Vikrant Rona Review: రివ్యూ: విక్రాంత్‌ రోణ

సుదీప్‌ నటించిన ‘విక్రాంత్‌ రోణ’ ఎలా ఉందంటే..?

Updated : 28 Jul 2022 14:20 IST

Vikrant Rona Review: చిత్రం: విక్రాంత్ రోణ‌; న‌టీన‌టులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతాఅశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, ర‌విశంక‌ర్ గౌడ‌, మ‌ధుసూద‌న‌రావు త‌దిత‌రులు; సంగీతం: అజ‌నీష్ లోక‌నాథ్; కూర్పు: ఆశిక్ కుసుగొల్లి; ఛాయాగ్రహ‌ణం: విలియం డేవిడ్‌; క‌ళ‌: శివ‌కుమార్‌; ద‌ర్శక‌త్వం: అనూప్ భండారి; నిర్మాతలు: జాక్ మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్‌; విడుద‌ల తేదీ: 28-07-2022

‘ఈగ’ (Eega) చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గర‌య్యారు న‌టుడు కిచ్చా సుదీప్ (Sudeep)‌. ఆయ‌నిప్పుడు ‘విక్రాంత్ రోణ’గా (Vikrant Rona) వినోదాలు పంచేందుకు బాక్సాఫీస్ ముందుకొచ్చారు. సుదీప్ హీరోగా న‌టించిన తొలి పాన్ఇండియా సినిమా ఇది. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో త్రీడీలో తెర‌కెక్కించారు. అనూప్ భండారి ద‌ర్శక‌త్వం వ‌హించారు. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం.. సినిమా విడుద‌ల‌కు ముందే ‘ర‌క్కమ్మ’ పాట నెట్టింట వైర‌ల్‌గా మార‌డంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. మ‌రి ఈ సినిమా క‌థేంటి? విక్రాంత్ రోణ‌గా సుదీప్ చేసిన సాహ‌సాలు ప్రేక్షకుల్ని మెప్పించాయా? తెలుసుకుందాం ప‌దండి.

క‌థేంటంటే: కొమ‌ర‌ట్టు అనే ఊరిలో జ‌రిగే క‌థ ఇది. ఆ ఊరిలో ఓ పాడుబ‌డ్డ ఇల్లు. ఆ ఇంట్లో ఓ బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడన్నది ఊరి ప్రజ‌ల న‌మ్మకం. ఆ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న బావిలో ఒక శ‌వం దొరుకుతుంది. అది ఆ ఊరి ఇన్‌స్పెక్టర్ శ‌వం. దానికి త‌ల ఉండ‌దు. ఈ హ‌త్యకు పాల్పడిన నేర‌స్థుల్ని ప‌ట్టుకోవ‌డం కోసం కొత్తగా వ‌చ్చిన ఇన్‌స్పెక్టర్‌ విక్రాంత్ రోణ (కిచ్చా సుదీప్‌) (Sudeep) ఇన్వెస్టిగేష‌న్ మొద‌లుపెడ‌తాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో అప్పటికే ప‌దుల సంఖ్యలో పిల్లలు హ‌త్యకు గురైన‌ట్లు తెలుసుకుంటాడు. మ‌రి వాళ్ల మ‌ర‌ణాల‌కు.. పోలీస్ హ‌త్యకు ఉన్న లింకేంటి? కొత్తగా ఊరికొచ్చిన సంజు (నిరూప్ భండారి) ఎవ‌రు? ఈ కేసుకు విక్రాంత్ వ్యక్తిగ‌త జీవితానికి ఉన్న లింకేంటి? అస‌లు ఆ ఊరిలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడు ఎవ‌రు? అన్నది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ఇదొక యాక్షన్ అడ్వెంచర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌. ఈ క‌థ చెప్పడం కోసం ద‌ర్శకుడు సృష్టించుకున్న ఊరు.. దాన్ని అందంగా చూపించిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ త‌ల్లి త‌న కూతురుతో క‌లిసి కొమ‌ర‌ట్టుకు రావ‌డం.. దారిలో ఊహించ‌ని ప్రమాదం ఎదుర‌వ‌డం.. ఓ ముసుగు రూపం వారిపై దాడిచేయ‌డం.. ఇలా ఉత్కంఠ‌భ‌రితంగా సాగే స‌న్నివేశాల‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా ప్రారంభ‌మ‌వుతుంది. అక్కడి నుంచే అస‌లు ఆ ఊరిలో ఏం జ‌రుగుతోందా అని తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి ప్రేక్షకుల్లోనూ మొద‌ల‌వుతుంది. కిచ్చా సుదీప్ ప‌రిచ‌య స‌న్నివేశాలు.. ఈ క్రమంలో వ‌చ్చే యాక్షన్ ఎపిసోడ్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. మ‌ధ్యలో సంజు కుటుంబ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రీ మెలోడ్రామాలా సాగుతున్నట్లు అనిపిస్తాయి. విక్రాంత్ ఇన్‌స్పెక్టర్ హ‌త్య కేసు గురించి ఇన్వెస్టిగేష‌న్ మొద‌లు పెట్టాకే కథ‌లో వేగం పెరుగుతుంది. అయితే, థ్రిల్లర్ క‌థల్లో ర‌హ‌స్యాన్ని ఛేదించే క్రమం ఆస‌క్తిక‌రంగా సాగుతున్నప్పుడే ప్రేక్షకులు క‌థ‌తో క‌నెక్ట్ అవ్వగలుగుతారు. అయితే దీన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవ‌డంలో ద‌ర్శకుడు త‌డ‌బ‌డ్డాడు. దీనికి తోడు సంజు ల‌వ్‌ ట్రాక్‌, జ‌నార్ధన్‌ గంభీర్ (మ‌ధుసూధ‌న్ రావు) స్మగ్లింగ్ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని గంద‌ర‌గోళానికి గురిచేస్తాయి. మ‌ధ్య మ‌ధ్యలో వచ్చే కొన్ని భయంకరమైన ఎపిసోడ్‌లు ప్రేక్షకుల్లో ఉత్కంఠ‌త రేకెత్తిస్తాయి. విరామానికి ముందొచ్చే ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇక ద్వితీయార్ధమంతా రొటీన్ రివెంజ్‌ డ్రామాలా సాగుతుంది. హ‌త్యల‌కు పాల్పడుతున్న నేర‌స్థుడి గ‌తంలో బ‌ల‌మైన సంఘ‌ర్షణ క‌నిపించదు. ప‌తాక స‌న్నివేశాల్లో క‌నిపించే విజువ‌ల్స్.. సుదీప్ గ‌తానికి సంబంధించిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. అయితే, సినిమాని ముగించిన తీరు అంత‌గా మెప్పించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్ స్టైలిష్‌గా క‌నిపించారు. ఆ పాత్రలో ఆయ‌న ప‌లికించిన హావ‌భావాలు, చెప్పిన‌ సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. నిరూప్ భండారి పాత్ర బోరింగ్‌గా అనిపించినా చివ‌ర్లో స‌ర్‌ప్రైజ్ చేస్తుంది. క‌నిపించింది కాసేపు మాత్రమే అయినా ర‌క్కమ్మగా జాక్వెలిన్ అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంది. ఆమె చేసిన స్పెష‌ల్ సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిచింది. సినిమాలో మిగిలిన ఏ పాత్రల‌కు అంత‌గా ప్రాధాన్యం దొర‌క‌లేదు. ద‌ర్శకుడు క‌థ‌ను ఆరంభించిన తీరు ఆక‌ట్టుకున్నా.. దాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ముందుకు తీసుకెళ్లడంలో త‌డ‌బ‌డ్డాడు. క‌థ‌లో అన‌వ‌స‌ర‌మైన సైడ్ ట్రాక్స్‌ను త‌గ్గించి.. మ‌రిన్ని ట్విస్ట్‌లు జోడించి ఉంటే సినిమా మ‌రో స్థాయిలో ఉండేది. శివ కుమార్ ఆర్ట్ వ‌ర్క్ ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం, విలియం ఛాయాగ్రహ‌ణం సినిమాకి మ‌రింత బ‌లాన్నిచ్చాయి. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాత‌లు ఖ‌ర్చు పెట్టిన ప్రతి రూపాయి తెర‌పై ప్రతి ఫ్రేంలో క‌నిపిస్తుంది.

బ‌లాలు:
సుదీప్ న‌ట‌న‌
ఆర్ట్ వ‌ర్క్‌, నేప‌థ్య సంగీతం
యాక్షన్ ఎపిసోడ్స్‌

బ‌ల‌హీన‌తలు:
రొటీన్‌గా సాగే క‌థ‌నం
ద్వితీయార్ధం

చివ‌రిగా: విక్రాంత్ రోణ‌.. ప్రయ‌త్నం ఫ‌లించ‌లే..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని