కెనడాలో ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు

కెనడాలోని శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ షిర్డీ సాయిబాబా మందిరంలో దేవి నవరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక అలంకరణలు చేశారు.

Updated : 11 Oct 2022 23:52 IST

అట్టావా: కెనడాలోని శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ షిర్డీ సాయిబాబా మందిరంలో దేవి నవరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు స్వర్ణ కవచ, బాలా త్రిపుర సుందరి, గాయత్రి దేవి, అన్నపూర్ణ దేవి, లలిత త్రిపుర సుందరి, మహా లక్ష్మీ, సరస్వతి, దుర్గ మహిషాసుర మర్దిని, శ్రీ రాజ రాజేశ్వరి అలంకారాలు చేశారు. ప్రధానార్చకులు రాజ్‌కుమార్ శర్మ ప్రతి ఉదయం షిర్డీ బాబా అభిషేకం, అమ్మవారి అభిషేకం, సర్వతో భద్ర, లింగాలతో భద్ర పూజలు, గణపతి, నవగ్రహ, శ్రీ రుద్ర, మహా విష్ణువు, మహాలక్ష్మి సరస్వతి, దుర్గా జపము మరియు హోమములు జరిపించారు.ప్రతి రోజు సాయంత్రము షిర్డీ సాయిబాబా వారి హారతులు, అమ్మవారి లలిత సహస్రనామ, ఖడ్గమాల, కనకధారా స్తోత్ర సహిత కుంకుమార్చనలు, చతుర్వేద పారాయణం, సకల  రాజోపచార పూజలు, హారతులు ప్రతి నిత్యం నిర్వహించారు.  పాడ్యమి రోజున చిన్నారులకు బాలపూజలు, కన్య పూజలు, మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ, అక్షరాభ్యాసాలు, దుర్గాష్టమి నాడు సుహాసిని పూజలు, మహర్నవమి నాడు మహిషాసుర మర్ధిని పూజ, విజయ దశమి నాడు మరకత రాజరాజేశ్వరి పూజలు ఘనంగా జరిగాయి. నవరాత్రి శుభసందర్భంగా తొమ్మిది రోజులు భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అమ్మవారి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వైభవంగా భక్తితో నిర్వహించారు. 

శరన్నవరాత్రి వేడుకల్లో ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు లలిత, శైలేష్, స్వయం సేవకులు మాధవి నిట్టల, మాధవి చల్ల మరియు శోభన కీలక పాత్ర పోషించారు. శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ మందిర ఆధ్వర్యంలో కెనడాలో గత అయిదు సంవత్సరాలుగా పంచాయతన యాగాలు, లలిత సహస్రనామ కోటి కుంకుమార్చన యజ్ఞము, షిరిడి బాబా పాదుక యాత్రలు మరియు అనేక దైవ, ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ భగవత్ సంకల్పంతో ఎంతో మంది వాలంటీర్లు, ఉత్తర అమెరికాలో నివసిస్తున్న స్వయంసేవకుల సహాయంతో నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకురాలు లలిత పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని