Ravindra Jadeja: సర్ఫరాజ్‌ భాయ్‌.. సారీ..: జడేజా

తన పొరపాటు వల్లే సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌటయ్యాడంటూ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విచారం వ్యక్తం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా క్షమాపణలు కోరాడు.

Updated : 16 Feb 2024 00:27 IST

రాజ్‌కోట్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja).. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ను (Sarfaraz Khan) క్షమాపణలు కోరాడు. తాను చేసిన పొరపాటు వల్లే సర్ఫరాజ్‌ పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విచారం వ్యక్తం చేశాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటముగిసే సరికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. జట్టు స్కోరు 314 పరుగులు ఉన్నప్పుడు రవీంద్ర జడేజా(99), సర్ఫరాజ్‌ ఖాన్‌ (62) క్రీజులో ఉన్నారు. స్ట్రైకింగ్‌ చేస్తున్న జడేజా షాట్‌ ఆడి.. సర్ఫరాజ్‌ను పరుగు కోసం పిలిచాడు. అయితే వెంటనే జడేజా వెనక్కి వెళ్లాడు. అప్పటికే సగం పిచ్‌ దాటేసిన సర్ఫరాజ్‌ తిరిగి క్రీజులోకి వచ్చే లోపలే మార్క్‌వుడ్‌ వికెట్లను గిరాటేశాడు. దీంతో అతడు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.   

‘‘చాలా బాధపడుతున్నా. కేవలం నా తప్పు వల్లే సర్ఫరాజ్‌ ఔటయ్యాడు. అయినప్పటికీ చాలా బాగా ఆడాడు’’ అంటూ జడేజా ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ తొలి మ్యాచ్‌లోనే విజృంభించాడు. వన్డే మ్యాచ్‌లా ఆడిన అతడు 48 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మరోవైపు సమన్వయలోపం వల్లే నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న తాను ఔటవ్వాల్సి వచ్చిందని సర్ఫరాజ్‌ వెల్లడించాడు. క్రికెట్‌లో ఇలాంటివి సహజమని, పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదన్నాడు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని