Texas: తెలుగు వైద్యుడు జయరాం నాయుడికి అరుదైన గౌరవం

అమెరికాలో స్థిరపడిన తెలుగు వైద్యుడు బావికాటి జయరాం నాయుడుకి అరుదైన గౌరవం దక్కింది. వైద్య వృత్తిలో చేసిన విశేష సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం.. ఓ వీధికి ఆయన పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. 

Updated : 13 Jan 2024 15:24 IST

టెక్సాస్‌: అమెరికాలో స్థిరపడిన తెలుగు వైద్యుడు బావికాటి జయరాం నాయుడుకి అరుదైన గౌరవం లభించింది. వైద్య వృత్తిలో చేసిన విశేష సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం.. ఓ వీధికి ఆయన పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్దకొట్టాలపల్లికి చెందిన ఆయన.. ప్రస్తుతం టెక్సాస్‌లో ఉంటున్నారు. అమెరికాలోనే  ప్రముఖ గుండెవైద్య నిపుణుడిగా ఖ్యాతి గడించారు. 1968లో అమెరికాకు వెళ్లిన ఆయన.. గుండె సంబంధిత రోగుల కోసం 300 పడకల ఆస్పత్రిని నిర్మించారు. ఆయన సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం టెక్సాస్‌ మెడికల్‌ బోర్డు సభ్యుడిగా నియమించింది. ఆయన సోదరుడు రాజశేఖర్‌ నాయుడు కూడా అమెరికాలోనే స్థిరపడి పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. 

వృత్తి రీత్యా వైద్యుడైన జయరాం నాయుడు సొంత ఊరి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ‘బావికాటి రంగప్ప, లక్ష్మమ్మ మెమోరియల్‌’ పేరిట ఓ ట్రస్టును ఏర్పాటు చేసి.. గ్రామంలో వివిధ సౌకర్యాలను సమకూరుస్తున్నారు. పెద్ద కొట్టాలపల్లిలో వైద్యసేవలు అందించేందుకు 1997లో రూ.20 లక్షలతో ఆస్పత్రి నిర్మించారు. నూతన పరికరాలు ఏర్పాటు చేసి, వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక గదులు కూడా నిర్మించారు. శుభకార్యాల నిర్వహణ కోసం కల్యాణ మండపం నిర్మించారు. నీటిశుద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉన్నత పాఠశాలలో 2015లో కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయించారు.  పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తున్న ముగ్గురు విద్యార్థులకు ప్రతి ఏటా రూ.30వేల నగదు పురస్కారాలు అందిస్తున్నారు. ఇవే కాకుండా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భారీ మొత్తం ఆర్థిక సాయం చేస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. జయరాం నాయుడుకి తగిన గౌరవం దక్కిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని