ఈ పాత్రని నేను చేయగలనా? అనే సందేహం కూడా వచ్చింది. కానీ దర్శకుడే నన్ను నమ్మి, చేయగలవంటూ ధైర్యం చెప్పారు’’.
  • ‘‘ఇందులో ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తా. నేనూ బస్తీ అమ్మాయినే. మేం ఉండేది హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో. కథ వింటున్నప్పుడు నా జీవితమే గుర్తొచ్చింది. ఈ సినిమాలోని ఏదో ఒక అంశం ప్రతి ప్రేక్షకుడికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తాను’’.
  • ఇదీ చదవండి: ఖలేజా టైటిల్‌.. అత్యాశకు పోయి రూ.10లక్షలు పోగొట్టుకున్నారు!
  • ‘‘ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు లోతుగా ఉంటాయి. వాటిని చేసేటప్పుడు అటూఇటూ కాకుండా చేయాలి. అందుకోసం నేను, ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ ముగ్గురం కలిసి మాట్లాడుకుని సిద్ధమయ్యేవాళ్లం. ఆ ఇద్దరూ చక్కటి సహకారం అందించారు.
  • ‘బేబి’ అనే పేరు ఈ సినిమాకి ఎందుకు పెట్టామనేది కూడా ఓ సన్నివేశంలో ఉంటుంది. ఇది సంగీత ప్రధానంగా సాగే సినిమా. సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్‌తో ఇదివరకు ఓ ఆల్బమ్‌ కోసం పనిచేశా’’.
  • ‘‘కథానాయికగా తెలుగమ్మాయిలకి అవకాశాలు ఇవ్వరనే ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ ప్రచారంవల్లే చాలా మంది సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ప్రయత్నిస్తే తప్పకుండా అవకాశం వస్తుంది. నటనకి ప్రాధాన్యం ఉందంటే ఆ పాత్ర గ్లామర్‌గా ఉందా, డీ గ్లామర్‌గా ఉందా అనే విషయాన్ని అస్సలు పట్టించుకోను’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని