Team India: విరామంలో సరదాగా టీమ్‌ఇండియా

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దూసుకెళ్తోంది. వరుసగా అయిదు విజయాలతో జోరుమీదుంది.

Updated : 27 Oct 2023 13:52 IST

ధర్మశాల: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దూసుకెళ్తోంది. వరుసగా అయిదు విజయాలతో జోరుమీదుంది. అపజయమే లేని జట్టు కప్పును ముద్దాడటమే లక్ష్యంగా సాగుతోంది. మధ్యలో దొరికిన విరామంలో సరదాగా గడుపుతున్న జట్టు.. తీవ్ర ఒత్తిడి ఉండే ఈ మెగా టోర్నీలో పునరుత్తేజాన్ని అందుకుంటోంది. చివరగా ఆదివారం న్యూజిలాండ్‌తో ఆడిన రోహిత్‌ సేన.. మళ్లీ వచ్చే ఆదివారం ఇంగ్లాండ్‌తో తలపడనుంది. దీంతో ఆటగాళ్లు, జట్టు కోచ్‌, సహాయక సిబ్బందికి వారం రోజుల పాటు విరామం లభించింది. ధర్మశాలలోనే ఉంటూ ఈ సమయాన్ని జట్టు ఆస్వాదిస్తోంది. జట్టు స్ఫూర్తి ఉన్నతంగా కొనసాగేందుకు, ఆటగాళ్ల మధ్య బంధం మరింత దృఢంగా మారేందుకు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సమీపంలోని పర్వతాల్లో ట్రెక్కింగ్‌ అందులో భాగమే. అయితే గాయాల బారిన పడే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్తగా ట్రెక్కింగ్‌, పారాగ్లైడింగ్‌ చేసే అవకాశం ఆటగాళ్లకు కల్పించలేదు. దీంతో ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌, బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ తదితరులు కొండలెక్కారు. విరాట్‌ కోహ్లి ఓ ఆశ్రమాన్ని సందర్శించాడు. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోసం హోటల్లో సరదాగా ర్యాంప్‌ షో నిర్వహించారు. ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ లాగా టీమ్‌ఇండియా బృందంలోని ప్రతి ఒక్కరూ ర్యాంప్‌ వాక్‌ చేశారు. మరోవైపు కొంతమంది ఆటగాళ్లు తమ జీవిత భాగస్వాములతో కలిసి బయట భోజనాన్ని రుచి చూశారు. ఇంకొందరేమో హోటల్‌ గదుల్లోనే సేద తీరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని