Ravi Shastri: టీమ్‌ఇండియా 2024 టీ20 వరల్డ్ కప్‌ గెలుస్తుంది: రవిశాస్త్రి

టీమ్‌ఇండియా త్వరలో ఐసీసీ ట్రోఫీని దక్కించుకుంటుందని భారత మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Updated : 27 Nov 2023 18:33 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా త్వరలో ఐసీసీ ట్రోఫీని దక్కించుకుంటుందని భారత మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024)ని భారత్‌ సొంతం చేసుకుంటుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. వరల్డ్ కప్‌లు గెలవడం అంత సులువు కాదని, ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్‌లో భారత్ అత్యుత్తమంగా ఆడినప్పటికీ.. కీలకమైన ఫైనల్‌లో విఫలమైందన్నాడు. 2023 ప్రపంచకప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా.. ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

‘‘ఏదీ సులువుగా రాదు. సచిన్‌ తెందూల్కర్‌ లాంటి గొప్ప ఆటగాడికి ఆరో ప్రయత్నంలో ప్రపంచకప్‌ కల నెరవేరింది. వరల్డ్ కప్‌ సులువుగా గెలవలేరు. ప్రపంచ కప్‌ గెలవాలంటే ఫైనల్‌లో గొప్పగా ఆడాలి. అంతకుముందు సాధించిన విజయాలు లెక్కలోకి రావు. కీలకమైన సెమీ ఫైనల్‌, ఫైనల్‌లో మంచి ప్రదర్శన చేస్తేనే విజేతగా నిలుస్తారు. ఈ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా సెమీస్, ఫైనల్‌లో బాగా ఆడింది. తుది పోరులో భారత్ ఓడిపోవడం బాధ కలిగించింది. కానీ, దీని నుంచి మన ఆటగాళ్లు పాఠాలు నేర్చుకుంటారు. భారత్‌ త్వరలో ప్రపంచకప్‌ గెలవడం నేను చూస్తా. ఇది వన్డేల్లో కాకపోవచ్చు. ఎందుకంటే  జట్టును పునర్నిర్మాణం చేయాలి. కానీ, వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గట్టిపోటీదారు. ఇది పొట్టి ఫార్మాట్‌గానుక దీనిపై ఫోకస్‌ పెట్టాలి’’ అని రవిశాస్త్రి సూచించాడు. వచ్చే ఏడాది జూన్‌లో వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు