Gujarat Vs Mumbai: ముంబయిని ఊరించి.. గుజరాత్‌ను వరించి..

12 ఓవర్లలో 107/2. 169 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ పరిస్థితిది. క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్‌, బ్రెవిస్‌ ఉండడంతో గెలుపు ఆ జట్టుదే అనిపించింది. కానీ అద్భుతంగా పుంజుకున్న గుజరాత్‌ టైటాన్స్‌..

Updated : 25 Mar 2024 08:43 IST

ఉత్కంఠ పోరులో టైటాన్స్‌ విజయం
మెరిసిన మోహిత్‌, ఒమర్‌జాయ్‌

అహ్మదాబాద్‌

12 ఓవర్లలో 107/2. 169 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ పరిస్థితిది. క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్‌, బ్రెవిస్‌ ఉండడంతో గెలుపు ఆ జట్టుదే అనిపించింది. కానీ అద్భుతంగా పుంజుకున్న గుజరాత్‌ టైటాన్స్‌.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబయికి చెక్‌ పెట్టి టోర్నీలో శుభారంభం చేసింది. బంతితో బుమ్రా చేసిన అద్భుత ప్రదర్శన వృథా అయింది.

 

ఐపీఎల్‌-17లో గుజరాత్‌ టైటాన్స్‌ బోణీ కొట్టింది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై గెలిచింది. బుమ్రా (3/14) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మొదట గుజరాత్‌ టైటాన్స్‌ 168/6కు పరిమితమైంది. సాయి సుదర్శన్‌ (45; 39 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌. శుభ్‌మన్‌ గిల్‌ (31; 22 బంతుల్లో 3×4, 1×6) రాణించాడు. ఛేదనలో ముంబయి 9 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది. రోహిత్‌ శర్మ (43; 29 బంతుల్లో 7×4, 1×6), బ్రెవిస్‌ (46; 38 బంతుల్లో 2×4, 3×6) రాణించడంతో ఓ దశలో గెలిచేలా కనిపించిన ముంబయి.. అనూహ్యంగా దెబ్బతింది. అజ్మతుల్లా (2/27), మోహిత్‌ శర్మ (2/32), స్పెన్సర్‌ జాన్సన్‌ (2/25), ఉమేశ్‌ (2/31) ఆ జట్టుకు కళ్లెం వేశారు.
రాణించిన ఆ ఇద్దరు..: అజ్మతుల్లా విజృంభించడంతో ఛేదనలో ముంబయి 3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్‌ శర్మ దూకుడైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఉమేశ్‌ ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ బాదేశాడు. బ్రెవిస్‌ కూడా చక్కగా బ్యాటింగ్‌ చేయడంతో లక్ష్యం దిశగా ముంబయి సాఫీగా సాగింది. జాన్సన్‌, సాయి కిశోర్‌ బౌలింగ్‌లో బ్రెవిస్‌ సిక్స్‌లు బాదాడు. 12 ఓవర్లకు ముంబయి స్కోరు 107/2. కానీ అనూహ్యం. 13వ ఓవర్‌ తొలి బంతికి రోహిత్‌ను సాయికిశోర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో గమనమే మారిపోయింది. టైటాన్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబయికి పరుగులు చేయడం కష్టమైంది. క్రమంగా ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. 16వ ఓవర్లో బ్రెవిస్‌ను మోహిత్‌ ఔట్‌ చేయడంతో ఒత్తిడి ఇంకా పెరిగింది. ఆఖరి నాలుగు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన పరిస్థితి. టిమ్‌ డేవిడ్‌ (11) కూడా వెంటనే వెనుదిరిగాడు. చివరి రెండు ఓవర్లలో ముంబయికి 27 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్‌ (జాన్సన్‌) తొలి బంతికి తిలక్‌ (25) సిక్స్‌ దంచేశాడు. కానీ తర్వాతి అయిదు బంతుల్లో రెండే పరుగులిచ్చిన జాన్సన్‌.. తిలక్‌తో పాటు కొయెట్జీ (1)ని ఔట్‌ చేసి టైటాన్స్‌ను పైచేయిలో నిలిపాడు. చివరి ఓవర్‌ (ఉమేశ్‌) తొలి రెండు బంతులను హార్దిక్‌ (11)  6, 4గా మలచడంతో ముంబయి రేసులోనే ఉంది. కానీ తర్వాతి బంతికే హార్దిక్‌ ఔట్‌ కావడంతో ఆ జట్టు కథ ముగిసినట్లయింది. ఆఖరి మూడు బంతుల్లో ఉమేశ్‌ రెండే పరుగులిచ్చి చావ్లాను ఔట్‌ చేయడంతో విజయం టైటాన్స్‌ సొంతమైంది.
బుమ్రా అదుర్స్‌: అంతకుముందు గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగే హైలైట్‌. అతడు అద్భుత బౌలింగ్‌తో కీలక సమయాల్లో కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో ఒకే ఒక్క బౌండరీ ఇచ్చిన బుమ్రా. 14 డాట్‌బాల్స్‌ వేయడం విశేషం. టైటాన్స్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. నాలుగు ఫోర్లతో మంచి ఊపులో ఉన్నట్లు కనిపించిన సాహా (19)ను నాలుగో ఓవర్లో బుమ్రా ఓ కళ్లు చెదిరే యార్కర్‌తో ఔట్‌ చేశాడు. కొన్ని చక్కని షాట్లు ఆడి క్రీజులో కుదురుకున్న గిల్‌ను చావ్లా ఔట్‌ చేయగా.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (17)తో కలిసి సాయి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కానీ ధాటిగా ఆడలేకపోయాడు. 11వ ఓవర్లో బ్యాటర్లిద్దరూ సిక్స్‌లు బాదడంతో ఇన్నింగ్స్‌కు ఊపొచ్చినట్లు అనిపించింది. కానీ అజ్మతుల్లా ఔట్‌ కావడంతో బలంగా మారుతున్న దశలో మరో భాగస్వామ్యం విడిపోయింది. సుదర్శన్‌ రెండు ఫోర్లు బాదడం, అతడికి తోడుగా మిల్లర్‌ (12) ఉండడంతో 16 ఓవర్లకు టైటాన్స్‌ 133/3తో నిలిచింది. అప్పటికీ ఆ జట్టుకు మంచి స్కోరుకు అవకాశముంది. కానీ మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా ఆ జట్టు ఆశలను దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో రెండే పరుగులిచ్చి మిల్లర్‌, సుదర్శన్‌లు ఇద్దరినీ వెనక్కి పంపాడు. తర్వాతి ఓవర్లో రాహుల్‌ తెవాతియా (22) సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టడం టైటాన్స్‌కు ఊరట. బుమ్రా, కొయెట్టీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆఖరి రెండు ఓవర్లలో  ఆ జట్టు 14 పరుగులే చేయగలిగింది.


గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (బి) బుమ్రా 19; శుభ్‌మన్‌ గిల్‌ (సి) రోహిత్‌ (బి) చావ్లా 31; సాయి సుదర్శన్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 45; అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (సి) తిలక్‌ వర్మ (బి) కొయెట్జీ 17; మిల్లర్‌ (సి) హార్దిక్‌ (బి) బుమ్రా 12; విజయ్‌ శంకర్‌ నాటౌట్‌ 6; రాహుల్‌ తెవాతియా (సి) నమన్‌ ధీర్‌ (బి) కొయెట్జీ 22; రషీద్‌ ఖాన్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168; వికెట్ల పతనం: 1-31, 2-64, 3-104, 4-133, 5-134, 6-161; బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్య 3-0-30-0; ల్యూక్‌ వుడ్‌ 2-0-25-0; బుమ్రా 4-0-14-3; ములాని 3-0-24-0; చావ్లా 3-0-31-1; నమన్‌ ధిర్‌ 1-0-13-0; కొయెట్జీ 4-0-27-2
ముంబయి ఇన్నింగ్స్‌: కిషన్‌ (సి) సాహా (బి) ఒమర్‌జాయ్‌ 0; రోహిత్‌ ఎల్బీ (బి) సాయి కిశోర్‌ 43; నమన్‌ ధీర్‌ ఎల్బీ (బి) ఒమర్‌జాయ్‌ 20; బ్రెవిస్‌ (సి) అండ్‌ (బి) మోహిత్‌ 46; తిలక్‌వర్మ (సి) మనోహర్‌ (బి) స్పెన్సర్‌ జాన్సన్‌ 25; డేవిడ్‌ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 11; హార్దిక్‌ (సి) తెవాతియా (బి) ఉమేశ్‌ 11; కొయిట్జీ (సి) అండ్‌ (బి) స్పెన్సర్‌ జాన్సన్‌ 1; ములాని నాటౌట్‌ 1; చావ్లా (సి) రషీద్‌ (బి) ఉమేశ్‌ 0; బుమ్రా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 162; వికెట్ల పతనం: 1-0, 2-30, 3-107, 4-129, 5-142, 6-148, 7-150, 8-160, 9-160; బౌలింగ్‌: ఒమర్‌జాయ్‌ 3-0-27-2; ఉమేశ్‌ యాదవ్‌ 3-0-31-2; రషీద్‌ఖాన్‌ 4-0-23-0; సాయికిశోర్‌ 4-0-24-1; స్పెన్సర్‌ జాన్సన్‌ 2-0-25-2; మోహిత్‌శర్మ 4-0-32-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు