IND vs PAK: భారత్‌ చేతిలో ఓటమి.. మిగతా మ్యాచ్‌ల్లోనూ పాక్‌పై తీవ్ర ప్రభావం: డీకే

వరల్డ్‌ కప్‌లో పాక్‌పై భారత్‌ (IND vs PAK) ఘన విజయం సాధించింది. కనీసం పోరాకుండానే పాక్‌ చేతులెత్తేయడం ఆ జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

Updated : 15 Oct 2023 11:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ చేతిలో (IND vs PAK) చిత్తుగా ఓడిపోవడం ప్రపంచ కప్‌లో పాక్‌ ఆడనున్న మిగతా మ్యాచ్‌లపైనా ప్రభావం పడుతుందని వెటరన్ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్‌ వ్యాఖ్యానించాడు. వరల్డ్‌ కప్‌లో మున్ముందు రోజులు  మరింత కఠిన సవాల్‌ విసురుతాయని పేర్కొన్నాడు. భారత్ - పాక్‌ మ్యాచ్‌ అనంతరం  దినేశ్‌ కార్తిక్‌ మాట్లాడుతూ.. ‘‘వచ్చే మూడు రోజులు పాక్‌ ఆటగాళ్లకు కష్టంగా ఉంటాయి. తదుపరి మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లేటప్పుడు చాలా మెసేజ్‌లు నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి. దాదాపు అవన్నీ నెగిటివ్‌గా ఉంటాయి. అదే నేనైతే కొన్ని రోజులపాటు ఫోన్‌కు దూరంగా ఉంటా. తర్వాతి మ్యాచ్‌లకు సన్నద్ధతపైనా ఈ ఓటమి ప్రభావం ఉంటుంది. గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఇలానే పరాజయం పాలైంది. కానీ, చివరి వరకూ పోరాడి ఓడింది. ఇప్పుడు అలా కాదు. చిత్తుగా ఓటమిని చవిచూసింది. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించే వరకూ ఈ బాధ కొనసాగుతూనే ఉంటుంది’’ అని డీకే వెల్లడించాడు. 

రోహిత్ బ్యాటింగ్‌ అదుర్స్‌ : అక్తర్‌

పాకిస్థాన్‌పై చెలరేగి ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. తమ జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోశాడని, మా బౌలర్ల ప్రదర్శన తీవ్ర నిరాశపరిచిందని వ్యాఖ్యానించాడు. ‘‘అత్యంత నిరుత్సాహానికి గురిచేసేలా మా ఆటగాళ్లు ప్రదర్శన చేశారు. పాక్‌పై భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. రోహిత్ సేన విజృంభించింది. కొన్నేళ్లుగా ఇలాంటి రోహిత్ ఎక్కడ ఉన్నాడనిపించింది. అతడి షాట్లను గమనిస్తే బంతులను ఎక్కడ వేయాలో కూడా మా బౌలర్లకు అర్థం కాలేదు. ఎలాంటి దయ లేకుండా పాక్‌ బౌలింగ్‌పై ఎటాక్‌ చేశాడు’’ అని షోయబ్ కొనియాడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని