CSK vs PBKS: ఉత్కంఠపోరులో చెన్నైపై పంజాబ్‌ విజయం

చెన్నైతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. ధోనిసేన నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 30 Apr 2023 19:49 IST

చెన్నై: గత మ్యాచ్‌లో లఖ్‌నవూపై ఘోరంగా ఓటమిపాలైన పంజాబ్‌ కింగ్స్‌ తిరిగి పుంజుకుంది. ఆదివారం చెన్నైతో ఉత్కంఠపోరులో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధోని సేన నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్‌ చివరి వరకూ పోరాడింది. ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సిన సమయంలో సికిందర్‌ రజా (13*; 7 బంతుల్లో 1 ఫోర్‌) సమయస్ఫూర్తితో ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. పంజాబ్‌కు ఇది ఐదో విజయం కాగా.. చెన్నైకి నాలుగో ఓటమి. లక్ష్య ఛేదనలో భాగంగా పంజాబ్‌ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్  (42; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌ (28; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో పాటు లివింగ్ స్టోన్‌ (40; 24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. సామ్‌ కరన్‌ (29; 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ ఫర్వాలేదనిపించాడు. చివరిలో షారుక్‌ఖాన్‌ (2*; 3 బంతుల్లో), రజాలు ఆచితూచి ఆడటంతో విజయం పంజాబ్‌ సొంతమైంది. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా రెండు, మతీష పతిరణ ఒక దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఓపెనర్ డేవాన్‌ కాన్వే (92*; 52 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌) దంచికొట్టడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత  20 ఓవర్లలో సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులను ధోనీ (13*; 4 బంతుల్లో) సిక్సర్లుగా మలిచాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (37; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. శివమ్ దూబె (28; 17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. రవీంద్ర జడేజా (12; 10 బంతుల్లో), మొయిన్ అలీ (10; 6 బంతుల్లో 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌, సామ్‌ కరన్‌, రాహుల్ చాహర్‌, సికిందర్‌ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

చెన్నై-పంజాబ్‌ మ్యాచ్‌ ఓవర్‌ టు ఓవర్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని