IND vs PAK: భారత్‌- పాక్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక రైళ్లు

భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ పోరును చూడటం కోసం అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

Updated : 12 Oct 2023 07:47 IST

ముంబయి: భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ పోరును చూడటం కోసం అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు ఓ వందే భారత్‌ సహా రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు పశ్చిమ రైల్వే సిద్ధమవుతోంది. ఓ క్రీడా ఈవెంట్‌ కోసం పశ్చిమ రైల్వే రెండు నగరాల మధ్య రైళ్లను నడపడం ఇదే తొలిసారి కానుంది. పూర్తి ఏసీతో కూడిన ఓ రైలు శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ముంబయి నుంచి బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకోనుంది. అలాగే మ్యాచ్‌ తర్వాతి రోజు ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి బయల్దేరే రైలు మధ్యాహ్నం ముంబయికి చేరుకోనుంది.

ఆ మ్యాచ్‌కు ముందు అదిరేలా: ప్రపంచకప్‌లో భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆరంభ వేడుకలు లేకుండానే ఈ ప్రపంచకప్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్‌- పాక్‌ పోరుకు ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని బీసీసీఐ నిర్వహించనుందని సమాచారం. ఈ కార్యక్రమానికి సచిన్‌ తెందుల్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ను బీసీసీఐ ఆహ్వానించినట్లు తెలిసింది. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా హాజరవుతారని అంటున్నారు. ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ ప్రదర్శన ఉండబోతుంది!

అహ్మదాబాద్‌లో పాక్‌

అహ్మదాబాద్‌: క్రికెట్‌ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మహా సంగ్రామానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ కోసం పాక్‌ బుధవారం అహ్మదాబాద్‌ చేరుకుంది. 15 రోజుల పాటు హైదరాబాద్‌లో గడిపిన పాక్‌.. వార్మప్‌తో పాటు ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లాడిన సంగతి తెలిసిందే. ఉప్పల్‌లో వరుసగా నెదర్లాండ్స్‌, శ్రీలంకపై విజయాలు సాధించిన పాక్‌.. భారత్‌తో మెగా పోరు కోసం నగరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లింది. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆ జట్టు అక్కడ ప్రాక్టీస్‌ చేయనుంది.

గిల్‌ కూడా: డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న టీమ్‌ఇండియా బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ బుధవారం అహ్మదాబాద్‌ చేరుకున్నాడు. అయినా.. శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు ఆడేది అనుమానమే. ‘‘గిల్‌ గురువారం సాధన చేస్తాడో లేదో తెలియదు. అతడు బాగా కోలుకున్నాడు. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడతాడో లేదో చెప్పలేను’’ అని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు. గిల్‌ ఇప్పటికే ప్రపంచకప్‌లో భారత్‌ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని