IND vs PAK: అక్కడుంది రోహిత్ శర్మ.. బౌలర్లూ పారాహుషార్‌: పాక్‌ మాజీల హెచ్చరికలు

వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) దాయాదుల పోరు మొదలైంది. అతిపెద్ద మైదానం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ (IND vs PAK) జరుగుతోంది.

Updated : 14 Oct 2023 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌పై అద్భుతమైన శతకంతో అదరగొట్టిన టీమ్‌ఇండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మతో బౌలర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని పాక్‌ మాజీలు హెచ్చరించారు. వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) భాగంగా భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ నెగ్గిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. ఈ క్రమంలో తమ బౌలర్లకు కీలక సూచనలు చేస్తూ మాజీ ఆటగాళ్లు వసీమ్‌ అక్రమ్, మిస్బా ఉల్ హక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలవోకగా పరుగులు చేస్తున్నాడు. ఎలాంటి రిస్క్‌ లేకుండానే అద్భుత షాట్లు కొట్టేస్తున్న రోహిత్‌కు బౌలింగ్‌ చేసేటప్పుడు బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కోహ్లీ కూడా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించి ఊపు మీదున్నాడు. బంతిపై పూర్తి నియంత్రణతో ఆడుతున్నాడు. అయితే, కోహ్లీ కంటే రోహిత్ విభిన్న తరహా బ్యాటర్. ఇతర బ్యాటర్ల కంటే బంతిని ఎదుర్కోవడానికి రోహిత్ వద్ద అదనపు సమయం ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని వసీమ్‌ అక్రమ్‌ వ్యాఖ్యానించాడు.

‘‘రోహిత్ శర్మ అఫ్గాన్‌పై ఇలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఇతర జట్లు ఒత్తిడికి గురి కావడం సహజమే. అతడికి బౌలింగ్‌ ఎక్కడ వేయాలనే దానిపై తీవ్ర కసరత్తు చేయాల్సిందే’’ అని మిస్బా తెలిపాడు. ‘ఈ మ్యాచ్‌లో మీరు ఎలా అతడి దాడిని తట్టుకుంటారు? అని వసీమ్‌ అక్రమ్‌ ప్రశ్నకు సమాధానంగా.. ‘‘పాక్‌ బౌలింగ్‌ బలంగానే ఉంది.. మ్యాచ్‌ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నా’ అని సమాధానం ఇచ్చాడు.

భారతే ఫేవరెట్‌.. కానీ పాక్‌కూ ఛాన్స్‌ ఉంది: రమీజ్‌ రజా

భారత్- పాకిస్థాన్‌ పోరులో ఎవరు గెలుస్తారనే అంచనాలను విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అలాగే ఆయా దేశాల మాజీలు కూడా తమ జట్టుకే విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పాక్‌ మాజీ దిగ్గజం రమీజ్‌ రజా మాత్రం భారత్‌ ఫేవరెట్ అని చెబుతూ.. పాక్‌కు కూడా అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ‘‘దాయాదుల మధ్య పోరు భారీగానే ఉంటుంది. అయితే ఇక్కడ భారత్‌ ఫేవరెట్‌ అనడంలో అనుమానం లేదు. మూడు విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన చేస్తోంది. అయితే, పాకిస్థాన్‌ కూడా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. శ్రీలంకపై భారీ లక్ష్యఛేదన చేసిన తర్వాత పాక్‌ జట్టులోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని రమీజ్‌ రజా తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని