Mega 156: చిరంజీవి కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం..: దర్శకుడు వశిష్ఠ

చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి దర్శకుడు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

Published : 16 Nov 2023 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi)ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీని కాన్సెప్ట్‌ పోస్టర్‌తోనే చిత్రబృందం ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. దీనికి ‘విశ్వంభర’ (Viswambhara) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి దర్శకుడు వశిష్ఠ తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కొన్ని విశేషాలు పంచుకున్నారు.

‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా సమయంలో నేను స్కూల్లో చదువుతున్నా. ఆ చిత్రం చూసి ఆశ్చర్యపోయాను. మెగాస్టార్‌ అలాంటి స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్‌ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. మధ్యలో ‘అంజి’ సినిమా వచ్చినప్పటికీ.. అది పూర్తి స్థాయి ఫాంటసీ చిత్రంగా రూపొందించలేదు. ఇక ‘విశ్వంభర’లో 70శాతం స్పెషల్‌ ఎఫెక్ట్‌లు ఉంటాయి. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ మంత్రముగ్దులవుతారు. నా రెండో సినిమానే చిరంజీవితో తీస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా బ్యాకప్‌ అవసరం : శ్రీలీల

ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్స్‌ కనిపించనున్నారనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని