ODI WC 2023: వరల్డ్‌ కప్‌లో ప్రతి మ్యాచ్‌ కీలకమే.. కానీ భారత్‌ చేతిలో ఓటమే బాధించింది: ఫకర్‌ జమాన్

పాకిస్థాన్‌కు నాలుగు ఓటముల తర్వాత తొలి విజయం. సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాపై (PAK v BAN) కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఫకర్ జమాన్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

Published : 01 Nov 2023 11:01 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భాగంగా  కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్‌ ఓడించింది. సాంకేతికంగా మాత్రమే సెమీస్‌ రేసులో నిలిచిన పాక్‌కు ఇది ఊరటనిచ్చే విజయమే. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ను మాత్రం ఓపెనర్ ఫకర్ జమాన్‌ ఆడాడు. గత ఐదు మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితమైన ఫకర్ ఈసారి వచ్చిన అవకాశాన్ని మాత్రం వదల్లేదు. ఇక.. అన్నింటికంటే భారత్‌ చేతిలో ఓటమే తమ జట్టును తీవ్రంగా బాధించిందని బంగ్లాతో మ్యాచ్‌ అనంతరం జమాన్‌ వ్యాఖ్యానించాడు. కీలకమైన 87 పరుగులు చేసిన ఫకర్ ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.

‘‘వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్‌ చాలా కీలకం. విజయం లభిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు బంగ్లాపై గెలుపు కూడా మాకు ఎంతో ముఖ్యమైంది.  ఇలాంటి విజయం కోసం ఎదురు చూశాం. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మంచి ప్రదర్శనే చేశాం. మా రిథమ్‌ను దొరకబుచ్చుకొన్నాం. సరైన కాంబినేషన్‌ను సాధించామని భావిస్తున్నా. గత ఎనిమిదేళ్లుగా పాక్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో భాగమైపోయా. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ను 29-30 ఓవర్లలోనే ఛేదించాలని ముందు అనుకున్నాం. నెట్‌రన్‌రేట్‌ మాకు చాలా కీలకం. ఎందుకంటే సెమీస్‌పై దృష్టిపెట్టాలంటే ఇవన్నీ తప్పదు. 

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ తర్వాత ఐదు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నా. గాయం పెద్దదేమీ కాదు.. కానీ ముందుజాగ్రత్తగా మేనేజ్‌మెంట్‌ బెంచ్‌కే పరిమితం చేసింది. టీమ్‌కు అవసరమైన సమయంలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు బంగ్లాతో ఆడేందుకు అవకాశం దక్కింది. జట్టు విజయం కోసం నా వంతు సహకారం అందించా. భారత్‌ పిచ్‌లపై పరుగులు చేయాలంటే ముందు నాలుగైదు ఓవర్లు క్రీజ్‌లో ఉండిపోవాలి. ఆ తర్వాత సులువుగా పరుగులు చేయొచ్చు. బౌండరీలు కూడా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఆడినట్లే తదుపరి మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నా. అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే సెమీస్‌ అవకాశాలు ఉండొచ్చు. ఇప్పటి వరకు మేం నాలుగు మ్యాచుల్లో ఓడిపోయాం. అయితే, భారత్‌ చేతిలో (IND vs PAK) పరాజయం కావడమే మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఎందుకంటే భారత్-పాక్‌ మ్యాచ్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా  చూస్తారు. మిగతా మ్యాచ్‌లకు దీనికి పెద్ద వ్యత్యాసం ఉండదంటే మాత్రం నేను తప్పుగా చెప్పినట్లే. మా ఆటగాళ్లందరూ విజయం కోసం తీవ్రంగా పోరాడతారు’’ అని జమాన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని