IND vs PAK: అలాంటి వారు ఈ మ్యాచ్‌ చూడొద్దన్న అక్తర్.. ప్రీ-మ్యాచ్‌ షో సిద్ధం!

Updated : 13 Oct 2023 14:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) శనివారం హై ఓల్టేజీ మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో దాయాదుల పోరు (IND vs PAK) సందర్భంగా షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటే సోషల్‌ మీడియాలో కొందరు చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి. ఇక భారత్ - పాక్‌ పోరు ప్రారంభానికి ముందు ప్రీ మ్యాచ్‌ షోను నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది వీరే

భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏర్పాట్లను కూడా చేసేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరగనుంది. దాదాపు 1.20 లక్షలకుపైగా అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించనున్నట్లు సమాచారం. దీంతో వారిని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సింగర్లు అర్జిత్‌ సింగ్‌, శంకర్‌ మహదేవన్, సుఖ్విందర్ సింగ్‌తో ప్రదర్శనలను సిద్ధం చేసింది. మ్యాచ్‌ శనివారం రెండు గంటలకు ప్రారంభం కానుంది. అయితే సంగీత కార్యక్రమాలు మాత్రం 12.30 గంటలకు మొదలవుతాయి.


ధైర్యవంతులైతేనే మ్యాచ్‌ను చూడండి: అక్తర్

భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ను చూడాలంటే దమ్ము ఉండాలని మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్ వ్యాఖ్యానించాడు. ‘‘మీరు ధైర్యవంతులైతే.. ఈ పోరును ఎంజాయ్‌ చేస్తారు. ఒకవేళ మీరు పిరికివాళ్లైతే ఈ మ్యాచ్‌ను చూడకపోవడమే ఉత్తమం. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే సూపర్ స్టార్లుగా మారేందుకు ఇదొక చక్కటి అవకాశం. పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి ఉంటుందనేది అవాస్తవం. భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణించడం వల్ల పాక్‌పై ఒత్తిడి లేకుండా పోతుంది’’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.


‘బాయ్‌కాట్‌’ చేయాలంటూ పోస్టులు..

భారత్ - పాక్‌ మ్యాచ్‌ను ‘బాయ్‌కాట్’ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ అనుకూలంగా వ్యవహరిస్తోందని.. అలాంటి జట్టుతో క్రికెట్ మ్యాచ్‌ ఆడొద్దని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. గత నెలలో కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్‌కు చెందిన మేజర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ను ఉగ్రవాదులు హత్య చేశారని పేర్కొన్నారు.  పాకిస్థాన్‌ ఆటగాళ్లకు ఇక్కడ ఘనస్వాగతం పలికితే.. ఆ దేశానికి చెందిన వారు మాత్రం ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ‘‘మన సైనికులు పాక్‌  బోర్డర్‌లో వీరోచితంగా పోరాడుతుంటే.. ఇక్కడ బీసీసీఐ మాత్రం పాక్‌ జట్టుకు గౌరవం ఇస్తూ ఆహ్వానం పలకడం సరైంది కాదు’’ అని ఓ నెటిజన్ ఆక్షేపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని