Cricket News: మూడు మ్యాచ్‌లకు రూ. 1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న డేవిడ్‌ మిల్లర్!

క్రికెట్‌ కోసం అత్యంత మధుర క్షణాలను కూడా వదిలిపెట్టేందుకు కొందరు సిద్ధమవుతారు. అందులోనూ ఆకర్షణీయమైన ఆఫర్ వస్తే కాదనుకోరు. 

Updated : 13 Mar 2024 14:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మూడు మ్యాచ్‌లు ఆడితే భారీ మొత్తం ఆఫర్.. మరోవైపు పెళ్లి తేదీ దగ్గరపడుతోంది. ఇలాంటి సమయంలో ఓ క్రికెటర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అతడు ఎవరు? మూడు మ్యాచ్‌లు ఎక్కడ ఆడాలి? అతడేం చేశాడు? అనే విషయాలను తెలుసుకొవాలంటే.. ఇది చదివేయండి. 

డేవిడ్‌ మిల్లర్ భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే. ఐపీఎల్‌లో (IPL) గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడు బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్ (BPL)లో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఫార్చూన్ బరిషల్‌ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ ఇచ్చింది. దీని కోసం తన పెళ్లిని కూడా వాయిదా వేసుకుని బరిలోకి దిగాడు. ఈ విషయాన్ని క్రికెట్ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ వెల్లడించాడు. ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్‌ 2), మార్చి 1న (ఫైనల్‌) ఫార్చూన్ బరిషల్‌కు మిల్లర్‌ ఆడాడు. చివరికి ఆ జట్టే బీపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో వసీమ్‌ అక్రమ్‌ మాట్లాడుతూ.. ‘‘ పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్నా. దీంతో బీపీఎల్‌ను పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఎవరు ఛాంపియన్‌గా నిలిచారనేది తెలుసుకున్నా. ఈ సందర్భంగా డేవిడ్‌ మిల్లర్ గురించి తెలిసింది. చివరి మూడు మ్యాచ్‌లను ఆడితే అతడికి 1.50 లక్షల డాలర్లు (రూ. 1.25 కోట్లు) ఇచ్చేందుకు ఫ్రాంచైజీ ముందుకొచ్చింది. దీంతో అతడు పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు’’ అని వ్యాఖ్యానించాడు. డేవిడ్ మిల్లర్‌ బీపీఎల్‌ ముగిసిన తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్‌ కామిల్లా హారిస్‌ను (మార్చి 10న) వివాహం చేసుకున్నాడు. 


లెఫ్ట్‌హ్యాండర్‌ను బెంబేలెత్తించిన అర్జున్‌ తెందూల్కర్

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం ముంబయి ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తాజాగా ట్రైనింగ్‌ క్యాప్‌లో హార్దిక్‌ పాండ్య, అర్జున్ తెందూల్కర్‌ తదితరులు సాధన మొదలుపెట్టారు. అర్జున్‌ తెందూల్కర్‌ వేసిన బంతిని అడ్డుకొనే క్రమంలో ఓ ఎడమ చేతివాటం బ్యాటర్ ఇబ్బంది పడ్డాడు. ముంబయి ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో ఆ వీడియోను పోస్టు చేసింది. దీంతో ఆ లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ను ఇషాన్‌ కిషన్‌గా అభిమానులు భావించి కామెంట్లు చేస్తున్నారు. కానీ, ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్న ఆటగాళ్ల జాబితాను ముంబయి విడుదల చేసింది. అందులో ఇషాన్‌ కిషన్‌ పేరు లేకపోవడం గమనార్హం. ‘‘ముంబయి ఇండియన్స్‌ జట్టు ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. నెట్స్‌లో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ఈ సెషన్‌లో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య, గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్‌ గోపాల్, నెహాల్ వధేరా, ఆకాశ్ మధ్వాల్, అర్జున్, విష్ణు వినోద్, శివాలిక్‌ శర్మ, నమన్ ధిర్, అన్షుల్ కాంబోజ్ పాల్గొన్నారు’’ అని ముంబయి పోస్టు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని