Sachin: సచిన్‌కు నిలువెత్తు విగ్రహం.. ఎంసీఏ కీలక ప్రకటన

భారత క్రికెట్‌ చరిత్రలో మాస్టర్‌బ్లాస్టర్ సచిన్‌ తెందూల్కర్‌ది (Sachin Tendulkar) ప్రత్యేక స్థానం. రికార్డులు, రివార్డులకు కొదవేం లేదు. తాజాగా మరో అరుదైన ఘనత అతడి ఖాతాలో పడనుంది.

Published : 28 Feb 2023 14:25 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా (Team India) క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు (Sachin Tendulkar) అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్‌ (Sachin) నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు విగ్రహం ఏర్పాటుపై ముంబయి క్రికెట్ అసోషియేషన్ (MCA) అధ్యక్షుడు అమోల్‌ కాలే ప్రకటన విడుదల చేశారు. ఇలా ఒక ఆటగాడికి ఈ మైదానంలో విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వన్డే ప్రపంచకప్‌ 2023 మెగా టోర్నీ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. 

అమోల్‌ కాలేతో కలిసి సచిన్‌ తెందూల్కర్‌ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ.. ‘‘ఎంసీఏ తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. వాంఖడేతో నా అనుబంధం ఇప్పటిది కాదు. నా తొలి రంజీ మ్యాచ్‌ను ఇక్కడే ఆడాను.. ఆచ్రేకర్‌ సర్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిపోయా. అలాగే నా చివరి మ్యాచ్‌నూ ఇక్కడే ఆడాను. ఇక్కడికి వస్తే నా జీవిత చక్రం మొత్తం కళ్ల ముందు కనిపిస్తుంది. చాలా అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు నా జీవితంలో అతి పెద్ద సంఘటనగా ఇది నిలిచిపోతుంది. ఇప్పుడు నేను పాతికేళ్ల అనుభవంతో 25 ఏళ్ల యువకుడిగా ఉన్నా. ఇలాంటి గొప్ప గౌరవం అందించిన ఎంసీఏకి ధన్యవాదాలు. నాకు ఇదొక ప్రత్యేక ప్రదేశం’’ అని సచిన్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

భారత్‌లో క్రికెటర్ల విగ్రహాలకు సంబంధించి తొలి టెస్టు జట్టు కెప్టెన్‌ సీకే నాయుడుకు మాత్రమే అరుదైన గౌరవం దక్కింది. అదీనూ మూడు స్టేడియాల్లో వేర్వేరు సైజుల్లో విగ్రహాలను ఆయా  క్రికెట్‌ సంఘాలు ఏర్పాటు చేశాయి. ఇందౌర్‌లోని హోల్కర్ స్టేడియం, నాగ్‌పుర్‌లోని విదర్భ మైదానం, ఆంధ్రప్రదేశ్‌లోని వీడీసీఏ స్టేడియాల్లో సీకే నాయుడు విగ్రహాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని