ద్యుతీచంద్‌ BMW అమ్మకానికి వేరే కారణం

భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ ఇటీవల తన బీఎండబ్ల్యూ కారు అమ్మకం కోసం సోషల్‌మీడియలో పోస్టు చేయడం, దాన్ని తొలగించడం వివాదాస్పదంగా మారింది...

Published : 18 Jul 2020 00:06 IST

ట్రైనింగ్‌ కోసం కాదని స్పష్టం చేసిన స్టార్‌ స్ప్రింటర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ ఇటీవల తన బీఎండబ్ల్యూ కారు అమ్మకం కోసం సోషల్‌మీడియలో పోస్టు చేయడం, దాన్ని తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై బుధవారం ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు చేసిన ఆమె అంత లగ్జరీ కారును ఎందుకు అమ్మాలనుకుంటున్నదీ వివరించారు.  అందరూ అనుకుంటున్నట్లు  శిక్షణ కోసం కాదనీ, ఆ కారుకు అయ్యే నిర్వహణ ఖర్చులు‌ భరించలేక అమ్మాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అలాంటి కారు ఉండటం తనకు ఇష్టమే అయినా, దాన్ని నిర్వహించేంత ఆర్థిక స్థోమత తనకు లేదని చెప్పారు. ఆ కారును ఎక్కువగా వాడటం లేదని, అలాగే తన శిక్షణ కోసమే దాన్ని అమ్మాలనుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని ఆ ప్రకటనలో వివరించారు.

‘ఒడిశా ప్రభుత్వం, నేను చదువుకున్న కేఐఐటీ యూనివర్శిటీ నాకెప్పుడూ అండగా నిలిచాయి. అయితే, నా శిక్షణకు అయ్యే ఖర్చు తక్కువేం కాదు. మరీ ముఖ్యంగా 2021 ఒలింపిక్స్‌కు చాలా ఖర్చవుతుంది. అయితే, ఈ కారును అమ్మితే వచ్చిన డబ్బును ట్రైనింగ్‌ కోసం ఉపయోగించుకుంటా. కరోనా పరిస్థితులు సమసిపోయాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో ఆ కారును కొంటా. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నేను ప్రభుత్వానికి కానీ, కేఐఐటీ యూనివర్శిటీకి కానీ భారం కాకూడదని నిర్ణయించుకున్నా. అలాగని నేనిప్పుడైతే ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో లేను’ అని ద్యుతి వివరించారు. 

చివరగా తన శిక్షణకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా తనకు అండగా ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తానే సొంతంగా కారు అమ్మి ఆ డబ్బును అలా వాడుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దాన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాను ఎవరి మీదా ఫిర్యాదులు చేయడం లేదని, అలాగే తాను ఆర్థికంగా బాగా లేనని కూడా చెప్పట్లేదని స్పష్టం చేశారు. ‘నేను ఈ దేశం బిడ్డని. నన్ను ఆదుకోడానికి చాలా మంది ఆత్మీయులు ఉన్నారు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ తీసుకురావాలని నన్ను దీవించండి’ అని కోరారు.  

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని