భరత్‌ బదులిస్తాడా?

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ ఓడిందంటే కారణం బ్యాటింగ్‌ వైఫల్యం. రెండో టెస్టులో బౌలర్ల అద్భుత ప్రదర్శన వల్ల గెలిచింది కానీ.. బ్యాటింగ్‌ మాత్రం గొప్పగా ఏమీ లేదు. యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో భారత్‌ గట్టెక్కింది.

Published : 14 Feb 2024 04:29 IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ ఓడిందంటే కారణం బ్యాటింగ్‌ వైఫల్యం. రెండో టెస్టులో బౌలర్ల అద్భుత ప్రదర్శన వల్ల గెలిచింది కానీ.. బ్యాటింగ్‌ మాత్రం గొప్పగా ఏమీ లేదు. యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో భారత్‌ గట్టెక్కింది. విరాట్‌ కోహ్లి అందుబాటులో లేని, భారత బ్యాటింగ్‌ తడబడుతున్న ఈ సమయంలో తనేంటో రుజువు చేసుకోవడానికి వచ్చిన మంచి అవకాశాల్ని ఆంధ్రా కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ వృథా చేసుకుంటున్నాడు. మెడపై కత్తి వేలాడుతున్న వేళ.. ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడకుంటే మళ్లీ భారత జట్టులో కనిపించడం కష్టం.

రాజ్‌కోట్‌

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీకర్‌ భరత్‌ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. బ్యాటర్‌గా ఇంకో మ్యాచ్‌లో విఫలమైతే జట్టులో అతడి చోటే ప్రశ్నార్థకం అవుతుంది. గత ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో అతను అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు పూర్తయ్యేసరికి అతను ఆడిన మ్యాచ్‌లు ఏడు. ఇప్పటిదాకా అతను 20.09 సగటుతో 221 పరుగులే చేశాడు. అత్యధిక సోరు 44. ఒక్క అర్ధశతకం కూడా సాధించలేదు. 2023 ముందు వరకు టెస్టుల్లో భారత్‌కు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా ఉన్న రిషబ్‌ పంత్‌ ప్రమాదంలో గాయపడి ఏడాదికి పైగా ఆటకు దూరం కావడం భరత్‌కు కలిసొచ్చింది. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు, దేశవాళీ రికార్డు అతడికి భారత టెస్టు జట్టులో చోటు తెచ్చిపెట్టాయి. అయితే అతనీ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాతో తన తొలి టెస్టు సిరీస్‌లో, ఆపై అదే జట్టుతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ప్రస్తుత ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ భరత్‌ బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 28, 17, 6 పరుగులే సాధించాడు. తన సొంతగడ్డ అయిన విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులోనూ భరత్‌ నిరాశపరచడంతో అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. ఎంతో పోటీ ఉన్న టీమ్‌ఇండియాలో చోటు నిలబెట్టుకోవాలంటే నిలకడగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. భరత్‌ వికెట్‌ కీపింగ్‌లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ బ్యాటుతో అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఒక్కో వైఫల్యం తర్వాత అతడిపై ఒత్తిడి పెరిగిపోతోంది. జట్టులో ఇప్పటికే ధ్రువ్‌ జురెల్‌ రూపంలో ఓ వికెట్‌ కీపర్‌ ఉన్నాడు. మరోవైపు పంత్‌ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టులో భరత్‌ బ్యాటుతో సత్తా చాటాల్సిందే. ఈ మ్యాచ్‌లోనూ విఫలమైతే సిరీస్‌ మధ్యలోనే అతణ్ని తప్పించి జురెల్‌ను ఆడించే అవకాశాలు లేకపోలేదు. మరి రాజ్‌కోట్‌లో భరత్‌ బ్యాటుతో విమర్శకులకు ఎలా బదులిస్తాడో చూడాలి.

దేశవాళీల్లో సూపర్‌: శ్రీకర్‌ భరత్‌ దేశవాళీ రికార్డుకేమీ ఢోకా లేదు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా అతను మెరుగైన ప్రదర్శనే చేశాడు. రంజీల్లో ఆంధ్రాకు ఆడడమే కాక ఇండియా-ఎ, రెస్టాఫ్‌ ఇండియా లాంటి జట్లకు ఆడుతూ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అతను 96 మ్యాచ్‌ల్లో 36.69 సగటుతో 5101 పరుగులు చేశాడు. అందులో పది సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. శ్రీకర్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో ఓ ట్రిపుల్‌ సెంచరీ (308) కూడా ఉండడం విశేషం. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ముంగిట ఇండియా-ఎకు ఆడుతూ ఇంగ్లాండ్‌ లయన్స్‌ జట్టుపై సెంచరీ (116)తోనూ ఆకట్టుకున్నాడు భరత్‌. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అతను దేశవాళీ ఫామ్‌ను కొనసాగించలేకపోతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని