12th fail: నీ సినిమా థియేటర్‌లో ఎవరూ చూడరు.. ఓటీటీలో రిలీజ్‌ చేస్తే బెటర్‌ అన్నారట!

విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘12th ఫెయిల్‌’ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకను నిర్వహించారు.

Updated : 04 Feb 2024 11:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘12th ఫెయిల్‌’. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. స్ఫూర్తి నింపే చిత్రంగానూ నిలిచింది. రూ.20 కోట్లతో నిర్మిస్తే.. రూ.60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగానూ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలై 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘100 రోజులు వెనక్కి వెళ్తే, ఆరోజు మా సినిమా మొదటిసారి స్క్రీనింగ్‌ వేశాం. అందరూ రూ.100 కోట్లు, రూ.1000 కోట్ల కలెక్షన్ల గురించి మాట్లాడుకునే రోజులవి. అలాంటి సమయంలో నేను ఒకే విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ నన్ను నేను ప్రశ్నించుకున్నా. ‘ఈ సినిమా విషయంలో నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇలాంటి సినిమా తీశావు. నువ్వు నిజాయతీతో సినిమా తీస్తే, కలెక్షన్లు అవే వస్తాయి’ అనుకుంటూ ఉన్నా. నేను ఈ మూవీ తీస్తున్నప్పుడు నా భార్య సహా అందరూ దీన్ని ఓటీటీలో విడుదల చేయాలని సలహా ఇచ్చారు’’

‘‘విక్రాంత్‌, నువ్వు కలిసి చేసిన ఈ సినిమాను ఎవరూ చూడరు వినోద్‌. ఇలాంటి సినిమాలకు నేను కనెక్ట్‌ కాలేను. ఓపెనింగ్‌ కలెక్షన్లు వస్తే రూ.2 లక్షలు రావచ్చు. మొత్తం రూ.30 లక్షలు వస్తే గొప్పే’ అంటూ అందరూ నన్ను భయపెట్టారు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకు మార్కెటింగ్‌, ప్రచారం చేశాను. విడుదలైనప్పుడు నెమ్మదిగా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు’’ అని వినోద్‌ అనగానే ఆడిటోరియం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది.

వినోద్‌ చోప్రా సతీమణి అనుపమ చోప్రా మాట్లాడుతూ.. ‘12th ఫెయిల్’ విషయంలో తన అంచనా తప్పు అయిందని అందరి ముందు అంగీకరిస్తానని అన్నారు. మనోజ్‌ కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. విక్రాంత్‌ మాస్సే, మేధా శంకర్‌ కీలక పాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని