Smriti Irani: ‘ఆరోపణలు ఉపసంహరించుకోవాలి’.. కాంగ్రెస్‌ నేతలకు స్మృతి ఇరానీ లీగల్‌ నోటీసులు

తన కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్‌ నడుపుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు...

Published : 25 Jul 2022 02:49 IST

దిల్లీ: తన కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్‌ నడుపుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. తన కుమార్తెపై చేసిన ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. ఈ క్రమంలోనే బేషరతుగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలంటూ ముగ్గురు నేతలకు, కాంగ్రెస్‌ పార్టీకి లీగల్ నోటీసు పంపారు. ఇందులో పవన్ ఖేడా, జైరాం రమేష్, నెట్టా డిసౌజాలు ఉన్నారు. ‘మంత్రిగా, ప్రజాజీవితంలోని వ్యక్తిగా ఉన్న మా క్లయింట్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, ఆమెతోపాటు ఆమె కుమార్తెను అగౌరవపరిచేందుకు తప్పుడు ఆరోపణలు చేశారు’ అని నోటీసులో పేర్కొన్నారు. మంత్రి కుమార్తెకు గోవాలో బార్‌ నిర్వహణలో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మంత్రి కుమార్తె గోవాలో నడుపుతున్న రెస్టారంట్‌లో నకిలీ లైసెన్సుతో బార్‌ నడుపుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, తన క్లయింట్ ఎలాంటి రెస్టారంట్‌ను నడపడం లేదని, దానికి ఆమె యజమాని కాదని స్మృతి కుమార్తె తరఫు న్యాయవాది ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. మంత్రి సైతం.. కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ తప్పుడు ఆరోపణలపై కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. ఈ మేరకు తాజాగా లీగల్‌ నోటీసులు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు