World Cup 2023: చెన్నై, కోల్‌కతాలో పాక్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు!

భారత్‌ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను చెన్నై, కోల్‌తాల్లో ఆడేందుకు పాకిస్థాన్‌ మొగ్గుచూపుతోందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.

Published : 12 Apr 2023 08:21 IST

దిల్లీ: భారత్‌ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను చెన్నై, కోల్‌తాల్లో ఆడేందుకు పాకిస్థాన్‌ మొగ్గుచూపుతోందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ‘‘బీసీసీఐ, భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై చాలా ఆధారపడి ఉంది. ఒకవేళ పాకిస్థాన్‌నే ఎంచుకోమంటే.. తమ మ్యాచ్‌ల్లో చాలా వరకు కోల్‌కతా, చెన్నైలో ఆడేందుకే మొగ్గుచూపుతుంది. పాక్‌ 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తన మ్యాచ్‌ను కోల్‌కతాలో ఆడింది. ఇక చెన్నై ఆ జట్టుకు చిరస్మరణీయ వేదిక. పాక్‌కు ఈ వేదికలు సురక్షితంగా అనిపిస్తాయి కూడా’’ అని ఓ ఐసీసీ అధికారి చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ అక్టోబరు 5న ఆరంభమవుతుంది. వేదికలు 12. ఇంద]ులో హైదరాబాద్‌ కూడా ఉంది. టోర్నమెంట్లో ప్రతి జట్టూ లీగ్‌ దశలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది.

పాక్‌ ఆసియాకప్‌లో ఆడకపోతే..: ఈ ఏడాది ఆసియాకప్‌లో ఆడడానికి తిరస్కరిస్తే తాము 30 లక్షల డాలర్లు నష్టపోతామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అధిపతి నజమ్‌ సేథి అన్నాడు. ఆతిథ్య హక్కులకు సంబంధించి తమ ప్రతిపాదనకు ఒప్పుకోకుంటే నష్టానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ‘‘ఆసియాకప్‌లో తన మ్యాచ్‌లను భారత్‌ విదేశాల్లో ఆడుతుంది. మిగతా మ్యాచ్‌లకు పాకిస్థాన్‌ ఆతిథ్యమిస్తుంది. ఇది మా ప్రతిపాదన. ఇలా కాకుండా వేరే ఏ షెడ్యూలునూ మేం ఒప్పుకోం, టోర్నీలో ఆడం’’ అని అన్నాడు. పాకిస్థాన్‌లో ఆసియాకప్‌ ఆడేందుకు బీసీసీఐ ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీసీబీ.. భారత్‌ తన మ్యాచ్‌లను మరో దేశంలో ఆడొచ్చని ప్రతిపాదించింది. ‘‘అలా చేస్తే మేం ఆతిథ్య హక్కులు కోల్పోం. ఇక భారత్‌ భద్రత కారణాలను చూపలేదు. భారత ప్రభుత్వ అనుమతి ఇవ్వకపోతే అందుకు లిఖితపూర్వక ఆధారం చూపాలని బీసీసీఐతో చెప్పాం’’ అని సేథి చెప్పాడు. ‘‘ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పాకిస్థాన్‌లో ఆడుతున్నాయి. అలాంటప్పుడు పాక్‌ పర్యటనలో భద్రత గురించి భారత్‌ ఆందోళన చెందకూడదు’’ అని పేర్కొన్నాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆదాయంలో 80 శాతం భారత్‌, పాక్‌ మ్యాచ్‌ల నుంచే వస్తాయని సేథి అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు