Chandrababu Arrest: తెదేపా-జనసేన కలిసి పోటీ చేస్తాయి : పవన్‌ కల్యాణ్‌

గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబును నారా లోకేశ్‌, బాలకృష్ణతో కలిసి పవన్‌ ములాఖత్‌ అయ్యారు.

Updated : 14 Sep 2023 19:01 IST

అమరావతి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా (TDP), జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని, అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపించారని విమర్శించారు. ఆయనకు సంఘీభావం ప్రకటించడానికే రాజమహేంద్రవరం వచ్చినట్లు చెప్పారు.

‘‘ చంద్రబాబుతో గతంలో విభేదించి సెపరేటుగా పోటీ చేశా. రాజకీయాల్లో జనసేన తరఫున నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలని, దేశ సమగ్రత బలంగా ఉండాలనుకున్నా. జనసేన ఏర్పాటు చేసినప్పుడు కూడా అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగిందని చెప్పాను. సగటు మనిషి ఆవేదన గురించి మాట్లాడాను. ఆరోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు చాలా మందికి ఇబ్బందిగా మారాయి’’ అని అన్నారు. జగన్‌ మద్దతుదారులకు ఇంకా 6 నెలలే సమయం ఉందని, వాళ్లు యుద్ధం కోరుకుంటే, వాళ్లకు యుద్ధమే ఇస్తామని అన్నారు. ఎవరినీ వదిలిపెట్టబోమని,  ఇసుక దోపిడీ, మైనింగ్, బెల్ట్‌ షాపులు నిర్వహించిన వారందరినీ బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జనసేన-తెదేపా కలిసి పోటీ చేస్తాయని,  భాజపా కూడా ఈ నిర్ణయానికి కలిసి వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. జగన్‌ గురించి ప్రధానికి తెలియని విషయాలేవీ లేవని అన్నారు.

అందుకే మోదీకి మద్దతిచ్చా

‘‘ నేను 2014లో నరేంద్రమోదీకి మద్దతు తెలిపిన సమయంలో ఆయన సొంత పార్టీ వ్యక్తులే ఆయన ప్రధాని కాకూడదని అనుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి నేను మోదీ మద్దతు తెలిపాను. ఈ రోజున నేను నా మనసును ఆవిష్కరిస్తున్నా. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలి. మా నాన్నగారి అస్థికలు కాశీలో కలపడానికి వెళ్లినప్పుడు ముంబయిలో ఉగ్రవాదులు తాజ్‌ హోటల్‌పై దాడి జరిగింది. అంతకుముందు పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీగారికి మద్దతు తెలినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ఆ రోజు నుంచి నరేంద్రమోదీ పిలిస్తే తప్ప నేను వెళ్లలేదు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని 2014లో భాజపా, తెదేపాతో కలిసి పోటీ చేశాం. ఆంధ్రప్రదేశ్‌కు చాలా అనుభవం ఉన్న నాయకుడు కావాలని భావించా. 2020 విజన్‌ గురించి మాట్లాడినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ఇవాళ లక్షలాది మాదాపూర్‌ వంటి ఐటీ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఆయనతో ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే విభేదించా. వ్యక్తిగతంగా ఏనాడూ విభేదించలేదు.’’ అని పవన్‌ అన్నారు.

‘‘ రూ.300 కోట్ల స్కామ్‌ పేరు చెప్పి మాజీ సీఎంకు అవినీతి అంటగడుతున్నారు. గుజరాత్‌లో ప్రారంభమైన కంపెనీ కాంట్రాక్టు ఇచ్చారు. అది హార్డ్‌వేర్‌ను సప్లయ్‌ చేస్తుంది. ఏదైనా తప్పు జరిగితే అందుకు సంబంధించిన వ్యక్తులను విచారించాలి. అలాంటిది సైబరాబాద్‌ వంటి సిటీని నిర్మించిన వ్యక్తిని ఇలాంటి కేసులో ఇరికించడం బాధాకరం. ఈడీ విచారించాల్సిన ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ఇలా చేయడం రాష్ట్రానికి మంచిది కాదు. పోనీ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా. వాజ్‌పేయా? లాల్ బహదూర్‌ శాస్త్రినా? ఈడీ కేసులను ఎదుర్కొంటున్నాడు. దేశం విడిచి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తీసుకుంటున్నాడు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసే వ్యక్తి. అందరినీ భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి’’

అడ్డగోలు దోపిడీ

‘‘డేటా చౌర్యం జరుగుతోందని వాపోయిన వ్యక్తి ఇవాళ వాలంటీరు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అదే పని చేస్తున్నాడు. అడ్డగోలు హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదు. అడ్డగోలు దోపిడీ మాత్రమే చేస్తున్నారు. మద్యం విషయంలోనే కోట్లు జేబుల్లోకి వేసుకుంటున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వ్యక్తులను ఏపీ సరిహద్దుల్లో ఆపేస్తున్నారు. అలా ఆపే హక్కు ఎవరికీ లేదు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లోనే చెప్పాను. దానికే 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని కలగన్న వ్యక్తిలో ఉలికిపాటు మొదలైంది. చంద్రబాబు భద్రత విషయాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తా.’’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

అందుకే లోకేశ్‌, బాలకృష్ణ పక్కన నిల్చున్నా

సీఎం జగన్‌ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. అందుకే  ఇవాళ లోకేశ్‌, బాలకృష్ణ పక్కన నిల్చున్నానని అన్నారు. ‘‘ గుజరాత్‌లోని ముంద్రా పోర్టు మూడు వేల కేజీల హెరాయిన్‌ దొరికింది. దాని మూలాలు విజయవాడలోని ఆశి కంపెనీవని తేలాయి. మీడియాలో వార్తలే రాకుండా చేశారు. ఇవాళ చంద్రబాబుకు జరిగిందని కాదు, రేపు అందరికీ ఇలా జరిగే అవకాశం ఉంది. విశాఖలో నిరసన తెలిపినందుకే జనసేన నేతలపై కేసులు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నా. వైకాపా దౌర్జన్యాన్ని అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదు. ఈ అరాచకాలు దశాబ్దాలు కొనసాగుతాయి. అందుకే ఈ రోజు నిర్ణయం తీసుకున్నా. జనసేన-తెదేపా కలిసి వెళ్తాయి. ఇది మా భవిష్యత్‌ కోసం కాదు.. ఆంధ్ర ప్రదేశ్‌ భవిష్యత్‌ కోసం తీసుకున్న నిర్ణయం. బిల్‌ క్లింటన్‌ లాంటి వ్యక్తిని సైబరాబాద్‌కు తీసుకొచ్చిన వ్యక్తిని ఇవాళ రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచారు. ఆర్థిక నేరస్థుడైన జగన్‌ నేను కోనసీమ పర్యటనకు వెళ్తే 2వేల మంది క్రిమినల్స్‌ను దించాడు. ఏ ఒక్కరినీ వదలబోం. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలి. రాజశేఖర్‌రెడ్డి ఇలా వ్యవహరించలేదు. చంద్రబాబులాగే రేపు ఉన్నతాధికారులందరినీ కేసుల్లో ఇరికించే విధానాలను జగన్‌ తీసుకొచ్చాడు. సొంత చెల్లిని, తల్లిని వదిలేసిన వ్యక్తి, బాబాయిని చంపించిన వ్యక్తిని అధికారులు నమ్ముకొంటున్నారు. రేపు మీకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ముందే ఆలోచించుకోండి.’’ అని పవన్‌ హితవు పలికారు.

సీట్ల విషయం తర్వాత మాట్లాడతా

సీట్ల పంపకాల గురించి తర్వాత మాట్లాడతానని పవన్‌ తెలిపారు. జనసేన, తెదేపా శ్రేణులకు ఎన్నికలకు సిద్ధం చేస్తామన్నారు. ‘‘  జనసేన ఒంటరిగా పోటీ చేయమని చెప్పడానికి వైకాపా నేతలకు ఏ హక్కు ఉంది. జగన్‌ను పులివెందుల కాదని, అమలాపురంలో పోటీ చేయమని నేను చెబుతున్నానా? చంద్రబాబు అరెస్టు అయ్యారని తెలిసి వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. ఒకరి చావు, అరెస్టు గురించి సంబరాలు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన విషయం నాకు తెలియగానే చాలా బాధపడ్డాను’’ అని పవన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు