Sai Dharam Tej: ‘బ్రో’ రిలీజ్‌.. అభిమానులకు సాయితేజ్‌ విన్నపం

‘బ్రో’ (BRO) రిలీజ్‌ను దృష్టిలో ఉంచుకుని సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) తాజాగా ఓ ట్వీట్‌ పెట్టారు. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Updated : 27 Jul 2023 14:02 IST

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘బ్రో’ (BRO). పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కీలకపాత్ర పోషించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బ్రో’ రిలీజ్‌ను దృష్టిలో ఉంచుకుని అభిమానులను ఉద్దేశిస్తూ సాయితేజ్‌ మాట్లాడారు. వేడుకల్లో జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.

ఆ విషయంలో పవన్‌కు 12.. సాయిధరమ్‌ తేజ్‌కు 1: ‘బ్రో’ సినిమా విశేషాలివీ!

‘‘డియర్‌ ఫ్యాన్స్‌.. మీరు నాపై చూపిస్తోన్న అమితమైన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ‘బ్రో’ని ఒక స్పెషల్‌ ప్రాజెక్ట్‌గా భావించి మా చిత్రాన్ని మీరెంతగానో సెలబ్రేట్‌ చేస్తున్నారు. దీనిని మరింత ఎక్కువమందికి చేరువ చేయడం కోసం భారీ కటౌట్స్‌, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మీ ప్రేమను పొందుతున్నందుకు గర్వపడుతున్నా. బ్యానర్స్‌, కటౌట్స్‌ ఏర్పాటు చేసే సమయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా వ్యవహరించండి. మీరు సురక్షితంగా ఉండటమే నాకు ముఖ్యం. ఈ సంతోషకరమైన వేడుకల్లో మీకు ఏమైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను’’ అని సాయితేజ్‌ పేర్కొన్నారు.

తమ అభిమాన నటీనటులకు సంబంధించిన ప్రత్యేకమైన రోజులను సెలబ్రేట్‌ చేసుకుంటూ ఫ్యాన్స్‌ తరచూ భారీ కటౌట్స్‌, బ్యానర్స్‌ ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే విద్యుదాఘాతానికి గురై పలువురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల సూర్య పుట్టినరోజుని పురస్కరించుకుని బ్యానర్స్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలానికి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న సూర్య తీవ్ర భావోద్వేగానికి గురై.. బాధిత కుటుంబానికి వీడియో కాల్‌ చేసి మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని