Praggnanandhaa: ఓ ‘ప్రజ్ఞాన్‌’ నేలపై.. మరోటి జాబిల్లిపై: ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌

భారత యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద (Praggnanandhaa)ను ఇస్రో ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్ సోమవారం కలిశారు. 

Published : 16 Oct 2023 14:11 IST

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్.. భారత యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద (Praggnanandhaa) ను సోమవారం కలిశారు. చెన్నైలోని ప్రజ్ఞానంద నివాసానికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. జీఎస్‌ఎల్వీ రాకెట్ నమూనాను ప్రజ్ఞానందకు బహూకరించారు. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ద్వారా జాబిల్లిపైకి మనం పంపించిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ విజయవంతంగా పలు పరిశోధనలు చేసి ప్రస్తుతం నిద్రలోకి జారుకుందని, కానీ ప్రజ్ఞానంద మాత్రం రాబోయే కాలంలో చురుగ్గా ఉంటూ భారత్‌ గర్వించేలా విజయాలు సాధిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

‘‘ప్రజ్ఞానంద సాధించిన విజయాలను చూసి మనమంతా గర్వపడుతున్నాం. ప్రస్తుతం అతడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో ప్రపంచ నంబర్‌వన్‌ అవుతాడని విశ్వసిస్తున్నా. ఈ ప్రజ్ఞాన్‌ (ప్రజ్ఞానంద) భూమిపై ఉన్నాడు. చంద్రుడిపైనా ప్రజ్ఞాన్‌ రోవర్‌ ఉంది. చంద్రయాన్‌-3లో భాగంగా జాబిల్లి ఉపరితలంపై మన ప్రజ్ఞాన్ (రోవర్) అడుగుపెట్టింది. ఈ విషయంలో ఎంతో గర్విస్తున్నాం. కాగా.. ఇతడు భూమిపై ఉన్న ప్రజ్ఞాన్‌. చంద్రుడిపై ఇస్రో సాధించిన ఘనతలాంటి విజయాలను అతడు భూమిపై సాధించాడు. అతడు అంతరిక్ష ప్రచార కార్యక్రమాల్లో మాతో కలిసి పనిచేస్తాడు’’ అని సోమనాథ్ వివరించారు.

ఈ ఏడాది ఆగస్టులో జరిగిన చెస్‌ ప్రపంచకప్‌ (Chess World Cup)లో ప్రజ్ఞానంద అదరగొట్టిన విషయం తెలిసిందే. సంచలన ఆటతో ఫైనల్‌ చేరిన అతడు.. చివరకు రన్నరప్‌గా నిలిచాడు. తుదిపోరులో ప్రజ్ఞానందపై దిగ్గజ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) విజయం సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని