రసవత్తరంగా ‘సెమీస్‌’ పోరు.. అయితే ఫైనల్‌లో భారత్‌తో తలపడేది ఈ జట్టే: పాంటింగ్‌

సూపర్‌ 12 మ్యాచ్‌లు చివరి దశకు చేరుకుంటున్నప్పటికీ.. ఇప్పటి వరకు కివీస్‌ మాత్రమే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకొంది. మిగతా బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మెగాటోర్నీలో ఫైనల్‌కు చేరే జట్లేవో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అంచనా వేశాడు.

Updated : 04 Nov 2022 14:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  పొట్టి ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగుతోంది. సూపర్‌ 12 మ్యాచ్‌లు చివరి దశకు చేరుకుంటున్నాయి. గ్రూప్‌ -1 నుంచి న్యూజిలాండ్‌ దాదాపు సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకొన్నట్లే. ప్రస్తుతం గ్రూప్‌ -1లో 7 పాయింట్లతో న్యూజిలాండ్‌ అగ్ర స్థానంలో ఉండగా.. గ్రూప్‌ - 2 నుంచి టీమ్‌ ఇండియా 6 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్‌ విజయం సాధిస్తే అగ్రస్థానంతో సెమీస్‌ చేరుకొంటుంది. అయితే మిగతా రెండు స్థానాల కోసం ఆయా జట్ల మధ్య సెమీస్‌ పోరు హోరాహోరీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో మెగాటోర్నీలో ఫైనల్‌కు చేరే జట్లేవో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అంచనా వేశాడు.

‘నిజాయతీగా చెప్పాలంటే.. మెల్‌బోర్న్‌(ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక)లో ఎవరు ఆడబోతున్నారో ఎవరికి తెలుసు..? గ్రూప్‌ దశను అధిగమించి ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుతుందని నేను ఆశిస్తున్నా. ఇక దక్షిణాప్రికా డేంజరస్‌ జట్టే అయినా.. నేను గతంలో చెప్పినట్లే ఫైనల్‌ మాత్రం ఆసీస్‌, భారత్‌ల మధ్యే ఉంటుంది’ అని పాంటింగ్‌ ఐసీసీకి రాసిన తాజా కాలమ్‌లో విశ్లేషించాడు.

‘అస్ట్రేలియా కొన్ని విభాగాల్లో వెనకబడి ఉంది.. రోహిత్‌ సేన కూడా బుమ్రాను కోల్పోయింది.. అయితే, ఈ మెగా టోర్నీ రెండో భాగంలో అత్యుత్తమ క్రికెట్‌ను ఆడాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లు జట్లు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి’ అని పాంటింగ్‌ వివరించాడు.

ఇక నవంబర్‌ 13న ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు తాను మెల్‌బోర్న్‌ వెళ్తున్నట్లు పాంటింగ్‌ తెలిపాడు. అందుకోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని