ఘంటసాల పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలి

అమరగాయకుడు ఘంటసాల పేరును ఆంధ్రప్రదేశ్‌లో ఒక జిల్లాకు పెట్టాలని డా.వంశీ రామరాజు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

Published : 14 Feb 2022 22:27 IST

సింగపూర్‌: అమరగాయకుడు ఘంటసాల పేరును ఆంధ్రప్రదేశ్‌లో ఒక జిల్లాకు పెట్టాలని డా.వంశీ రామరాజు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఘంటసాల శతజయంతి సంవత్సరంగా నిర్వహిస్తున్న ‘ఘంటసాల స్వర రాగ మహా యాగం’లో భాగంగా డా.సయ్యద్ రహమతుల్లా గానావధానం కార్యక్రమం అంతర్జాల వేదికగా జరిగింది. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ రామరాజు మాట్లాడుతూ ఘంటసాలను భారతరత్న పురస్కారంతో గౌరవించాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని సూచించారు. వంశీ సంస్థ తరఫున ఘంటసాల చదువుకున్న విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ఏటా ఉత్తమ విద్యార్థికి  స్కాలర్‌షిప్‌ అందించబోతున్నామని ప్రకటించారు.

మండలి బుద్ధ ప్రసాద్, మాధవపెద్ది సురేష్, సాలూరి వాసూరావు, భువనచంద్ర వంటి ప్రముఖులు కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. నిర్వాహకులుగా అమెరికా నుంచి వంగూరి చిట్టెన్ రాజు, సింగపూర్ నుంచి కవుటూరు రత్నకుమార్ పాల్గొనగా, రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పృచ్ఛకులుగా గోవర్ధన్ మల్లెల, తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి, రమ‌కంచిభొట్ల, రాధిక నోరి, లక్ష్మి రాయవరపు, సత్య మల్లుల, ఊలపల్లి భాస్కర్, వెంకటేష్, సుబ్బు వి పాలకుర్తి, కాత్యాయని గణేశ్న, ఉసిరికల తాతాజీ, డాక్టర్ బూరుగుపల్లి వ్యాసకృష్ణ, విక్రమ్ కుమార్ పెట్లూరు, వెంకప్ప భాగవతుల, రాణి మాధవ్, డాక్టర్ వెంకటపతి తరిగోపుల, పీసపాటి జయ, రాజేష్ తోలేటి, ఆర్ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని