బిధూడీపై కఠినచర్యకు విపక్షాల ఒత్తిడి

లోక్‌సభలో బీఎస్పీ సభ్యుడు దానిశ్‌ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ రమేశ్‌ బిధూడీపైన కఠినచర్య తీసుకోవాలంటూ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు శనివారం ఒత్తిడి పెంచాయి.

Published : 24 Sep 2023 05:12 IST

సస్పెన్షన్‌ కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖలు, ట్వీట్లు
ప్రధానిని కించపరిచి మమ్మల్ని రెచ్చగొట్టారు : భాజపా

దిల్లీ: లోక్‌సభలో బీఎస్పీ సభ్యుడు దానిశ్‌ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ రమేశ్‌ బిధూడీపైన కఠినచర్య తీసుకోవాలంటూ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు శనివారం ఒత్తిడి పెంచాయి. ఈ అంశాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి నివేదించాలని ‘ఇండియా’ కూటమి కోరుతోంది. బిధూడీని తక్షణం సస్పెండు చేయాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ విప్‌ అయిన కె.సురేశ్‌ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. సభలో ఈ ఘటన జరిగినపుడు ప్యానెల్‌ స్పీకర్‌ స్థానంలో ఈయనే ఉన్నారు. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది సహా టీఎంసీ, ఎన్సీపీ తదితర పార్టీల సభ్యులు బిధూడీని సస్పెండు చేయాల్సిందేనంటూ ప్రకటనలు, ట్వీట్లు చేశారు. బిహార్‌ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ భాజపా సభ్యుడు బిధూడీ ప్రవర్తనను వీధిరౌడీలతో పోల్చారు. ప్రముఖ ముస్లిం సంస్థ ‘జమియత్‌ ఉలేమా ఏ హింద్‌’ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది సిగ్గుచేటు ఘటనగా తెలిపింది. ‘‘ముస్లింలపై తీవ్రమైన విద్వేషం ఇపుడు ప్రజాస్వామ్య ఆలయం దాకా కూడా చేరింది. బిధూడీపై కఠినచర్య తీసుకోవడం స్పీకర్‌కు రాజ్యాంగపరమైన నైతిక బాధ్యత’’ అని జమియత్‌ చీఫ్‌ మౌలానా అర్షద్‌ మదానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు.. విపక్షాలపై భాజపా ఎంపీ నిశికాంత్‌ దుబే ఎదురుదాడికి దిగారు. సభలో దానిశ్‌ అలి వైఖరిని ఆయన ప్రశ్నించారు. బీఎస్పీ ఎంపీతోపాటు టీఎంసీ, డీఎంకే వంటి పార్టీల వ్యాఖ్యలపై విచారణకు ఓ కమిటీ నియమించాలని స్పీకర్‌ను కోరుతూ ట్విటర్లో ఓ లేఖ పోస్ట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అలీ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా అధికార పార్టీ సభ్యుడిని రెచ్చగొట్టారని నిశికాంత్‌ దుబే అన్నారు. కాగా, తాను ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని బీఎస్పీ ఎంపీ దానిశ్‌ అలీ దీన్ని ఖండించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ సైతం భాజపా వైఖరిని సమర్థిస్తూ ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ప్రధాని మోదీ, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ ఉదయ్‌ భాన్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. రాహుల్‌గాంధీతోపాటు ఏ ప్రతిపక్ష నేత అయినా వీటిని ఖండించారా అని ఆయన ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని