IND vs AUS: మళ్లీ సరికొత్తగా

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి బాధను కలిగిస్తుండొచ్చు.. ఆ పరాజయం వెంటాడుతుండొచ్చు.. కానీ అది గతం. ఆ ఫలితాన్ని మర్చిపోయి మరో కప్‌ దిశగా టీమ్‌ఇండియా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన సమయమొచ్చింది.

Updated : 06 Dec 2023 14:41 IST
 

రాత్రి 7 గంటల నుంచి

ఆసీస్‌తో భారత్‌ టీ20 సిరీస్‌
 నేడే విశాఖలో తొలి మ్యాచ్‌

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి బాధను కలిగిస్తుండొచ్చు.. ఆ పరాజయం వెంటాడుతుండొచ్చు.. కానీ అది గతం. ఆ ఫలితాన్ని మర్చిపోయి మరో కప్‌ దిశగా టీమ్‌ఇండియా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన సమయమొచ్చింది. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌పై గురి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకు ఆసీస్‌ జట్టుతోనే అయిదు మ్యాచ్‌ల సిరీస్‌తో.. విశాఖపట్నం వేదికగా భారత్‌ మళ్లీ కొత్తగా పయనాన్ని మొదలెట్టనుంది. నేడే తొలి టీ20. ఇప్పుడు ఫార్మాట్‌.. ఆటగాళ్లు.. కోచ్‌లు.. ఇలా అన్నీ మారాయి. తెలుగు గడ్డపై నెగ్గి.. అనంతరం సిరీస్‌నూ దక్కించుకుని.. కంగారూ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవడమే కాదు.. టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాలనూ భారత్‌ మెరుగ్గా ఆరంభించాలన్నది అభిమానుల ఆశ.  

విశాఖ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి: ప్రపంచకప్‌ ముగిసిన నాలుగు రోజులకే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ రూపంలో అభిమానులను అలరించేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. గురువారమే తొలి మ్యాచ్‌. ప్రపంచకప్‌లోని భారత్‌ జట్టులో ఉన్న వాళ్లలో.. ఇప్పుడు సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మాత్రమే ఈ సిరీస్‌ ఆడబోతున్నారు. ప్రపంచకప్‌లో ఇషాన్‌ రెండు మ్యాచ్‌లే ఆడగా.. ప్రసిద్ధ్‌కు ఆ అవకాశమూ రాలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లాడనున్నాడు. కోచ్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కమిన్స్‌, వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, హేజిల్‌వుడ్‌, స్టార్క్‌, గ్రీన్‌, కోచ్‌ మెక్‌డొనాల్డ్‌ ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యారు. ఆండ్రూ బోరెవెక్‌ తొలిసారి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంకో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్‌తో పాటు డిసెంబర్‌ 19న ఐపీఎల్‌ మినీ వేలం నేపథ్యంలో ఈ సిరీస్‌లో సత్తాచాటాలని ఆటగాళ్లు చూస్తున్నారు. పొట్టి కప్పు కంటే ముందు భారత్‌ 11 టీ20లే ఆడుతుంది. అందుకే మనకు ప్రతి మ్యాచ్‌ ముఖ్యమే.

సూర్య ఏం చేస్తాడో?: వన్డే ప్రపంచకప్‌లో అంచనాలను అందుకోలేకపోయిన సూర్యకుమార్‌ 7 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 106 పరుగులే చేశాడు. కానీ ఇప్పుడు తనకు అచ్చొచ్చిన టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. టీ20లో ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్య ఇప్పుడు జట్టుకు కెప్టెన్‌ కూడా. టీ20ల్లో జట్టును నడిపిస్తున్న హార్దిక్‌ గాయంతో దూరమవడంతో తొలిసారి జట్టును నడిపించే బాధ్యత సూర్యపై పడింది. బ్యాటింగ్‌లో, కెప్టెన్సీలో అతనెలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ప్రపంచకప్‌ ఫైనల్లో స్లో బౌన్సర్లు వేసి.. డీప్‌ థర్డ్‌, ఫైన్‌ లెగ్‌లో ఫీల్డర్లను మోహరించి సూర్యను కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. అదే వ్యూహాన్ని ఈ సిరీస్‌లోనూ కొనసాగించొచ్చు. ఈ పరీక్షను అతనెలా ఎదుర్కుంటాడన్నది ఆసక్తికరం. దేశవాళీ క్రికెట్లో ముంబయి సారథిగా సూర్యకు అనుభవముంది. ఐపీఎల్‌లోనూ ముంబయికి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.

జట్టు కూర్పు ఎలా?: తొలి టీ20లో టీమ్‌ఇండియా కూర్పు ఆసక్తి రేపుతోంది. ఈ స్టేడియంలో ఇషాన్‌, రుతురాజ్‌ చెరో అర్ధశతకం సాధించారు. వికెట్‌కీపర్‌గా ఇషాన్‌ ఆడతాడు. కానీ యశస్వితో కలిసి ఓపెనింగ్‌ చేస్తాడా? వైస్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ ఓపెనర్‌గా వస్తే ఇషాన్‌ మిడిలార్డర్‌లో ఆడతాడా? అన్నవి ప్రశ్నలు. కెప్టెన్‌ సూర్య మూడో స్థానంలో ఆడే అవకాశముంది. ఇక నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో వరుసగా తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, రింకు సింగ్‌ ఆడొచ్చు. బౌలింగ్‌లో ముకేశ్‌, అర్ష్‌దీప్‌, రవి బిష్ణోయ్‌కు పోటీ లేకపోవచ్చు. మూడో పేసర్‌గా అవేశ్‌ కంటే ప్రసిద్ధ్‌నే ఆడించే ఆస్కారముంది. అవేష్‌ కూడా కావాలనుకుంటే ముకేశ్‌ తప్పుకోవాల్సిందే. మరో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లో ఎవరాడతారో చూడాలి.

తక్కువేం కాదు..: గత అయిదు టీ20ల్లో ఆసీస్‌పై మూడు సార్లు గెలిచినా.. ఈ ఫార్మాట్లో భారత్‌దే ఆధిపత్యం అయినా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేం. ప్రపంచకప్‌లో దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా టీ20ల్లోనూ ప్రమాదకరమే. ఈ సిరీస్‌కు కెప్టెన్‌ అయిన మాథ్యూ వేడ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. స్టాయినిస్‌, టిమ్‌ డేవిడ్‌తో కలిసి అతను మెరుపు ముగింపునివ్వగలడు. గతంలో 7 టీ20ల్లో జట్టును నడిపించిన అనుభవమూ అతనికుంది. మ్యాక్స్‌వెల్‌ క్రీజులో నిలబడితే ఎంతటి విధ్వంసం సృష్టించగలడో తెలిసిందే. ఇక్కడ అతను ఓ అర్ధశతకమూ చేశాడు. షార్ట్‌తో కలిసి స్మిత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. బౌలింగ్‌లో సీన్‌ అబాట్‌, ఎలిస్‌, బెహెండార్ఫ్‌, తన్వీర్‌ సంఘా ఆసీస్‌కు కీలకం.

తుది జట్లు (అంచనా)..

భారత్‌: ఇషాన్‌ (వికెట్‌కీపర్‌), యశస్వి, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, రింకు సింగ్‌, అక్షర్‌/సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌/అవేష్‌, ముకేశ్‌

ఆస్ట్రేలియా: స్మిత్‌, షార్ట్‌, హార్డీ, ఇంగ్లిస్‌, స్టాయినిస్‌, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), అబాట్‌, ఎలిస్‌, బెహెండార్ఫ్‌, తన్వీర్‌ సంఘా.
బౌలింగ్‌కే అనుకూలం
విశాఖ స్టేడియం బౌలింగ్‌కే అనుకూలించే ఆస్కారముంది. ఇక్కడ జరిగిన మూడు టీ20ల్లోనూ బంతితే ఆధిపత్యం. పేసర్లు, స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేనట్లే. కొన్ని చినుకులు పడొచ్చు. ఇక్కడ టీ20ల్లో 2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై గెలిచిన భారత్‌.. 2019లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఛేదన జట్లు రెండుసార్లు గెలిచాయి


4
విశాఖలో ఆడిన అయిదు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయాలు.


9
2021 నుంచి భారత టీ20 జట్టుకు సారథిగా ఎంపికైన కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్‌ స్థానం.


15
ఆస్ట్రేలియాతో ఆడిన 26 టీ20ల్లో భారత్‌ విజయాలు. ప్రత్యర్థి 10 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.


వీళ్లపై దృష్టి..

ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌పై ప్రత్యేక దృష్టి నిలవనుంది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్‌ జట్టులో స్థానాన్ని త్రుటిలో కోల్పోయిన తిలక్‌.. టీ20ల్లో సత్తాచాటి వచ్చే ఏడాది ప్రపంచకప్‌ ఆడాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇషాన్‌కూ ఈ సిరీస్‌ మంచి అవకాశం. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా అతనికి పోటీనిచ్చే శాంసన్‌ ఇప్పుడు లేడు. జితేశ్‌ శర్మ ప్రత్యామ్నాయ వికెట్‌కీపరే. ఈ నేపథ్యంలో ఫామ్‌ కొనసాగిస్తే ఇషాన్‌కు తిరుగుండదు. ఓపెనర్‌ స్థానం కోసం యశస్వి, రుతురాజ్‌తో ఇషాన్‌ పోటీపడుతున్నాడు. ఇప్పటివరకూ ఆడిన 29 టీ20ల్లో ఇషాన్‌ రెండు సార్లు మాత్రమే ఓపెనర్‌గా ఆడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని