Smriti Mandhana: స్మృతి మంధానకు ఐసీసీ అవార్డు

టీమ్‌ఇండియా మహిళ క్రికెటర్‌ స్మృతి మంధానకు మరో అవార్డు దక్కింది. ఐసీసీ విమెన్‌ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ - 2021 అవార్డు గెలుచుకుంది. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటతీరుతో రాణించిందుకు ఆమెకు ఈ అవార్డు...

Published : 24 Jan 2022 23:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా మహిళ క్రికెటర్‌ స్మృతి మంధానకు మరో అవార్డు దక్కింది. ఐసీసీ విమెన్‌ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ - 2021 అవార్డు గెలుచుకుంది. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటతీరుతో రాణించిందుకుగానూ ఆమెకు ఈ అవార్డు లభించింది. గతేడాది టీమ్‌ఇండియా చెప్పుకోతగ్గ ప్రదర్శన చేయకున్నా.. స్మృతి మంధానకు ఈ అవార్డు లభించడం విశేషం. గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఐదు వన్డేల సిరీస్‌ను 1-4 తేడాతో, మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. అయితే, ఈ రెండు సిరీస్‌ల్లో కలిపి భారత్ గెలిచిన రెండు మ్యాచుల్లోనూ స్మృతి మంధాన కీలకంగా వ్యవహరించింది. అలాగే, ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన ఏకైక పింక్‌ బాల్ టెస్టులో మంధాన సెంచరీతో రికార్డు సృష్టించింది. పింక్‌ బాల్ టెస్టులో సెంచరీ నమోదు చేసిన తొలి మహిళ క్రికెటర్‌గా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.

* పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌కి ఉత్తమ వన్డే క్రికెటర్‌ అవార్డు.. 

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌కి ‘ఐసీసీ ఉత్తమ వన్డే క్రికెటర్‌’ అవార్డు దక్కింది. బాబర్‌ గతేడాది ఆడిన ఆరు వన్డేల్లో కలిపి 67.50 సగటుతో 405 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ జట్టు టెస్టు కెప్టెన్‌ జో రూట్‌కు ‘ఐసీసీ ఉత్తమ టెస్టు క్రికెటర్‌’ అవార్డు లభించింది. గతేడాది అద్భుతమైన ఆటతీరుతో రూట్ ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 1708 పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పాక్‌ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్‌ (1788 పరుగులు), వెస్టిండీస్‌ క్రికెట్ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్ (1710 పరుగులు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

* ఉత్తమ అంపైర్‌గా ఎరాస్మస్‌..

దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్‌ ఎరాస్మస్‌ ఉత్తమ అంపైర్‌గా ఎంపికయ్యాడు. అతడు మూడోసారి ఉత్తమ ఎంపైర్‌ అవార్డు దక్కించుకోవడం విశేషం. అంతకు ముందు 2016, 2017 సంవత్సరాల్లో కూడా ఎరాస్మస్‌ ఉత్తమ అంపైర్‌ అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు 70 టెస్టులు, 102 వన్డేలు, 35 టీ20 మ్యాచులకు అతడు అంపైర్‌గా వ్యవహరించాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని