IND vs AFG: కూనను కుమ్మేశారు

అసలే అఫ్గానిస్థాన్‌.. ఆపై బ్యాటింగ్‌కు పూర్తి అనుకూల పిచ్‌.. ఇంకేముంది? భారత్‌కు ఎదురే లేకపోయింది. చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డకౌటై నిరాశపరిచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. దిల్లీలో రెచ్చిపోయాడు. రికార్డుల దుమ్ముదులుపుతూ మెరుపు శతకం బాదేశాడు. పిచ్‌ను బాగానే ఉపయోగించుకున్న అఫ్గాన్‌ భారత్‌కు ఓ మోస్తరు లక్ష్యాన్నే నిర్దేశించింది.

Updated : 12 Oct 2023 06:48 IST

రోహిత్‌ మెరుపు శతకం
మెరిసిన బుమ్రా
అఫ్గాన్‌పై భారత్‌ ఘనవిజయం

అసలే అఫ్గానిస్థాన్‌.. ఆపై బ్యాటింగ్‌కు పూర్తి అనుకూల పిచ్‌.. ఇంకేముంది? భారత్‌కు ఎదురే లేకపోయింది. చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డకౌటై నిరాశపరిచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. దిల్లీలో రెచ్చిపోయాడు. రికార్డుల దుమ్ముదులుపుతూ మెరుపు శతకం బాదేశాడు. పిచ్‌ను బాగానే ఉపయోగించుకున్న అఫ్గాన్‌ భారత్‌కు ఓ మోస్తరు లక్ష్యాన్నే నిర్దేశించింది. కానీ రోహిత్‌ మెరుపుల ముందు ఆ లక్ష్యం చిన్నదైపోయింది. మిగతా బ్యాటర్లూ రాణించడంతో భారత్‌ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయంతో ప్రతిష్ఠాత్మక పాకిస్థాన్‌ పోరుకు సిద్ధమైంది రోహిత్‌ సేన.

దిల్లీ

స్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో కష్టపడి  నెగ్గిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను సునాయాసంగా ఓడించింది. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన టాప్‌ఆర్డర్‌ ఈ మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శనతో పాక్‌తో మ్యాచ్‌ ముంగిట ఊపందుకోవడం శుభ సూచకం. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (131; 84 బంతుల్లో 16×4, 5×6) మామూలుగా రెచ్చిపోలేదు. మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (47; 47 బంతుల్లో 5×4, 2×6) కూడా రాణించగా, కోహ్లి (55 నాటౌట్‌; 56 బంతుల్లో 6×4) జోరు కొనసాగించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (25 నాటౌట్‌; 23 బంతుల్లో 1×4, 1×6) సైతం ఆడిన కాసేపూ ఆకట్టుకున్నాడు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (2/57) మినహా అందరూ తేలిపోయారు. మొదట అఫ్గాన్‌ 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8×4, 1×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (62; 69 బంతుల్లో 2×4, 4×6) రాణించాడు. బుమ్రా (4/39), హార్దిక్‌ (2/43) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. భారత్‌ శనివారం తన తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొంటుంది.

బెంబేలెత్తించేశాడు..: చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో విఫలమైన రోహిత్‌ శర్మ.. దిల్లీలో తన విశ్వరూపం చూపించాడు. ఛేదనలో అఫ్గాన్‌ బౌలింగ్‌ను వేటాడేశాడు. ఏ బౌలర్‌నూ అతను లెక్క చేయలేదు. భారత్‌ విజయానికి చేరువయ్యాక రోహిత్‌ను  బౌల్డ్‌ చేశాడు కానీ.. రషీద్‌ఖాన్‌ సైతం అతణ్ని ఇబ్బంది పెట్టలేకపోయాడు. పేస్‌, స్పిన్‌ అని తేడా లేకుండా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించేశాడు. రోహిత్‌ పుల్‌ షాట్లు అభిమానులకు కనువిందు చేశాయి. రోహిత్‌ కొట్టిన ఒక ట్రేడ్‌మార్క్‌ పుల్‌ షాట్‌కు బంతి ఏకంగా 93 మీటర్లు ప్రయాణించింది. అతను 30 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి స్కోరు 94కు చేరుకుంది. అందులో రోహిత్‌ వాటానే 76 పరుగులు. అప్పటికి ఇషాన్‌ 11 పరుగులే చేశాడు. మరో ఎండ్‌లో రోహిత్‌ జోరు కొనసాగుతుండగానే.. ఇషాన్‌ కూడా దూకుడు పెంచడంతో అఫ్గాన్‌ బౌలర్లకు దిక్కుతోచని పరిస్థితి తలెత్తింది. రషీద్‌ వచ్చాక కొంచెం స్కోరు వేగం తగ్గింది. తన తొలి 3 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చిన రషీద్‌.. ఇషాన్‌ వికెట్‌ కూడా తీశాడు. కానీ తర్వాత అతణ్ని కూడా రోహిత్‌ వదిలిపెట్టలేదు. ఇషాన్‌ ఔటవడానికి ముందే, 18వ ఓవర్‌కే రోహిత్‌ శతకం (64 బంతుల్లో) పూర్తయింది. ఇషాన్‌తో తొలి వికెట్‌కు రోహిత్‌ 156 పరుగులు జోడించాడు. సెంచరీ తర్వాత కూడా అతను దూకుడు కొనసాగించాడు. కోహ్లి కూడా ఆరంభం నుంచే నిలకడగా బ్యాటింగ్‌ చేయడంతో భారత్‌ లక్ష్యం వైపు దూసుకెళ్లింది. 150 దిశగా అడుగులేస్తున్న రోహిత్‌ను రషీద్‌ బౌల్డ్‌ చేసినా.. భారత్‌కు ఇబ్బంది లేకపోయింది. శ్రేయస్‌తో కలిసి కోహ్లి మిగతా పని పూర్తి చేశాడు.

రాణించిన హష్మతుల్లా, అజ్మతుల్లా: మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌.. ఉన్నంతలో మెరుగైన స్కోరే సాధించింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌ను ఉపయోగించుకున్న అఫ్గాన్‌.. బలమైన భారత బౌలింగ్‌ దాడిని బాగానే ఎదుర్కొంది. ముఖ్యంగా కెప్టెన్‌ హష్మతుల్లా, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా సాధికారిక బ్యాటింగ్‌తో మధ్య ఓవర్లలో భారత్‌పై ఆధిపత్యం చలాయించారు. ఓపెనర్లు ఇబ్రహీం జాద్రాన్‌ (22), గుర్బాజ్‌ (21) జట్టుకు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే ఓ చక్కటి ఔట్‌స్వింగర్‌తో ఇబ్రహీంను బుమ్రా బోల్తా కొట్టించాడు. గుర్బాజ్‌ను హార్దిక్‌, రహ్మత్‌ను శార్దూల్‌ పెవిలియన్‌ చేర్చడంతో అఫ్గాన్‌ 63/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితి నుంచి అఫ్గాన్‌ 300 లక్ష్యం మీద కన్నేసిందంటే హష్మతుల్లా, అజ్మతుల్లాల భాగస్వామ్యమే కారణం. లోయరార్డర్లో ఆడే అజ్మతుల్లా.. అయిదో స్థానంలో దిగి స్పెషలిస్టు బ్యాటర్‌ను తలపించాడు. హష్మతుల్లా కూడా నిలకడగా ఆడాడు. ఈ జోడీ పేసర్‌ సిరాజ్‌ను అలవోకగా ఎదుర్కొంది. స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్‌ కూడా వీరిని పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. హష్మతుల్లా, అజ్మతుల్లా ఒకరి తర్వాత ఒకరు అర్ధశతకాలు పూర్తి చేయగా.. 34 ఓవర్లకు 180/3తో అఫ్గాన్‌ పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఆ స్థితిలో స్కోరు 300 దాటుతుందనిపించింది. కానీ జోరుమీదున్న అజ్మతుల్లాను హార్దిక్‌ బౌల్డ్‌ చేయడంతో అఫ్గాన్‌ దూకుడు తగ్గింది. అక్కడ్నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. హష్మతుల్లా కూడా కాసేపటికే కుల్‌దీప్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. నబి (19), రషీద్‌ (16) పోరాడినా.. బుమ్రా 6 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీయడంతో అఫ్గాన్‌ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్‌ బౌలరైన సిరాజ్‌ 9 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టకుండా 76 పరుగులు సమర్పించుకున్నాడు.


అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) శార్దూల్‌ (బి) హార్దిక్‌ 21; ఇబ్రహీం జాద్రాన్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 22; రహ్మత్‌ షా ఎల్బీ (బి) శార్దూల్‌ 16; హష్మతుల్లా ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 80; అజ్మతుల్లా (బి) హార్దిక్‌ 62; నబి ఎల్బీ (బి) బుమ్రా 19; నజీబుల్లా (సి) కోహ్లి (బి) బుమ్రా 2; రషీద్‌ (సి) కుల్‌దీప్‌ (బి) బుమ్రా 16; ముజీబ్‌ నాటౌట్‌ 10; నవీనుల్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 272; వికెట్ల పతనం: 1-32, 2-63, 3-63, 4-184, 5-225, 6-229, 7-235, 8-261; బౌలింగ్‌: బుమ్రా 10-0-39-4; సిరాజ్‌ 9-0-76-0; హార్దిక్‌ 7-0-43-2; శార్దూల్‌ 6-0-31-1; కుల్‌దీప్‌ 10-0-40-1; జడేజా 8-0-38-0
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) రషీద్‌ 131; ఇషాన్‌ (సి) ఇబ్రహీం (బి) రషీద్‌ 47; కోహ్లి నాటౌట్‌ 55; శ్రేయస్‌ నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు  15 మొత్తం: (35 ఓవర్లలో 2 వికెట్లకు) 273; వికెట్ల పతనం: 1-156, 2-205; బౌలింగ్‌: ఫారూఖీ 6-0-50-0; ముజీబ్‌ 8-0-64-0; నవీనుల్‌ 5-0-31-0; అజ్మతుల్లా 4-0-34-0; నబి 4-0-32-0; రషీద్‌ 8-0-57-2


ఇది మాకు మంచి విజయం. టోర్నమెంట్‌ ఆరంభంలో జోరందుకోవడానికి ఈ గెలుపు చాలా కీలకం. నిర్భయంగా ఆడే బ్యాటర్లు మాకున్నారు. గత మ్యాచ్‌లోలా ఒత్తిడిని తట్టుకోగలిగే వాళ్లున్నారు. అంతా ఒత్తిడిని తట్టుకోవడం, మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్‌లో సెంచరీ చేయడం ఓ ప్రత్యేక అనుభూతి. నాకు చాలా సంతోషంగా ఉంది.

రోహిత్‌ శర్మ


వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌కు లభించిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు. సచిన్‌ (9) మాత్రమే అతడి కంటే ముందున్నాడు.

7

ప్రపంచకప్‌లో రోహిత్‌ శతకాలు. టోర్నీలో అత్యధిక సెంచరీల రికార్డు అతడిదే. సచిన్‌ (6)ను అధిగమించాడు. సచిన్‌ ప్రపంచకప్‌లో 44 మ్యాచ్‌లాడగా.. రోహిత్‌కిది 19వ మ్యాచ్‌ మాత్రమే.

  • అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు (556) కొట్టిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ (553)ను అతను అధిగమించాడు. గేల్‌ 551 మ్యాచ్‌లు ఆడగా.. రోహిత్‌కిది 473వ మ్యాచ్‌ మాత్రమే.
  • ఈ మ్యాచ్‌లో రోహిత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ ఏకంగా 93 మీటర్లు ప్రయాణించింది. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌.
  • వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా వార్నర్‌ (19 మ్యాచ్‌ల్లో) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ సమం చేశాడు.

31

వన్డేల్లో రోహిత్‌ శతకాల సంఖ్య. ఈ ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో సచిన్‌ (49), కోహ్లి (47) తర్వాత అతడు మూడో స్థానంలో ఉన్నాడు.

63

సెంచరీకి రోహిత్‌ ఆడిన బంతులు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ఇదే వేగవంతమైన శతకం. కపిల్‌దేవ్‌ 1983లో జింబాబ్వేపై 72 బంతులతో నెలకొల్పిన రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు.

ప్రపంచకప్‌లో ఈనాడు

ఆస్ట్రేలియా × దక్షిణాఫ్రికా

వేదిక: లఖ్‌నవూ, మ 2|| నుంచి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు