Viswarup: గౌరవానికి భంగం కలిగితే రాజకీయాలు వదులుకుంటా: మంత్రి విశ్వరూప్‌

‘సంతోషంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతా. గౌరవానికి భంగం కలిగితే వదులుకుంటా. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కింద కూర్చోవడం, వేరొకరు నన్ను కింద కూర్చోబెట్టడం జరగలేదు’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ స్పష్టం చేశారు.

Updated : 13 Aug 2023 08:52 IST

మహిళలతో సీఎం ఫొటో అయినందునే మోకాలిపై కూర్చున్నానని వెల్లడి

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ‘సంతోషంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతా. గౌరవానికి భంగం కలిగితే వదులుకుంటా. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కింద కూర్చోవడం, వేరొకరు నన్ను కింద కూర్చోబెట్టడం జరగలేదు’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ స్పష్టం చేశారు. శుక్రవారం అమలాపురంలో సీఎం పర్యటన సందర్భంగా మహిళలతో సీఎం ఫొటోలు దిగిన వేదికపై మంత్రి మోకాళ్లపై కూర్చుండడంపై సాగిన ప్రచారం నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఎం పర్యటనలో భాగంలో ఫ్లెక్సీల వివాదమూ సృష్టించారని పేర్కొన్నారు. తనతోపాటు తన పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి, రెండోవాడు శ్రీకాంత్‌ పేర్లతో అయిదేసి చొప్పున ఫ్లెక్సీలు వేయించామని, వాటన్నింటినీ తానే డిజైన్‌ చేయించానని అన్నారు. కుమారుల ఫ్లెక్సీల్లో తన పేరు, తన ఫ్లెక్సీల్లో కుమారుల పేర్లు లేకుండానే వేయించామని.. దీని ఆసరాగా తీసుకుని కుటుంబంలో కలహాలున్నాయని ప్రచారం చేయడం బాధించిందని పేర్కొన్నారు. సీఎం సభా వేదికపై తాను మోకాళ్లపై కూర్చున్న తీరుపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. అది మహిళల కార్యక్రమం, ఎంపీ మహిళ అయినందున కుర్చీలో కూర్చున్నారని అన్నారు. తొలుత తాను బయట ఉన్నానని.. ముఖ్యమంత్రి పిలిస్తేనే వేదికపైకి వెళ్లానని తెలిపారు. వెనకనున్న మహిళలకు అడ్డుగా ఉండొద్దనే కారణంతోనే ఫొటో కోసం తాను మోకాళ్లపై కూర్చోవాల్సి వచ్చిందని వివరించారు. దళిత మంత్రిని అవమానించారని ప్రచారం చేయడం తగదన్నారు. స్థానిక నాయకుడు వాసంశెట్టి సత్యంను సీఎంకు కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి పరిచయం చేయడంతో నెలకొన్న వివాదంపై స్పష్టతనివ్వాలని విలేకరులు కోరగా.. దీనిపై సత్యంనే ప్రశ్నించాలని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు