Venu: ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’.. ‘దేశముదురు’ అలా మిస్సయ్యా: నటుడు వేణు

Venu: ఒకప్పుడు వరుస సినిమాలతో నటించి మెప్పించిన వేణు తొట్టెంపూడి పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..

Updated : 07 Dec 2022 18:53 IST

Venu Thottempudi.. వేణు తొట్టెంపూడి. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆరడుగుల అందగాడిగా ‘స్వయంవరం’ ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్‌ జంక్షన్‌’లాంటి హిట్‌ సినిమాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు. గత కొంతకాలంగా సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆయన దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో కీలకపాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆ సందర్భంగా ఎన్నో విశేషాలను పంచుకోవటానికి ఆ చిత్ర దర్శకుడు శరత్‌ మండవతో కలిసి ‘ఆలీతో సరదాగా’ విచ్చేశారు!

మీ తొలిచిత్రం ‘స్వయంవరం’ సూపర్‌హిట్‌. మొదటి చిత్రంతోనే విజయం ఎలా సాధ్యమైంది?

వేణు: ఆ సినిమాతోనే మన(ఆలీతో) పరిచయం జరిగింది. నేనేమో కొత్త నటుడ్ని. మీతో సహా అందరు సీనియర్లే. అందుకే ఆ సినిమా షూటింగ్‌లో చాలా జాగ్రత్తగా నడుచుకున్నా. అలాగే నటించాను కూడా.

ఎన్ని సినిమాల్లో హీరోగా నటించారు?ఏం నేర్చుకున్నారు?

వేణు: సుమారుగా పాతిక సినిమాల్లో హీరోగా నటించా. నేర్చుకున్నది చాలా తక్కువ. నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలుసుకున్నా. అందుకే మీ ముందుకి మళ్లీ వచ్చా.

రీఎంట్రీకి టైం ఎక్కువ తీసుకోవడానికి కారణమేంటి?

వేణు: అవునండీ! కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నా. (Venu interview) కొవిడ్‌తో అది కాస్తా పెరిగింది. లాక్‌డౌన్‌లో వేరే భాషకి చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విపరీతంగా చూశా. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించాలని అప్పుడు అనిపించింది. వాటి నుంచి స్ఫూర్తి పొందా. ప్రత్యేక గుర్తింపు ఉన్న పాత్రలే చేయాలని నిర్ణయించుకున్నా. అది ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో తీరింది.

మీ కుటుంబ నేపథ్యం ఏంటి? సినిమాలపై ఆసక్తి ఎలా కలిగింది?

వేణు: నేను పుట్టింది కాకినాడ. పెరిగింది మొత్తం మధురై(తమిళనాడు). కర్ణాటక ధార్వాడ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. నా జీవితం మొత్తం ప్రయాణాలే. అందుకు కారణం మా నాన్నగారు ప్రొఫెసర్‌ కావడమే. ఆయన బదిలీల కారణంగా తిరగాల్సి వచ్చేది. నాకు చిన్నప్పుడే సినిమాలపై ఆసక్తి కలగడానికి కారణం, సినిమాకి హద్దులు లేవని నిరూపించినవి రెండు సినిమాలు. అప్పట్లోనే మధురైలో ఆ రెండూ వంద రోజులకు పైగా ఆడాయి. ఒకటి ‘శంకరాభరణం’. రెండోది ‘డిస్కో డ్యాన్సర్‌’. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్‌. ఆ రోజుల్లోనే ఆయన కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో చదివారు. నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్లి ‘శంకరాభరణం’ చూపించి ‘సినిమా అంటే ఇది’ అని చెప్పారు. నాకు రెండు, మూడుసార్లు చూడగా అందులోని విషయం అర్థమైంది. (Venu interview)  ఇంకా నా ఫ్రెండ్‌తో కలిసి డిస్కో డ్యాన్సర్‌ చూశా. రెండూ కళ గురించి చెప్పేవైనా విరుద్ధ విధానాల్లో సాగే సినిమాలు. రెండింటినీ ప్రేక్షకులు విజయవంతం చేశారు. అక్కడి నుంచి నేనూ విపరీతంగా సినిమాలు చూసేవాడిని. చాలాసార్లు నా సినిమా పిచ్చి తట్టుకోలేక మా నాన్న కొట్టారు.

మీ కుటుంబం మొత్తం రాజకీయ నేపథ్యమేనట?ఆ వైపు మీకేమైనా ఆసక్తి ఉందా?

వేణు: మీరడిగారు కాబట్టి చెబుతున్నా. మా మావయ్య మాగంటి అంకినీడు గారు పాతిక సంవత్సరాలు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు. ‘వేణు నీ సినిమా ఆడితేనే నువ్వు నా మేనల్లుడివి అని చెప్తా’ అనేవారు. ఇంకా కావూరి సాంబశివరావుగారు మా బాబాయి. మా బావగారు నామా నాగేశ్వరరావు గారు ప్రస్తుతం ఖమ్మం ఎంపీగా ఉన్నారు. నాకస్సలు రాజకీయాలపై ఆసక్తి లేదు. వాటిపై ఆలోచనే లేదు. సినిమాలతో సంతృప్తిగా ఉన్నా. సినిమాల్లో చేయాల్సింది చాలా ఉంది. ప్రేక్షకుల దయతో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటే చాలు.

భారతీరాజా దర్శకత్వంలో మీరు చేయాల్సిన సినిమా చేజారిందట? ఎలా?

వేణు: అవును మిస్సయ్యా. నిజానికి అది నా తొలి సినిమా కావాలి. షూటింగ్‌ ఒక షెడ్యూల్‌ కూడా పూర్తయింది. తర్వాత ఎంత వేచి చూసినా నాకు ఫోన్‌ రాకపోయే సరికి భారతీరాజా గారి ఆఫీస్‌కి వెళ్లా. ఆయన ‘సినిమా ఆగిపోయింది’ అని చెప్పారు.(Venu interview)  ‘నా నటనలో ఏమైనా లోపమా సర్‌’ అని ఏడ్వటం మొదలుపెట్టా. ఆయన ‘అదేం కాదురా వేరే కారణాలతో ఆగిపోయింది’ అని నన్ను ఓదార్చి అయిదు వందల రూపాయలు నా చేతిలో పెట్టి ధైర్యం చెప్పి పంపారు. చెన్నైలో జరిగిన నా వివాహానికి కూడా వచ్చారు. అంత గొప్ప డైరెక్టర్‌తో సినిమా మిస్సయితే బాధగా ఉంటుంది కదా!

మీకు కుక్కలంటే చాలా భయమట!

వేణు: అవునండీ! కుక్కలంటే ఏదో తెలియని భయం. నా కాలేజీ డేస్‌లో రోజూ సెకండ్‌ షో చూసొచ్చేవాళ్లం. మా ఇంటి ఓనర్‌కి పెద్ద కుక్క ఉండేది. ఒకసారి అర్ధరాత్రి నా ఫ్రెండ్‌ నేనూ వచ్చేసరికి అది మెలకువగా ఉంది. ‘దాన్ని ఏమీ అనొద్దు’ అని వాడికి చెప్పా. కానీ, వాడు దాన్ని చూసి వెక్కిరించాడు. ఒక్కసారిగా అది మాపై ఎటాక్‌ చేయడానికి వచ్చింది. నేను షాకై వాడినే కుక్కపైకి విసిరేశాను. ఆ కుక్క, వాడు ఇద్దరూ షాకయ్యారు. నేను మర్చిపోలేని సంఘటన ఇది. అప్పట్నుంచి ఇంకా భయం పెరిగింది. కానీ, ‘రామాచారి’లో కుక్కతో నటించేసరికి ఆ భయం మొత్తం పోయింది.

ప్రొడ్యూసర్‌ ఎస్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్‌ శ్యామ్‌ మీ స్నేహితుడా? ఇద్దరూ అనుకునే సినిమాలు తీశారా?

వేణు: అవును నా క్లాస్‌మేట్‌.. ఫస్ట్‌ ఫిల్మ్‌ కూడా ఆ ఆసక్తితోనే ప్రారంభమైంది. ఇద్దరికి ఎప్పుడూ సినిమాల గురించే చర్చ. మేమే కాదు త్రివిక్రమ్‌, సాయి మేమంతా ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకుని సినిమాల గురించే చర్చించుకునేవాళ్లం.

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేశారు. అంతలోనే ఇంత గ్యాప్‌ వచ్చింది. కారణమేంటి?

వేణు: కంఫర్ట్‌ జోన్ లేకపోతే నేను సినిమాలు చేయలేను. నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతోంది. ఫస్ట్‌ సినిమానే హిట్టవ్వడం చాలా సంతోషకరమైన విషయం. కానీ, నాకు చాలా బిడియం. మంచి సినిమాలు చేయాలన్న కోరిక ఉన్నా, నాకు ఎటువంటి పరిచయాలు లేకపోవటం, నేనెవర్నీ కలవకపోవటం ఇవన్నీ నా గ్యాప్‌కి కారణమయ్యాయి. నిజం చెప్పాలంటే నా ప్రయత్న లోపమే. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమా ఒప్పుకోకముందు వాళ్ల ఆఫీస్‌ నుంచి వరుసగా ఫోన్లు వచ్చాయి. ‘నేను సినిమాలు చేయటం లేదు’ అని వాళ్లతో చెప్పా. అయినా దర్శకుడు శరత్‌ మండవ వదిలిపెట్టలేదు.

పూరి జగన్నాథ్‌తో సినిమా మిస్సయ్యిందట కదా! అది ఎలా జరిగింది?

వేణు: అవునండీ! ఒకటి కాదు రెండు మిస్సయ్యాయి. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘దేశముదురు’. ఈ రెండు కథలను నాతో డిస్కస్‌ చేశారు. ముఖ్యంగా నాకు ‘దేశముదురు’ స్టోరీ బాగా నచ్చింది. దాని గురించి అశ్వనీదత్‌, ఈవీవీ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయాల్సి ఉన్నా వదులుకున్నా. కానీ, ఆ సినిమాలు నాతో జరగలేదు. మరోవైపు అశ్వనీదత్‌-ఈవీవీ మూవీ కూడా పట్టాలెక్కలేదు. నా డేట్స్‌ ఈవీవీగారి దగ్గర ఉండటంతో ‘వీడెక్కడి మొగుడండీ..!’ మూవీ చేశారు. ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. కోల్పోయిన సినిమాల గురించి పెద్దగా ఆలోచించను. నేను ప్రేక్షకులను నమ్ముకుని ముందుకి వెళ్లిపోతుంటా. ప్రతి గింజపైనా తినేవాడి పేరు రాసి ఉంటుంది కదా! అలాగే ప్రతి సినిమాపైనే వాళ్ల పేరు రాసి ఉంటుందని నమ్ముతా.

మీది లవ్‌ మ్యారేజ్‌ అట?విశేషమేంటి?

వేణు: నా భార్య పేరు అను. ఆమె మా బంధువుల అమ్మాయే. మొదటి నుంచి ఆమె అంటే ఇష్టం నాకు. కానీ, ఆమె కాలేజీ టాపర్‌. గోల్డ్‌మెడలిస్ట్‌. నేనేమో చదువులో ఏదో వెలగబెట్టాను(నవ్వులు). మా ఇద్దరికి సెట్‌ అవుతుందా అనుకున్నారు. మేం హ్యాపీగా పెళ్లి చేసుకున్నాం. (Venu interview) హాయిగా ఉన్నాం. ‘అదెలా సాధ్యమయ్యింది’ అని ఎవరైనా అడిగితే ‘అదే సైన్స్‌’ అని చెబుతాను. మాకొక పాప, బాబు.

మరి గ్యాప్‌ తరువాత ఇప్పుడు చేయనున్న సినిమాల గురించి చెప్తారా?

వేణు: శరత్‌ మండవ డైరెక్షన్‌లో రానున్న ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో పోలీసాఫీసర్‌గా నటించా. తరువాతి చిత్రంలో బ్లైండ్‌ రోల్‌ చేస్తున్నా. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపై దృష్టి పెట్టా. (కార్యక్రమంలోకి శరత్‌మండవ వచ్చారు)

డైరెక్టర్‌గా మీకిది ఎన్నో సినిమా?

శరత్‌ మండవ: సినిమాల పరంగా ఇది నాకు పన్నెండో సినిమా. ముందు స్క్రీన్‌ రైటర్‌గా, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీగా వర్క్‌ చేశా. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గానూ చేశా. డైరెక్టర్‌గా నాకు రెండో సినిమా. మొదటి సినిమా తమిళ్‌లో బాబీసింహా, ప్రకాశ్‌రాజ్‌ గారితో తీశా.

ఏం చెప్పి ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రానికి హీరోగా రవితేజను ఒప్పించారు?

శరత్‌ మండవ: ఆయనలాంటి పెద్ద హీరోలు ఎవరైనా కథ వినటానికి కేవలం అరగంట సమయం మాత్రమే ఇస్తానంటారు. కానీ, నేను కథ మొదలుపెట్టాక నాకు రెండు గంటలు సమయం ఇచ్చారు. కథ మొత్తం విని ‘చాలా బాగుంది నేను నీకు ఫోన్‌ చేస్తా’ అన్నారు. అన్నట్లుగానే 8 నెలలకు ఫోన్‌ చేసి ‘మనం ఈ సినిమా చేద్దాం’ అన్నారు.

ఈ సినిమాకి వేణు పాత్రను ఎలా డిజైన్‌ చేశారు?

శరత్‌ మండవ: ఇందులో మురళి అనే పోలీసాఫీసర్‌ పాత్రకి ఈయనైతేనే న్యాయం చేస్తారని ఫోన్‌ చేశా. ఈయన మాత్రం నాకు ఇంట్రెస్ట్‌ లేదన్నారు. నేను వదిలిపెట్టలేదు. ‘ఒకసారి కథ విని చెప్పండి’ అన్నాను. టైం ఇచ్చారు. కథ విని హగ్‌ చేసుకుని ‘ఈ రోల్‌ నేను చేస్తా’ అన్నారు. అన్నట్లుగానే ఈ పాత్రకు న్యాయం చేసేలా నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని