Cricket News: గిల్‌ భర్తీ చేసేస్తాడు.. స్టార్క్‌ బిడ్డింగ్‌పై గంభీర్‌ వ్యాఖ్యలు.. ఝార్ఖండ్‌ ప్లేయర్‌కు ధోనీ భరోసా!

ఐపీఎల్‌ బిడ్డింగ్‌.. ఫ్రాంచైజీ కెప్టెన్సీ.. ఇలాంటి క్రికెట్ విశేషాలు..

Updated : 21 Dec 2023 15:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తమ కొత్త సారథిపై నమ్మకం ఉందంటాడు ఆ జట్టు కోచ్‌.. ఐపీఎల్‌ వేలంలో ఓ ఆటగాడిపై భారీగా వెచ్చించడంపై మెంటార్‌ స్పందనిదీ.. ఈ ఝార్ఖండ్‌ ప్లేయర్‌పై ఎవరూ ఆసక్తి చూపకపోతే తీసుకొనేందుకు మొగ్గు చూపుతామన్న ‘కెప్టెన్‌ కూల్’.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

ధోనీ అవకాశం కల్పిస్తానని చెప్పాడు: ఫ్రాన్సిస్‌ మింజ్‌

ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 3.6 కోట్లు వెచ్చించి రాబిన్‌ మింజ్‌ ను తీసుకుంది. ఝార్ఖండ్‌కు చెందిన ఈ 21 ఏళ్ల కుర్రాడు రూ. 20 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. అతడి కోసం గుజరాత్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోటీపడ్డాయి. చివరికి గుజరాత్‌ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో రాబిన్‌ తండ్రి ఫ్రాన్సిస్‌ మింజ్‌ మాట్లాడుతూ ధోనీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సీఎస్‌కే తీసుకుంటుందని ధోనీ హామీ ఇచ్చినట్లు మింజ్‌ పేర్కొన్నారు. ‘‘ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ధోనీని కలిశా. ఎవరూ తీసుకోవడానికి ఆసక్తి చూపకపోతే మేం ఉన్నామని చెప్పాడు’’ అని ఫ్రాన్సిస్ తెలిపారు. ఫ్రాన్సిస్ మింజ్‌ రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నారు.


ఎలాంటి ఫలితాలు వచ్చినా గిల్‌కే మా మద్దతు: నెహ్రా

బరిలోకి దిగిన తొలిసారే ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచి.. రెండో ఏడాది రన్నరప్‌గా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌కు వచ్చే సీజన్‌లో ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్‌ పాండ్య జట్టును వీడాడు. దీంతో అతడి స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది. పాండ్యను భర్తీ చేయగలడనే నమ్మకం గిల్‌పై తమకు ఉందని గుజరాత్‌ కోచ్ ఆశిశ్ నెహ్రా వ్యాఖ్యానించాడు. ‘‘గిల్‌పై మాకు నమ్మకం ఉంది. అందుకే, అతడిని కెప్టెన్‌ను చేశాం. ఫలితాల ఆధారంగానే మద్దతుగా నిలిచే వ్యక్తిని కాను. అంతిమంగా విజయం సాధించడం ముఖ్యమే కానీ కెప్టెన్సీ అంటే కేవలం వ్యక్తిగత ఆటను మాత్రమే కాకుండా ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటాం. గిల్‌ సరైన కెప్టెన్‌ అని మేం నమ్ముతున్నాం’’ అని నెహ్రా వ్యాఖ్యానించాడు. 


స్టార్క్‌పై భారీ మొత్తం వెచ్చించడానికి కారణమదే: గంభీర్‌

ఐపీఎల్‌ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిచెల్‌ స్టార్క్‌పై రూ. 24.75 కోట్లు వెచ్చించడం సంచలనం సృష్టించింది. అంత భారీ ధర పెట్టడానికిగల కారణాలను కేకేఆర్‌ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ వెల్లడించాడు. ‘‘మిచెల్‌ స్టార్క్‌ కీలక ఆటగాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కొత్త బంతితో పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయడంతోపాటు.. డెత్‌ ఓవర్లలోనూ రాణించగల ప్లేయర్. అంతేకాకుండా బౌలింగ్‌ విభాగాన్ని నడిపించగల నేర్పరి. మేం కాకపోతే వేరే ఫ్రాంచైజీ అయినా భారీ మొత్తం వెచ్చించి అతడిని సొంతం చేసుకొనేది’’ అని గంభీర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు