Taanakkaran Movie Review: రివ్యూ: రక్షక భటుడు

విక్రమ్‌ ప్రభు నటించిన ‘రక్షక భటుడు’ ఎలా ఉందంటే?

Published : 08 Apr 2022 17:53 IST

చిత్రం: రక్షక భటుడు; నటీనటులు: విక్రమ్‌ ప్రభు, అంజనీ నాయర్‌, లాల్‌, ఎం.ఎస్‌. భాస్కర్‌, మధుసూదనరావు, బోస్‌ వెంకట్‌ తదితరులు; సినిమాటోగ్రఫీ: మాదేష్‌ మాణిక్యం; సంగీతం: జిబ్రాన్‌; ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌; నిర్మాత: ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ప్రభు, పి.గోపీనాథ్‌, తంగ ప్రభాకరన్‌; రచన, దర్శకత్వం: తమిళ; విడుదల: డిస్నీ+హాట్‌స్టార్‌

వాస్తవ సంఘటనల ఆధారంగా ఎన్నో చిత్రాలు వెండితెరపై మెరిశాయి. కమర్షియల్‌ హంగులకు దూరంగా తెరకెక్కిన ఆ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అందుకు కారణం ఆ చిత్ర కథల్లో ఉన్న ఆత్మ. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు పాత్రలతో మమేకం కావడం. అలాంటి వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘తానక్కరన్‌’. విక్రమ్‌ ప్రభు కీలక పాత్రలో దర్శకుడు తమిళ దీన్ని తెరకెక్కించారు. తొలుత ‘పోలీసోడు’ అని పేరు పెట్టి తర్వాత ‘రక్షక భటుడు’గా మార్చి తెలుగులో విడుదల చేశారు. డిస్నీ +హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? పోలీస్‌ ట్రైనింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మెప్పించిందా?

కథేంటంటే: ఆనంద్‌ (విక్రమ్‌ ప్రభు) తన తండ్రికి ఇచ్చిన చివరి మాటకు కట్టుబడి పోలీస్‌ కావాలనుకుంటాడు. కానిస్టేబుల్‌ పరీక్ష పాసై శిక్షణకోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ స్కూల్‌ (పీఆర్‌ఎస్‌)కు వస్తాడు. అతడితో పాటు, దాదాపు పదిహేనేళ్ల కిందట పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికై కోర్టు కేసు కారణంగా అప్పుడు హాజరు కాలేకపోయిన కొందరు మధ్య వయస్కులు కూడా శిక్షణకు వస్తారు. పోలీస్‌ శిక్షణలో బ్రిటిష్‌ కాలం నాటి పద్ధతులను ఇంకా అనుసరించే పీఆర్‌ఎస్‌లో ముత్తు పాండు (మధు సూదనరావు), ఈశ్వరమూర్తి (లాల్‌)లదే హవా. అక్కడ వారు చెప్పిందే వేదం. ఎవరైనా ఎదురు తిరిగితే చావ బాదుతారు. శిక్షణ పేరుతో కొత్తగా వచ్చిన వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని ఆనంద్‌ వ్యతిరేకిస్తాడు. దీంతో ముత్తు పాండు, ఈశ్వరమూర్తి ఆనంద్‌పై ద్వేషాన్ని పెంచుకుంటారు. పీఆర్‌ఎస్‌ నుంచి ఖాకీ చొక్కాతో ఎలా వెళ్తావో చూస్తామంటూ బెదిరిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆనంద్‌ ఏం చేశాడు? శిక్షణలో అతడికి ఎదురైన అనుభావాలు ఏంటి? వాటిని దాటుకుని ఎలా పోలీస్‌ శిక్షణ పూర్తి చేసుకున్నాడు? అన్నది తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: సైన్యం, పోలీస్‌ శిక్షణ అనేది కొన్ని నియమ, నిబంధనలకు లోబడి ఉంటుంది. అభ్యర్థులను సుశిక్షుతులుగా తీర్చిదిద్దే క్రమంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తారు. క్రమశిక్షణే పరమావధిగా పోలీసు ట్రైనింగ్‌ ఉంటుంది. అసలు పోలీస్‌ ట్రైనింగ్‌ ఎలా ఉంటుంది? అక్కడ అభ్యర్థులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారన్న సబ్జెక్ట్‌ చాలా చిన్నది. తెలుగు సినిమాల్లో ఇలాంటి కథలు, ట్రైనింగ్‌ ఎపిసోడ్‌లు చాలా తక్కువ. ఆసాంతం పోలీస్‌ ట్రైనింగ్‌ చుట్టూ సాగిన చిత్రాలు దాదాపు లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే రెండున్నర గంటలు అదే చూపిస్తే డాక్యుమెంటరీ అవుతుంది. కానీ, ఆ సబ్జెక్ట్‌ను  కూడా ఆసక్తికరంగా బిగి సడలని కథనంతో తెరపై ఆవిష్కరించవచ్చని నిరూపించారు దర్శకుడు తమిళ. ‘రక్షకభటుడు’ చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. స్వాతంత్ర్యానికి ముందు పోలీస్‌ వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఎలా శిక్షణ ఇచ్చేవారన్న కథను చెబుతూ సినిమా మొదలు పెట్టిన దర్శకుడు.. తర్వాత తక్కువ సమయంలోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు.

కథానాయకుడు ఇతర పాత్రలు పీఆర్‌ఎస్‌లో ట్రైనింగ్‌ రావడం, శిక్షణకు వచ్చిన వారి పట్ల ఈశ్వరమూర్తి, ముత్తు పాండు మొదటి సీన్‌ నుంచే కఠినంగా వ్యవహరించడంతో వంటి ఆరంభ సన్నివేశాలతోనే అసలు కథేంటో ప్రేక్షకుడికి అర్థమైపోతోంది. అయితే, ట్రైనర్స్‌ ఎలాంటి పరీక్షలు పెడతారు? వాటిని కథానాయకుడు, తోటి వారు ఎలా భరిస్తారన్న ఆసక్తి ప్రేక్షకుడిలో మొదలవుతుంది. అందుకు తగినట్లుగానే భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుడిని మదిని మెలిపెడతాయి. ట్రైనర్స్‌ విధించే కఠిన ఆంక్షలు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు పరిగెత్తుతూ చనిపోవడం.. ఇలా ఒక్కో సన్నివేశం భావోద్వేగ భరితంగా సాగుతుంది. ట్రైనర్స్‌కు ఎదురు తిరిగితే శిక్ష తప్పదని తెలిసినా ఆనంద్‌ వారిని ప్రశ్నించడానికి వెనకడుగు వేయకపోవడంతో ముత్తు పాండు, ఈశ్వరమూర్తి, ఆనంద్‌ మధ్య నువ్వా-నేనా అన్నట్లు సన్నివేశాలు సాగుతాయి. ట్రైనర్స్‌ పెట్టే కఠిన పరీక్షలు వాటిని ఆనంద్‌ అతడి టీమ్‌ ఎలా ఎదుర్కొంది అన్నది తెరపై మాత్రమే చూడాలి. మధ్యలో కథానాయిక ట్రాక్‌తో కథ కాస్త పక్కకు వెళ్లినట్లు అనిపించినా పెద్దగా ప్రభావం మాత్రం పడదు. పతాక సన్నివేశాలు అలరిస్తాయి. పోలీస్‌ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అధికార మదం, లంచగొండితనం తదితర విషయాలను కూడా దర్శకుడు ప్రశ్నించిన తీరు బాగుంది. ఏదైనా ఒక విభిన్న కథను చూడాలనుకుంటే ఈ వీకెండ్‌ ‘రక్షకభటుడు’ చూడొచ్చు. డిస్నీ +హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఎవరెలా చేశారంటే: హీరో పోలీస్‌ ఆఫీసర్‌ అంటే కచ్చితంగా ఇన్‌స్పెక్టర్‌ లేదా ఐపీఎస్‌ అధికారి అయితేనే బాగుంటుందన్న కమర్షియల్‌ ఫార్ములాకు దూరంగా తెరకెక్కించిన చిత్రమిది. కానిస్టేబుల్‌ శిక్షణకు వచ్చిన యువకుడి పాత్రలో విక్రమ్‌ ప్రభు ఒదిగిపోయి నటించారు. శిక్షణలో పైఅధికారులను ప్రశ్నిస్తే తాట తీస్తారని తెలిసినా.. నీతి, నిజాయతీ కోసం వెన్ను చూపని వ్యక్తిగా ప్రతి సన్నివేశంలోనూ ఆయన నటన మెప్పిస్తుంది. పతాక సన్నివేశాల్లో విక్రమ్‌ నటన మరింత అలరిస్తుంది. ట్రైనర్స్‌ ఈశ్వరమూర్తిగా లాల్‌, ముత్తు పాండుగా మధుసూదనరావు నటనే సినిమాకు బలం. వారు తెరపై అంత కఠినంగా కనిపించబట్టే కథ అంతలా రక్తికట్టింది. కథానాయిక అంజలీ నాయర్‌కు పెద్దగా స్కోప్‌ లేదు. మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మాదేశ్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కానిస్టేబుల్‌ శిక్షణ సన్నివేశాలను, పరేడ్‌ జరిగే తీరును చూపించిన విధానం బాగుంది. ఫిలోమిన్‌ రాజు ఎడిటింగ్‌ ఓకే. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్‌ చేసింది. సినిమాలో ఉన్నవి రెండు పాటలే. దర్శకుడు తమిళ కమర్షియల్‌ హంగుల జోలికి పోలేదు. ఆయన రాసుకున్న, తీసిన ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉంది. హీరో పాత్రను ఎలివేట్‌ చేయడం కోసం కథ దాటి కసరత్తులు చేయకపోవడం అభినందనీయం.

బలాలు

+ విక్రమ్‌ ప్రభు నటన

+ దర్శకత్వం

+ కథ, కథనాలు

బలహీనతలు

- లవ్‌ ట్రాక్‌

చివరిగా: శిక్షణలో ‘రక్షక భటుడు’.. మెప్పిస్తాడు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు