IND vs ENG: వైజాగ్‌ టెస్టుకు కేఎల్‌, జడ్డూ దూరం.. సర్ఫరాజ్‌ ఖాన్‌కు పిలుపు

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓటమితో ఇబ్బందిపడిన భారత్‌కు (IND vs ENG) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు.

Updated : 29 Jan 2024 20:00 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో (IND vs ENG) తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు. గాయం వల్ల వీరిద్దరూ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో ముగ్గురిని స్క్వాడ్‌లోకి తీసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన సర్ఫరాజ్‌ ఖాన్‌కు పిలుపొచ్చింది. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్‌కుమార్‌నూ బీసీసీఐ ఎంపిక చేసింది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 

‘‘రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం వల్ల వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టులో ఆడటం లేదు. తొలి టెస్టులో రన్నింగ్‌ చేస్తుండగా జడేజా మడమ కండరం పట్టేసింది. కేఎల్ రాహుల్‌కు తొడ కండరం నొప్పి రావడంతో విశ్రాంతి కావాలని కోరాడు. మా వైద్యబృందం ఎప్పటికప్పుడు ఇద్దరినీ పర్యవేక్షిస్తోంది. వారి స్థానంలో సెలక్షన్ కమిటీ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్, సౌరభ్‌కుమార్, వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకుంది’’ అని బీసీసీఐ ప్రకటించింది. 

బుమ్రాకు ఒక డీ మెరిట్‌ పాయింట్‌

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో (81వ ఓవర్‌) ఓలీ పోప్‌ పరుగుతీస్తుండగా.. భారత పేసర్‌ బుమ్రా ఉద్దేశపూర్వకంగా తగిలినట్లు ఐసీసీ రిఫరీ నిర్ధరించారు. దీంతో ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఆర్టికల్ 2.12 ప్రకారం బుమ్రా శిక్షార్హుడిగా ఐసీసీ తేల్చింది. గత 24 నెలల్లో బుమ్రా చేసిన తొలి నేరం కాబట్టి.. అతడి రికార్డులకు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ను విధించింది. ఫీల్డ్‌ అంపైర్లు పాల్‌ రీఫిల్‌, క్రిస్‌ గఫానీ, థర్డ్‌ అంపైర్‌ మారియస్ ఎరాస్మస్, ఫోర్త్‌ అంపైర్‌ రోహన్‌ పండిత్‌ నిర్ణయం మేరకు మ్యాచ్‌ రిఫరీ శిక్షను ఖరారు చేశారు. తను చేసిన నేరాన్ని బుమ్రా అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని ఐసీసీ స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని