BRO: ఆ విషయంలో పవన్‌కు 12.. సాయిధరమ్‌ తేజ్‌కు 1: ‘బ్రో’ సినిమా విశేషాలివీ!

అగ్ర హీరో పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. జులై 28న విడుదలకానున్న ఈ సినిమా సంగతులపై ఓ లుక్కేయండి..

Published : 27 Jul 2023 11:04 IST

Bro Movie: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘బ్రో’ (Bro). ఈ క్రేజీ కాంబో నటించిన ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి కొన్ని విశేషాలు చూద్దామా (BRO on July 28th)..

  • ‘మెగా హీరోలతో మల్టీస్టారర్‌?’, ‘మరో రీమేక్‌లో పవన్‌ కల్యాణ్‌?’, ‘పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించనున్నారా?’.. కొన్ని నెలల క్రితం టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టిన వార్తలివి. ఓ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్నలకు సమాధానమిచ్చిన దర్శకుడు సముద్రఖని (Samuthirakani).. పవన్‌, సాయితేజ్‌లతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాని ప్రారంభించారు. #PKSDT వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కిన ఈ మూవీ టైటిల్‌ని మేలో ‘బ్రో’గా ఖరారు చేశారు.
  • పవన్‌ కల్యాణ్‌ నటించిన 28వ, సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన 15వ సినిమా ఇది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. మామాఅల్లుళ్లు కలిసి నటించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
  • పవన్‌కి ఇది 12వ రీమేక్‌ చిత్రం. ఇంతకు ముందుకు ఆయన నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘ఖుషి’, ‘అన్నవరం’, ‘తీన్‌మార్‌’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’, ‘వకీల్‌సాబ్‌’, ‘భీమ్లానాయక్‌’ సినిమాలు వేరే భాషలో హిట్‌ అయిన సినిమాలకు రీమేక్స్‌. రీమేక్‌ విషయంలో సాయిధరమ్‌ తేజ్‌కి ఇది తొలి సినిమా.
  • 2021 అక్టోబరులో విడుదలై, కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘వినోదయ సిత్తం’ (Vinodhaya Sitham) సినిమాకి రీమేక్‌గా ‘బ్రో’ని రూపొందించారు. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. కాలం అవతారంలో దివి నుంచి భువికి వచ్చిన దేవుడి నేపథ్యం ప్రధానాంశం. మార్క్‌ అలియాస్‌ మార్కండేయులుగా సాయితేజ్‌ సందడి చేయనున్నారు.
  • పవన్‌- సాయితేజ్‌ కాంబోకి శ్రీకారం చుట్టిందెవరో కాదు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas). ఈ సినిమాకి ఆయన స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. ఓరోజు సముద్రఖని ‘వినోదయ సిత్తం’ సినిమా స్టోరీ గురించి చెప్పగా త్రివిక్రమ్‌కు బాగా నచ్చింది. వెంటనే, 10 నిమిషాల్లో స్థానికతకు తగ్గట్లు స్క్రిప్టులో మార్పులు సూచించి, హీరోలుగా పవన్‌, సాయితేజ్‌లను ఎంపిక చేశారట.

ఆ పాట చూడటానికి రాత్రి 2గంటల వరకూ బయట కూర్చొన్న పవన్‌

  • మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ రీమేక్‌నూ డైరెక్ట్‌ చేశారు. తమిళ సినిమాలో తంబి రామయ్య, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో రామయ్య పాత్రను సాయిధరమ్‌ తేజ్‌, సముద్రఖని రోల్‌లో పవన్‌ కల్యాణ్‌ కనిపించనున్నారు.
  • రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా ఈ సినిమా చిత్రీకరణను త్వరగా ముగించారు పవన్‌ కల్యాణ్‌. 21 రోజుల్లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తిచేశారాయన. జనసేన చేపట్టిన ‘వారాహి విజయయాత్ర’లోనే తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. ప్రారంభంలో సుమారు 15 నిమిషాలు మినహా పవన్‌ మొత్తం సినిమాలో కనిపిస్తారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన పాత్రకావడంతో షూటింగ్‌ జరిగినన్ని రోజులు పవన్‌ ఉపవాసం చేశారని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 53 రోజుల్లో సినిమా పూర్తయింది.
  • రీ ఎంట్రీలో నటించిన ‘వకీల్‌సాబ్‌’, ‘భీమ్లానాయక్‌’ చిత్రాల్లో పవన్‌ సీరియస్‌ రోల్స్‌ ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఎంటర్‌టైనింగ్‌ క్యారెక్టర్‌లో ఆయన్ను చూడాలనుకునే అభిమానులకు ఈ సినిమా పర్‌ఫెక్ట్‌ అనే విషయం ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.
  • హీరోయిన్లు కేతిక శర్మ (Ketika Sharma), ప్రియాప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) ఓ పాటలో నటించింది. బ్రహ్మానందం, సుబ్బరాజు, వెన్నెల కిశోర్‌, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు సందడి చేయనున్నారు.
  • సెన్సారు బోర్డు (Central Board of Film Certification) ఈ చిత్రానికి క్లీన్‌ ‘యు’ (U) సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సినిమా నిడివి: 134 నిమిషాలు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని