IND vs NZ: భారత్‌తో సవాల్‌.. వారు ఉండటం మా అదృష్టం: డేవాన్ కాన్వే

ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కివీస్ ఓపెనర్ డేవాన్ కాన్వే (Devon Conway) పేర్కొన్నాడు. 

Published : 14 Nov 2023 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ చివరి దశకు చేరుకుంది. బుధవారం ముంబయిలో జరిగే తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) తలపడనున్న విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్‌ కోసం ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో భారత్‌పై కివీస్ ఆధిపత్యం కనబరుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్‌ఇండియాను న్యూజిలాండ్ ఓడించింది. ఈ సారి ఎలాగైనా కివీస్ గండాన్ని గట్టెక్కాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా సెమీస్‌కు చేరిన టీమ్‌ఇండియా (Team India).. నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనూ అంతకమించిన ఆటతీరుతో టైటిల్‌ను పట్టేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కివీస్ ఓపెనర్ డేవాన్ కాన్వే (Devon Conway) భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ గురించి మాట్లాడాడు. భారత్‌ బలమైన జట్టని, ఆ టీమ్‌ నుంచి ఎదురయ్యే సవాల్‌ను అధిగమించేందుకు తమ జట్టు సీనియర్‌ ఆటగాళ్లపై ఆధారపడిందని పేర్కొన్నాడు.  

‘‘భారత్‌ ఎలా ఆడుతుందో మనందరికీ తెలుసు. టీమ్ఇండియా మంచి ఊపుమీదుంది. వారికి బలమైన జట్టు ఉంది. సెమీఫైనల్‌లో ఆతిథ్య దేశంతో ఆడుతుండటంతో మాకు ఉత్సాహంగా ఉంది. టీమ్ఇండియా నుంచి ముప్పు ఉందని తెలుసు. కానీ, ఆ సవాల్‌ కోసం మేం ఎదురు చూస్తున్నాం. ఇది మాకు మరో ప్రత్యేక సందర్భమని తెలుసు. మా జట్టులో ఉన్న చాలామందికి ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉంది. అది మా అదృష్టం. ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం మా లక్ష్యాలలో ఒకటి. ఆ లక్ష్యానికి ఒక అడుగు దూరంలో ఉండటం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. మా లక్ష్యం కోసం మేం చేయాల్సింది చేస్తాం. మిగతాది సీనియర్లు  చూసుకుంటారు’’ అని కాన్వే వివరించాడు. 


‘భారత్ సెమీస్‌ గండాన్ని దాటి ఫైనల్‌కు వస్తుంది’

టీమ్‌ఇండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, ఈ సారి కచ్చితంగా సెమీస్‌ గండాన్ని దాటి ఫైనల్‌కు వస్తుందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ పేర్కొన్నాడు. ‘‘టీమ్‌ఇండియా ఫామ్‌లో ఉంది. 2003, 2007లో ఆస్ట్రేలియా ఓటమి అనేదే లేకుండా ముందుకు సాగింది. ఈ సారి ఇండియా కూడా అజేయంగా ముందుకు సాగుతోంది. భారత్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అత్యద్భుతంగా ఉంది. వారు సెమీ ఫైనల్‌లో కచ్చితంగా విజయం సాధిస్తారు’’ అని  మాథ్యూ హేడెన్ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని