IND vs AUS: స్మిత్ వికెట్‌ కీలకమన్న జడ్డూ... మరో 50 పరుగులు చేయాల్సిందన్న కమిన్స్!

Updated : 19 Oct 2023 12:57 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో (IND vs AUS) బోణీ కొట్టింది. స్టీవ్‌ స్మిత్ వికెట్‌ తీయడమే టర్నింగ్‌ పాయింట్‌గా రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. తమ జట్టు మరో 50 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆసీస్‌ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి విజయం సాధించడం మరింత ఊపునిస్తుందని భారత సారథి వ్యాఖ్యానించాడు. భారత్ - ఆసీస్‌ మ్యాచ్‌కు సంబంధించిన మరికొన్ని విశేషాలు మీ కోసం..

కొత్త బ్యాటర్‌కు కఠిన సవాలే: రవీంద్ర జడేజా

చెన్నై వేదికపై భారత బౌలర్ రవీంద్ర జడేజా అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. తన పది ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 28 పరుగులే ఇచ్చాడు. అన్నింటికంటే ఆసీస్ బ్యాటర్ స్టీవ్‌ స్మిత్‌ను బౌల్డ్‌ చేయడమే ‘టర్నింగ్‌’ పాయింట్‌ అని జడేజా తెలిపాడు. ‘‘ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం చాలా కష్టం. బంతి టర్న్‌తోపాటు బౌన్స్‌ అవుతుంది. అలాంటి బాల్‌కే స్టీవ్‌ స్మిత్‌ను బౌల్డ్‌ చేశా. అప్పటి నుంచి మ్యాచ్‌ టర్నింగ్‌ అయింది. ఆ తర్వాత వచ్చిన కొత్త బ్యాటర్లు స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం చాలా కష్టం. అందుకే, స్మిత్ వికెట్టే టర్నింగ్‌ పాయింట్ అని చెబుతా. ఇక్కడే దాదాపు పదేళ్ల నుంచి ఆడుతూనే ఉన్నా. చెన్నై పిచ్‌ పరిస్థితిపై పూర్తి అవగాహన ఉంది. జట్టు కోసం నేనందించిన భాగస్వామ్యంపై సంతోషంగా ఉన్నా. ఇక ఛేదనలో మూడు వికెట్లు వెంటవెంటనేపడిపోయినప్పుడు ఎలాంటి జట్టుకైన కాస్త కంగారు ఉంటుంది. కానీ, విరాట్-కేఎల్ పార్టనర్‌షిప్‌ భారత్‌ను గెలిపించింది’’ అని జడేజా వెల్లడించాడు.


200 టార్గెట్‌ను కాపాడటం కష్టమే.. కానీ: కమిన్స్

‘‘ఈ పిచ్‌పై పరుగులు చేయడం చాలా క్లిష్టంగా మారింది. తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు కనీసం మరో 50 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, భారత బౌలింగ్‌ ఎటాక్‌ మమ్మల్ని అడ్డుకోవడం వల్ల సాధ్యపడలేదు. తర్వాత మా బౌలర్లూ అద్భుత ఆరంభం ఇచ్చారు. అయితే, ఒక స్పిన్నర్‌ తక్కువగా ఉన్నాడనే వాదన సరికాదు. మాకు 20 ఓవర్ల స్పిన్‌ బౌలింగ్‌ అందుబాటులో ఉంది. అయితే, విరాట్ కోహ్లీ క్యాచ్‌ను జారవిడవడం ఇబ్బంది కలిగించింది. దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. ఎప్పుడో వదిలేశా. ఒకవేళ అది సాధ్యమై ఉంటే 4/10తో డ్రీమ్‌ స్టార్ట్‌ లభించేది. హేజిల్‌ వుడ్ క్లాస్‌ బౌలర్. తప్పకుండా మా ఓటమిపై సమీక్షించుకుంటాం. తొమ్మిదింట్లో ఒకటే ముగిసింది. కాబట్టి, ఎలాంటి కంగారు లేదు. టాస్ విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరం లేదు’’ అని ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.


వారిద్దరిదే ఈ విజయం: రోహిత్ శర్మ

‘‘విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. క్లిష్టపరిస్థితుల్లో నుంచి బయటపడి మరీ గెలవడం బాగుంది. టోర్నీ ప్రారంభం.. ఇలాంటి మ్యాచ్‌తో రావడం మేలు చేసేదే. ఫీల్డింగ్‌, బౌలింగ్‌ విషయాల్లో ప్రతి ఒక్కరి నుంచి భాగస్వామ్యం ఉంది. ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం కష్టమే. మా బౌలర్లు పరిస్థితులను చక్కగా వినియోగించుకున్నారు. ఛేదనలో మాకు ఇలాంటి స్టార్టింగ్‌ రాకుండా ఉంటే బాగుండేది. ఆసీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అదేసమయంలో చెత్త షాట్లతో వికెట్లను సమర్పించాం. పవర్‌ప్లేలో ఎక్కువగా పరుగులు చేయాలనే క్రమంలోనే ఇలా జరిగింది. అయితే, విరాట్ కోహ్లీతోపాటు కేఎల్ రాహుల్‌దే ఈ విజయం. వారిద్దరూ పరిస్థితులకు అలవాటు పడి మరీ జట్టును గెలిపించారు’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని