కొత్త పార్లమెంటు ‘మోదీ మల్టీప్లెక్స్‌’

కొత్త పార్లమెంటు భవనం గందరగోళంగా ఉందని కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘కొత్త పార్లమెంటు భవనాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించారు.

Published : 24 Sep 2023 04:43 IST

ఒకరినొకరు చూసుకోవాలంటే బైనాక్యులర్లు ఉండాలి: జైరాం రమేశ్‌

ఈనాడు, దిల్లీ: కొత్త పార్లమెంటు భవనం గందరగోళంగా ఉందని కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘కొత్త పార్లమెంటు భవనాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. వాస్తవానికి అది మోదీ ఉద్దేశాలను చాలా ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తోంది. దీన్ని ‘మోదీ మల్టీప్లెక్స్‌’ లేదంటే ‘మోదీ హోటల్‌’ అని పిలవాలి. ప్రత్యేక సమావేశాల సందర్భంగా పార్లమెంటు లోపల, బయట లాబీల్లో పూర్తి గందరగోళం కనిపించింది. ఉభయసభల్లోని హాళ్లు తగిన విధంగా లేకపోవడం వల్ల సభ్యులు ఒకరిని ఒకరు చూసుకోవాలంటే బైనాక్యులర్లు ఉపయోగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పాత పార్లమెంటు భవనంలో సభ్యులు పరస్పరం మాట్లాడుకోవడానికి అనువైన వాతావరణం ఉండేది. ఒక సభ నుంచి మరో సభకు, సెంట్రల్‌ హాల్‌, ఇతర కారిడార్లకు వెళ్లడం సులభంగా ఉండేది. పార్లమెంటును విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఆ బంధం కొత్త భవనంలో పూర్తిగా లోపించింది. పాత భవనం గోళాకారంలో ఉండటంవల్ల మనం ఎక్కడ దారి తప్పినా చివరకు మొదటికి వచ్చే వాళ్లం. ఇప్పుడు కొత్త భవనంలో ఒకసారి దారితప్పితే అడవిలో దారి తప్పినట్లే అవుతుంది. పాత భవనంలోకి వెళ్లడం కోసం ఎదురుచూస్తున్నా. పార్టీలకు అతీతంగా చాలా మంది సభ్యులు కూడా ఇదే భావన వ్యక్తంచేస్తున్నారు. ఈ పార్లమెంటును ఉత్తమంగా ఎలా ఉపయోగించుకోవాలన్నది బహుశా 2024లో ప్రభుత్వం మారిన తర్వాత కనుక్కోవచ్చు’’ అని జైరాం ట్విటర్‌లో పేర్కొన్నారు. పార్లమెంటుకు వ్యతిరేకంగా మాట్లాడడం కాంగ్రెస్‌కు ఇది మొదటిసారి కాదని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని