Dilip: ద్రవిడ్‌ మెచ్చిన కోచ్‌

మ్యాచ్‌ ముగిసిన అనంతరం.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో జట్టంతా కూర్చుని ఉండగా.. ఓ వ్యక్తి ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసిస్తూ, వారి వల్ల జట్టుకు ఎలా మేలు జరిగిందన్నది వివరిస్తూ.. ఉత్సాహపరుస్తూ, స్ఫూర్తినింపుతూ చివరికి మ్యాచ్‌లో అత్యుత్తమంగా ఫీల్డింగ్‌ ప్రదర్శన చేసిన ఆటగాడి మెడలో ఓ పతకం వేయడం గమనించేవుంటారు

Updated : 21 Nov 2023 06:57 IST

ఈనాడు క్రీడావిభాగం

మ్యాచ్‌ ముగిసిన అనంతరం.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో జట్టంతా కూర్చుని ఉండగా.. ఓ వ్యక్తి ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసిస్తూ, వారి వల్ల జట్టుకు ఎలా మేలు జరిగిందన్నది వివరిస్తూ.. ఉత్సాహపరుస్తూ, స్ఫూర్తినింపుతూ చివరికి మ్యాచ్‌లో అత్యుత్తమంగా ఫీల్డింగ్‌ ప్రదర్శన చేసిన ఆటగాడి మెడలో ఓ పతకం వేయడం గమనించేవుంటారు. ప్రతి మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ విడుదల చేసిన ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఫైనల్లో టీమ్‌ఇండియా ఓడిన అనంతరం.. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆటగాళ్లను ఓదారుస్తూ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన కోహ్లికి పతకం అందించిన వీడియో ఇప్పుడు విస్తృమవుతోంది. స్ఫూర్తిమంతమైన మాటలతో.. ఆటగాళ్లలో ప్రేరణ నింపుతున్న అతడే దిలీప్‌. టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌. అతడు తెలుగు వాడే. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి వాస్తవ్యుడు.

సాధారణంగా మ్యాచ్‌లో గెలిచిన జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సందడి కనిపిస్తుంది. ఓడిన జట్టు నిరాశలో మునిగిపోతుంది. నెగ్గిన జట్టులోనూ బాగా ఆడిన ఆటగాళ్లు (బ్యాటర్‌ లేదా బౌలర్‌) కాస్త ఎక్కువ ఆనందంగా ఉంటారు. మిగతా వాళ్లు తమ కిట్‌లు సర్దుకుని హోటల్‌కు బయల్దేరుతారు. అయితే మైదానంలో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు కీలకమే.. వారి భాగస్వామ్యం ముఖ్యమేనన్న సందేశాన్ని ఆటగాళ్లకు పంపడమే ఉత్తమ ఫీల్డర్‌ అవార్డు ఉద్దేశం. ‘‘అవార్డు ఆలోచన నాలుగు నెలల కిందట ప్రారంభమైంది. ప్రపంచకప్‌ వీడియోలతో అందరికీ తెలిసింది. ప్రతి మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉత్తమ ఫీల్డర్‌కు పతకం ఇస్తున్నాం. మైదానంలో ఆటగాళ్లు ప్రదర్శించే పట్టుదల, స్ఫూర్తి గణాంకాలలో కనిపించకపోవచ్చు. స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ అనుభూతి తెలుస్తుంది. క్యాచ్‌లు పట్టడం, పరుగులు ఆపినందుకు మార్కులు వేయొచ్చు. కాని ఆటగాడు మైదానంలో ఎంత విలువ తీసుకొస్తున్నాడన్నదీ కీలకం’’ అన్నది దిలీప్‌ అభిప్రాయం.

క్రికెటర్‌ అవుదామనుకుని..: హైదరాబాద్‌ అండర్‌-25 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిలీప్‌కు బలమైన ఆర్థిక నేపథ్యమేమీ లేదు. పాఠశాల పిల్లలకు లెక్కల్లో ట్యూషన్లు చెబుతూ క్రికెట్‌ ఆడాడు. అండర్‌-25 జట్టుకు ఆడిన అనంతరం హెచ్‌సీఏ లీగ్స్‌లో క్లబ్‌ క్రికెట్‌ కొనసాగించాడు. ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టుకు సహాయక ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. అనంతరం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) లెవెల్‌-1, లెవల్‌-2 కోచ్‌ శిక్షణ పూర్తిచేశాడు. లెవెల్‌-3 శిక్షణలో జాతీయ స్థాయిలో నంబర్‌వన్‌గా వచ్చాడు. భారత అండర్‌-19, మహిళల జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఇండియా-ఎ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎంపికవడం దిలీప్‌ కెరీర్‌లో మలుపు. అప్పట్లో ఇండియా-ఎకు రాహుల్‌ ద్రవిడ్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దిలీప్‌ పని విలువలు, క్రమశిక్షణ ద్రవిడ్‌కు ఎంతగానో నచ్చడంతో అతనిపై నమ్మకం పెరిగింది. రెండేళ్ల క్రితం ద్రవిడ్‌ భారత జట్టుకు చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగానే దిలీప్‌కు ఫీల్డింగ్‌ విధులు అప్పగించాడు. అప్పటికే ఎన్‌సీఏలో సీనియర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌లు ఉన్నా.. బీసీసీఐ పెద్దల నుంచి సిఫార్సులు వస్తున్నా ద్రవిడ్‌ మాత్రం దిలీప్‌ వైపే మొగ్గుచూపాడు. ఫలితమే భారత జట్టు ఫీల్డింగ్‌, డ్రెస్సింగ్‌ రూమ్‌లో కనిపిస్తున్న మార్పు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని