ODI WC 2023: వరల్డ్‌ కప్‌లో తుది జట్టు ఎంపికే అతిపెద్ద సవాల్‌..: రవిశాస్త్రి

వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) సంగ్రామం ప్రారంభానికి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో అంకురార్పణ జరగనుంది.  

Published : 04 Oct 2023 13:36 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌ (ODI WC 2023) కోసం బరిలోకి దిగే జట్లకు అతి పెద్ద సవాల్‌ ‘ఫైనల్‌ XI’ను ఎంపిక చేసుకోవడమేనని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అయితే, టీమ్‌ఇండియా కూడా ఇదే సమస్యను ఎదుర్కోనుందని పేర్కొన్నాడు. గురువారం నుంచి వన్డే ప్రపంచకప్‌ మొదలుకానుంది. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అయితే, తుది జట్టులో మాత్రం కుల్‌దీప్‌ యాదవ్‌కు (Kuldeep Yadav) చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువని రవిశాస్త్రి తెలిపాడు. ఫైనల్‌ XIలో కుల్‌దీప్‌ ఉండాలంటే మాత్రం ఇతర బౌలర్ల ప్రదర్శనపైన ఆధారపడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. 

‘‘జట్టు కోసం ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. స్క్వాడ్‌లో అశ్విన్‌ చేరడంతో తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. కుల్‌దీప్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తే.. తర్వాతి మ్యాచుల్లో స్థానం సుస్థిరం కాదు. అయితే, కుల్‌దీప్ బౌలింగ్‌పై ఎలాంటి సందేహాలు లేవు. అద్భుతమైన బౌలర్. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన కుల్‌దీప్‌ ఇటీవల సిరీసుల్లో నాణ్యమైన బౌలింగ్‌ వేశాడు. పిచ్ పొడిగా ఉంటే మాత్రం కేవలం ఇద్దరు ప్రధాన పేసర్లతోనే బరిలోకి దిగాలి. అప్పుడు ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం లభిస్తుంది. ఎలాగూ హార్దిక్ పాండ్య రూపంలో పేస్‌ ఆల్‌రౌండర్ ఉన్నాడు’’ అని రవిశాస్త్రి తెలిపాడు. 

అత్యధిక వికెట్లు తీసేది అతడే: ఇర్ఫాన్‌

కుల్‌దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో అవకాశంపై రవిశాస్త్రి వెల్లడించిన అభిప్రాయాలకు భిన్నంగా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్ స్పందించాడు. ఈ వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌ కుల్‌దీప్ అవుతాడని జోస్యం చెప్పాడు. ఇర్ఫాన్‌ మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్లు సంజయ్‌ మంజ్రేకర్, వినయ్‌ కుమార్, మిథాలీ రాజ్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల ఆసియా కప్‌లోనూ కుల్‌దీప్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని