India vs Afghanistan: సూపరో.. సూపర్‌

బుధవారం.. చిన్నస్వామి స్టేడియంలో ఆ రెండు జట్లు! తిరుగులేని ఫేవరెట్‌గా భారత్‌.. కనీస పోటీ అయినా ఇవ్వాలనే లక్ష్యంతో అఫ్గానిస్థాన్‌! రోహిత్‌సేన అప్పటికే సిరీస్‌ గెలవడం వల్ల అదో నామమాత్ర మ్యాచే అందరి దృష్టిలో!

Updated : 18 Jan 2024 06:52 IST

అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి రెండో సూపర్‌ ఓవర్లో తేలిన ఫలితం
ఉత్కంఠ పోరులో అఫ్గాన్‌పై భారత్‌ విజయం
సిరీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌
రోహిత్‌ మెరుపు శతకం
భారత్‌ 212/4  - అఫ్గాన్‌ 212/6


బెంగళూరు

బుధవారం.. చిన్నస్వామి స్టేడియంలో ఆ రెండు జట్లు! తిరుగులేని ఫేవరెట్‌గా భారత్‌ (India vs Afghanistan).. కనీస పోటీ అయినా ఇవ్వాలనే లక్ష్యంతో అఫ్గానిస్థాన్‌! రోహిత్‌సేన అప్పటికే సిరీస్‌ గెలవడం వల్ల అదో నామమాత్ర మ్యాచే అందరి దృష్టిలో! కానీ అది ఎప్పటికీ గుర్తుండిపోయే పోరవుతుందని ఎవరూ ఊహించలేదు. బ్యాటర్ల విధ్వంసక విన్యాసాలతో.. ఫోర్లు, సిక్స్‌ల మోతతో.. పరుగుల వరదతో, నరాలు తెగే ఉత్కంఠతో.. నామమాత్రమనుకున్న మ్యాచ్‌ కాస్తా అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి హద్దుల్లేని వినోదాన్ని పంచింది.
వారెవ్వా ఏం ఆట! విజయం దోబూచులాడుతుంటే, బంతి బంతికీ ఉత్కంఠ పెరిగిపోతుంటే.. ముగింపు అత్యంత రసవత్తరంగా సాగింది. చివరికి విజేత టీమ్‌ఇండియానే అయినా.. అఫ్గానిస్థాన్‌ కూడా అద్భుత పోరాటపటిమతో మనసులు గెలుచుకుంది. జట్లు ఎంత హోరాహోరీగా తలపడ్డాయంటే.. అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్‌ ఫలితం తొలిసారి రెండో సూపర్‌ ఓవర్లో తేలింది. మెరుపు సెంచరీతో రోహిత్‌ భారత్‌ విజయంలో హీరోగా నిలిచాడు. రింకు ఇన్నింగ్స్‌ కూడా అమూల్యమైందే. రెండు జట్లూ 212 పరుగులు చేయడంతో మొదట మ్యాచ్‌ టై కాగా.. సూపర్‌ ఓవర్లో టీమ్‌ఇండియా నిలిచింది.

హమ్మయ్య.. టీమ్‌ఇండియా గెలిచింది. బుధవారం ఉత్కంఠ ఊపేసిన మూడో టీ20లో భారత జట్టు రెండో సూపర్‌ ఓవర్లో అఫ్గాన్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రోహిత్‌ శర్మ (121 నాటౌట్‌; 69 బంతుల్లో 11×4, 8×6), రింకు సింగ్‌ (69 నాటౌట్‌; 39 బంతుల్లో 2×4, 6×6) మెరుపులతో మొదట భారత్‌ 4 వికెట్లకు 212 పరుగులు సాధించింది. నైబ్‌ (55 నాటౌట్‌; 23 బంతుల్లో 4×4, 4×6), గుర్బాజ్‌ (50; 32 బంతుల్లో 3×4, 4×6), ఇబ్రహీం జద్రాన్‌ (50; 41 బంతుల్లో 4×4, 1×6) చెలరేగడంతో అఫ్గాన్‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 పరుగులే చేసింది. ఫలితంగా ఆట సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. అందులో మొదట అఫ్గాన్‌ 16 పరుగులు చేస్తే.. భారత్‌ కూడా అన్నే పరుగులు సాధించడంతో రెండో సూపర్‌ ఓవర్‌ తప్పలేదు. రెండో సూపర్‌ ఓవర్లో మొదట భారత్‌ 11 పరుగులే చేయడంతో గెలుపు కష్టమే అనుకున్నారంతా! కానీ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన రవి బిష్ణోయ్‌ మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. భారత్‌ను ఆనందంలో ముంచెత్తాడు. మారిన నిబంధనల ప్రకారం ఫలితం తేలే వరకు ఎన్ని సూపర్‌ ఓవర్లయినా ఆడాలి.
పట్టు వదలని నైబ్‌..: లక్ష్యం చాలా పెద్దదే అయినా.. ఓపెనర్లు గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌ రాణించడంతో 10 ఓవర్లలో 85/0తో అఫ్గాన్‌ రేసులో నిలిచింది. ముఖ్యంగా గుర్బాజ్‌ చెలరేగిపోయాడు. అవేష్‌, మకేశ్‌, దూబె బ్యాటర్లకు అడ్డుకట్ట వేయలేకపోయారు. 11వ ఓవర్లో గుర్బాజ్‌ను కుల్‌దీప్‌ ఔట్‌ చేయడంతో భారత్‌కు ఎట్టకేలకు వికెట్‌ లభించింది. 13వ ఓవర్లో ఇబ్రహీం జద్రాన్‌, అజ్మతుల్లాలను వాషింగ్టన్‌ సుందర్‌ ఔట్‌ చేయడం అఫ్గాన్‌ ఆశలకు పెద్ద దెబ్బ. చివరి ఏడు ఓవర్లలో అఫ్గాన్‌ 105 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌ గెలుపుపై సందేహాలే లేవు. కానీ. నైబ్‌, నబి (34) వీర విధ్వంసంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. 6 ఓవర్ల వ్యవధిలో 66 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో అఫ్గాన్‌కు 19 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో జోరు మీదున్న నైబ్‌. తీవ్ర ఒత్తిడిలో బౌలర్‌ ముకేశ్‌. తొలి బంతికి వైడ్‌ వేశాడు. తర్వాతి బంతికి నైబ్‌ ఫోర్‌ కొట్టాడు. ముకేశ్‌ ఓ డాట్‌ బాల్‌ వేసినా.. వెంటనే మరో వైడ్‌ వేశాడు. ఆ తర్వాతి బంతికి నైబ్‌ రెండు పరుగులు తీశాడు. నాలుగో బంతికి నైబ్‌ సిక్స్‌ బాదడంతో అఫ్గాన్‌కు చివరి రెండు బంతుల్లో అయిదు పరుగులు అవసరయ్యాయి. నైబ్‌..అయిదో బంతికి 2, ఆఖరి బంతికి 2 పరుగులు తీయడంతో మ్యాచ్‌ టై అయింది. ఆట సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది.
22/4 నుంచి:  212/4.. టీమ్‌ఇండియాకు ఇంత భారీ స్కోరు ఏమాత్రం ఊహించనిదే. ఎందుకంటే కనీస పోరాటానికి అవసరమైన స్కోరైనా చేస్తుందా అనిపించింది ఓ దశలో. ఆరంభం అంత ఘోరం మరి.  5 ఓవర్లలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అయినా భారత్‌ కొండంత లక్ష్యాన్ని నిర్దేశించిందంటే అది రోహిత్‌ మెరుపు సెంచరీ, రింకు సింగ్‌తో అతడి అద్భుత భాగస్వామ్యం చలవే. జట్టు కష్టాల్లో ఉన్న దశలో రింకు కూడా అదిరే ఇన్నింగ్స్‌ ఆడాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఆరంభం అత్యంత పేలవం. అఫ్గాన్‌ బౌలర్‌ ఫరీద్‌ తొలి మూడు ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. నిజానికి 18 పరుగుల వరకు భారత్‌ ఒక్క వికెట్టూ కోల్పోలేదు. కానీ 4 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు చేజార్చుకుంది. మూడో ఓవర్లో ఫరీద్‌ వరుస బంతుల్లో జైస్వాల్‌ (4), కోహ్లి (0)లను ఔట్‌ చేసి భారత్‌కు షాకిచ్చాడు. తన తర్వాతి ఓవర్లో సంజు శాంసన్‌ (0)నూ ఔట్‌ చేశాడు. ఈ మధ్యలో శివమ్‌ దూబె (1)ను అజ్మతుల్లా వెనక్కి పంపాడు. రోహిత్‌ శర్మ క్రీజులో ఉన్నా.. మరో వైపు వికెట్లు పడుతుండడంతో సాధికారికంగా ఆడలేకపోయాడు. 6 ఓవర్లలో 30/4తో టీమ్‌ఇండియా పరిస్థితి సంకటంగానే ఉంది. కానీ రింకుతో కలిసి రోహిత్‌ జట్టును ఆదుకున్నాడు. ఇద్దరూ ముందు ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. 11 ఓవర్లకు స్కోరు 65/4. ఆ తర్వాతి ఓవర్‌ నుంచి మోత మొదలైంది. కానీ రోహిత్‌, రింకుల విధ్వంసంతో భారత్‌ ఎవరూ ఊహించనంత స్కోరు సాధించింది. ఫోర్లు, సిక్స్‌లతో అఫ్గాన్‌ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన ఈ జంట.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ బ్యాటర్ల విధ్వంసంతో ఆఖరి 9 ఓవర్లలో టీమ్‌ఇండియా ఏకంగా 147 పరుగులు రాబట్టింది.
దంచేశాడు..: చాలా ఊహాగానాల మధ్య.. ప్రపంచకప్‌ నేపథ్యంలో టీ20ల్లోకి (ఈ సిరీస్‌తో) పునరాగమనం చేశాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్‌. రెండో మ్యాచ్‌లో డకౌట్‌. ఫలితం అతడి ఆటపై, ప్రపంచకప్‌కు అతడి సంసిద్ధతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అనేక సందేహాలను పటాపంచలు చేస్తే.. అన్ని ప్రశ్నలకూ తన బ్యాటుతోనే సమాధానమిచ్చాడు రోహిత్‌. టీ20 క్రికెట్లో అయిదో శతకంతో తనలో హిట్‌మ్యాన్‌ ఇంకా అలాగే ఉన్నాడని చాటుకున్నాడు. అదిరే ఇన్నింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో రోహిత్‌ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఎదుర్కొన్న ఏడో బంతికి కానీ ఖాతా తెరవలేకపోయాడు. కానీ క్రమంగా వేగంగా పెంచాడు. రింకు సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాక రెచ్చిపోయి ఆడాడు .41 బంతుల్లో అర్ధశతకం సాధించిన అతడు.. సెంచరీకి చేరుకోవడానికి మరో 23 బంతులే ఆడాడంటే ఎలా రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో (జనత్‌) రోహిత్‌ వరుసగా 4, 6, 6 బాదేశాడు. రింకుతో అభేద్యమైన అయిదో వికెట్‌కు రోహిత్‌.. 190 పరుగులు జోడించాడు. రింకుది కూడా అంతే విలువైన ఇన్నింగ్స్‌. జట్టులోకి వచ్చినప్పటి నుంచి నిలకడగా రాణిస్తోన్న అతడు.. మరోసారి తన విలువను చాటుకున్నాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యలో తొలి 19 బంతుల్లో 21 పరుగులు చేసిన అతడు.. పరిస్థితి మెరుగుపడ్డాక చెలరేగి పోయాడు.


భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) నబి (బి) ఫరీద్‌ 4; రోహిత్‌ నాటౌట్‌ 121; కోహ్లి (సి) ఇబ్రహీం జద్రాన్‌ (బి) ఫరీద్‌ 0; శివమ్‌ దూబె (సి) గుర్బాజ్‌ (బి) అజ్మతుల్లా 1; సంజు శాంసన్‌ (సి) నబి (బి) ఫరీద్‌ 0; రింకు సింగ్‌ నాటౌట్‌ 69; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212; వికెట్ల పతనం: 1-18, 2-18, 3-21, 4-22; బౌలింగ్‌: ఫరీద్‌ అహ్మద్‌ 4-0-20-3; అజ్మతుల్లా 4-0-33-1; ఖైస్‌ అహ్మద్‌ 4-0-28-0; మహ్మద్‌ సలీమ్‌ 3-0-43-0; అష్రాఫ్‌ 2-0-25-0; కరీమ్‌ జనత్‌ 3-0-54-0
అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) సుందర్‌ (బి) కుల్‌దీప్‌ 50; ఇబ్రహీం జద్రాన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) సుందర్‌ 50; నైబ్‌ నాటౌట్‌ 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్‌ (బి) సుందర్‌ 0; నబి (సి) అవేష్‌ (బి) సుందర్‌ 34; కరీమ్‌ జనత్‌ రనౌట్‌ 2; నజిబుల్లా (సి) కోహ్లి (బి) అవేష్‌ 5; షరాఫుద్దీన్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212; వికెట్ల పతనం: 1-93, 2-107, 3-107, 4-163, 5-167, 6-182; బౌలింగ్‌: ముకేశ్‌ 4-0-44-0; అవేష్‌ ఖాన్‌ 4-0-55-1; రవి బిష్ణోయ్‌ 4-0-38-0; వాషింగ్టన్‌ సుందర్‌ 3-0-18-3; శివమ్‌ దూబె 2-0-25-0; కుల్‌దీప్‌ 3-0-31-1


5

అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌ సెంచరీలు. అత్యధిక శతకాల రికార్డు అతడిదే. మాక్స్‌వెల్‌, సూర్యకుమార్‌లను అధిగమించాడు.


  • 2020లో ఐసీసీ కొత్త సూపర్‌ ఓవర్‌ నిబంధనను ప్రవేశపెట్టింది. మ్యాచ్‌ టై అయినప్పుడు సూపర్‌ ఓవర్లో ఫలితం తేలకుంటే.. ఎవరో ఒకరు విజేతగా నిలిచేవరకు సూపర్‌ ఓవర్లు నిర్వహిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని