Ravindra Jadeja: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. వివాదాస్పదంగా మారిన రవీంద్ర జడేజా ఎల్బీ నిర్ణయం

మరోసారి డీఆర్‌ఎస్ (DRS) నిర్ణయంపై క్రికెట్‌ అభిమానుల్లో చర్చ మొదలైంది. భారత బ్యాటర్ రవీంద్ర జడేజా ఔట్‌ విషయంలో గందరగోళం నెలకొనడంతో అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Published : 27 Jan 2024 13:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఉప్పల్‌ వేదికగా (Uppal Test) జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్‌ (IND vs ENG) 190 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. మూడోరోజు ఆటలో కేవలం 15 పరుగులకే ఆఖరి మూడు వికెట్లను టీమ్‌ఇండియా కోల్పోయింది. కానీ, కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రవీంద్ర జడేజా (87) ఔట్‌ వివాదాస్పదమై మరోసారి డీఆర్‌ఎస్‌పై చర్చ మొదలైంది. ఇవాళ కేవలం ఆరు పరుగులే చేసిన జడేజాను జో రూట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో జడేజా డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. సమీక్షలో బంతి ప్యాడ్లను, బ్యాట్‌ను ఒకే సమయంలో తగిలినట్లు అనిపించింది. ఇంపాక్ట్‌తో పాటు వికెట్లను బంతి తాకడం కూడా ‘అంపైర్స్‌ కాల్’ వచ్చింది. అప్పటికే ఫీల్డ్‌ అంపైర్ ఔట్‌ ఇవ్వడంతో భారత అభిమానులు షాక్‌కు గురయ్యారు. సమీక్ష సందర్భంగా థర్డ్‌ అంపైర్‌ సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శలు గుప్పిస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారు. 

‘‘జడేజాకి దురదృష్టం కలిసొచ్చింది. అంపైర్లు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. డీఆర్‌ఎస్‌ వీటిని గుర్తించలేకపోతోంది’’

‘‘అత్యంత చెత్త నిర్ణయం డీఆర్‌ఎస్‌ తీసుకుంది. మూడో అంపైర్‌ సరిగ్గా సమీక్షించలేదు. బంతి బ్యాట్‌ను తాకిందా? ప్యాడ్లను తాకిందా? అనేది కూడా నిర్థారించుకోలేకపోవడం దారుణం. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నిర్ణయం బ్యాటర్‌కు అనుకూలంగా ఇవ్వాలి’’

‘‘రవీంద్ర జడేజా ఔట్‌ విషయంలో..  థర్డ్ అంపైర్‌ బాల్‌ ట్రాకింగ్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు. బ్యాట్‌ను బంతి తాకినట్లు తెలుస్తోంది’’

‘‘ఇలాంటి నిర్ణయంపై ఐసీసీ స్పందించాలి. స్పష్టత లేకుండానే థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంపై విచారణ జరిపించాలి. బంతి బ్యాట్‌ను తాకిందో లేదో కూడా అతడికి తెలియదు. ఔట్‌గా ఎలా నిర్థారిస్తాడు? ’’

జడేజా ఔట్‌పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

రవీంద్ర జడేజాను థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడంపై వ్యాఖ్యాత రవిశాస్త్రి స్పందించాడు. ‘‘ఒకవేళ ఫీల్డ్‌ అంపైర్‌ జడ్డూకు అనుకూలంగా నిర్ణయం ఇచ్చి ఉంటే.. అప్పుడు థర్డ్‌ అంపైర్‌ కూడా నాటౌట్‌గా ప్రకటించి ఉండేవాడు. ఈసారి మాత్రం బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ సూత్రం బ్యాటర్‌కు వర్తించదు. అందుకే, జడేజా ఔట్‌గా పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని