మీ ఓటు అభివృద్ధికా.. విధ్వంసానికా

‘ఎంతోమంది మహనీయులు పుట్టిన తులసివనం లాంటి కృష్ణా జిల్లా గడ్డపై.. ప్రస్తుతం గంజాయి మొక్కలు మొలిచాయి. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి.

Updated : 08 Apr 2024 06:59 IST

మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు
పోలవరం లేకపోతే.. కృష్ణా డెల్టా మొత్తం ఎడారే
రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు
పామర్రు, ఉయ్యూరు ప్రజాగళం సభల్లో చంద్రబాబు

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌-అమరావతి, మచిలీపట్నం: ‘ఎంతోమంది మహనీయులు పుట్టిన తులసివనం లాంటి కృష్ణా జిల్లా గడ్డపై.. ప్రస్తుతం గంజాయి మొక్కలు మొలిచాయి. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. ఎవరెక్కువ బూతులు తిడితే వాళ్లకు మంత్రిపదవులు, ఎక్కువ దాడులు చేస్తే.. పదోన్నతులు ఇచ్చే దారుణమైన పరిస్థితులొచ్చాయి. ఇలాంటి రౌడీయిజం కావాలా? ఈ ఎన్నికల్లో మీ ఓటు అభివృద్ధికా.. విధ్వంసానికా? సంక్షేమానికా.. సంక్షోభానికా? అనేది ప్రజలంతా నిర్ణయించుకోవాలి. ఈ గంజాయి మొక్కలను పీకేద్దాం. ఈ అయిదేళ్లలో అభివృద్ధి గురించి జగన్‌ ఒక్కసారైనా మాట్లాడారా? అమరావతి నిర్మాణం జరిగితే.. కృష్ణాజిల్లాలో భూములకు విలువ పెరిగేది. కానీ.. అమరావతి రాజధానితో ఈ గంజాయి బ్యాచ్‌ ఆడుకుంది. మూడు గుంతలు పూడ్చలేరు గానీ, మూడు రాజధానులు కడతారా? ప్రజలంతా ఆలోచించాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు, ఉయ్యూరుల్లో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.

రైతు కూలీలు, కౌలు రైతులను ఆదుకుంటా

‘తెదేపా హయాంలో పోలవరాన్ని 72% పూర్తిచేసి అందిస్తే.. జగన్‌ దాన్ని అక్కడే ఆపేశారు. తెదేపా ప్రభుత్వం కొనసాగితే 2022లోనే పోలవరం ద్వారా నీళ్లు ఇచ్చేవాళ్లం. పోలవరం లేకపోతే.. కృష్ణాడెల్టా మొత్తం ఎడారిగా మారిపోతుంది. ఈ అయిదేళ్లలో ఎప్పుడూ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ధాన్యం కొనడం లేదు.. ఏంటీ అరాచకం? అధికారంలోకి రాగానే.. అన్నదాతకు ఏటా రూ.20వేలు ఇస్తాను. రైతు కూలీలు, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ పెట్టి.. ఆదుకుంటా. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తా

‘యువతకు జాబ్‌ క్యాలెండర్‌, డీఎస్సీ అని జగన్‌ మోసగించారు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. అయిదేళ్లలో 20 లక్షల కొలువులు అందిస్తాను. మీ ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు కావాలా? గంజాయి కావాలా? తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. పిల్లలకు ఉద్యోగాల్లేక.. మీరు కూలి చేసి వారికి డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితికి జగన్‌ తీసుకొచ్చారు’ అని ధ్వజమెత్తారు.

మంచి నేతలంతా వైకాపాను వీడుతున్నారు

‘కొనకళ్ల నారాయణరావు, దేవినేని ఉమా లాంటి నేతలకు కొన్ని కారణాల వల్ల ఈసారి టికెట్లు ఇవ్వలేకపోయాం. అయినా.. వాళ్లు ఏమీ మాట్లాడకుండా పార్టీ జెండా మోస్తూ.. సైనికుల్లా పనిచేస్తున్నారు. వాళ్లను నేను మరచిపోను. జగన్‌ దెబ్బకు అమరావతి పోయింది, పోలవరం పోయిందని గుర్తించి.. వైకాపా లోక్‌సభ టికెట్‌ ఇస్తామన్నా.. వద్దని బయటకొచ్చిన మంచి వ్యక్తి బాలశౌరి. వైకాపాలో ఉంటే జాతికి ద్రోహం చేసినట్టేనని భావించి కొలుసు పార్థసారథి బయటకొచ్చారు. మనకు ఇలాంటి మంచి నేతలు కావాలి. కానీ.. జగన్‌కు గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ కావాలి. అందుకే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైకాపాను వదిలేసి బయటకొస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

గుడివాడలో ఏంటీ అరాచకం

‘గుడివాడలో గంజాయి తాగే బ్యాచ్‌ కళాశాలకు వెళ్లే ఓ విద్యార్థినిని రోజూ వేధిస్తుంటే.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ అమ్మాయిని నడిరోడ్డుపై ఆ గంజాయి బ్యాచ్‌ హేయంగా అవమానించారు. విద్యార్థిని తండ్రి నడిపే దుకాణంలో గంజాయి పెట్టి, పోలీసుల సహకారంతో మరింత వేధించారు. ఏంటీ అరాచకం? ఈ రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. అందుకే.. ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే పొత్తు పెట్టుకున్నాం’ అని తెలిపారు.

ముస్లింలకు నా విజ్ఞప్తి ఒక్కటే

‘గతంలో ఎన్డీయేలో తెదేపా ఉన్నప్పుడు ముస్లిం సోదరులకే ఎక్కువ మేలు జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూను రెండోభాషగా చేసింది తెదేపానే. ముస్లింలకు ప్రత్యేకంగా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పెట్టా. హైదరాబాద్‌, విజయవాడ, కడపలో హజ్‌ హౌస్‌లు కట్టించా. రంజాన్‌ తోఫా, ఆడబిడ్డలకు దుల్హాన్‌ ఇచ్చాం. మైనారిటీ విద్యార్థులకు విదేశీవిద్య, ఇమామ్‌లకు పారితోషికం ఇచ్చింది తెదేపానే. జగన్‌ మాటలు నమ్మొద్దు. నిన్న నందికొట్కూరులో ఒక బిడ్డ నమాజుకు వెళ్లి వస్తుంటే.. వైకాపా నాయకుడు బురఖా ఎత్తిచూసి అవమానించాడు. ఇదేంటని నిలదీసినందుకు.. ఆమె కుటుంబసభ్యులను చెప్పుతో కొట్టడమేంటి’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ కంటే ముందు గొడ్డలి వస్తోంది

‘పవన్‌ లాంటి వ్యక్తినీ అవమానించేలా జగన్‌ మాట్లాడుతున్నారు. ఆయన అభిమానులు తలచుకుంటే.. జగన్‌ పరిస్థితేంటి? జగన్‌ ఆకాశంలో తిరిగితే.. రోడ్డు పక్కనున్న చెట్లను నరికేస్తున్నారు. కర్ఫ్యూ పెడుతున్నారు. ఇలాంటి వాళ్లను నా జీవితంలో చూడలేదు. జగన్‌ కంటే.. ముందు గొడ్డలి వస్తోంది. ఫ్యాన్‌ను తీసేసి.. గొడ్డలే మీ పార్టీ గుర్తుగా పెట్టుకోండి..’ అని ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా అధికారుల తీరు మారాలి

ఇప్పుడు జగన్‌కు ఏ అధికారమూ లేదనీ, ఏదైనా ఎన్నికల సంఘమే చేయాలని చంద్రబాబు తెలిపారు. అధికారులకు అన్ని పార్టీలూ సమానమేనని, అయినా కొందరు జగన్‌ కోసమే పనిచేస్తున్నారని, రేపో ఎల్లుండో ఆయన మాజీ సీఎం అవుతారన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.


ఇంగ్లిష్‌ కాదు.. ఐటీ, ఏఐ నేర్పించాలి

‘జగన్‌ ఇంగ్లిష్‌ నేర్పిస్తారట, ఈతరం వాళ్లకు ఇంగ్లిష్‌ నేర్పించేదేంటి? ఇప్పుడు యువతకు ఐటీ నేర్పించాలి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) కావాలి. అవన్నీ నేను నేర్పిస్తా. జగన్‌ రాతియుగం వైపు తీసుకెళ్తే.. నేను స్వర్ణయుగం వైపు తీసుకెళ్తా. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి.. తెలుగు పిల్లలందరికీ అండగా ఉంటాను’ అని చంద్రబాబు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని