ODI WC 2023: భారత్‌ ‘C’ టీమ్‌ కూడా పాక్‌ను ఓడిస్తుందన్న శ్రీశాంత్.. షహీన్‌ బౌలింగ్‌పై అక్రమ్‌ కీలక వ్యాఖ్యలు!

Published : 19 Oct 2023 11:58 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ (IND vs PAK) విజయం సాధించి ఐదు రోజులైనా ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. పాక్‌ ఆడిన తీరుపై విమర్శలు ఆగడంలేదు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, గౌతమ్‌ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే తమ జట్టు బౌలర్‌ షహీన్‌ ప్రదర్శనపై పాక్‌ మాజీ పేసర్ వసీమ్‌ అక్రమ్‌ కూడా స్పందించాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

మికీ ఆర్థర్‌ చెప్పినట్టు జరగదులే: శ్రీశాంత్

‘‘పాక్‌ కోచ్‌-డైరెక్టర్ మికీ ఆర్థర్‌ భారత్‌ను ఫైనల్‌లో కలుసుకుంటామని చెప్పినట్లు విన్నా. అయితే, వారి ఆటను చూస్తే.. పాక్‌ ఎప్పుడూ కూడా ఐసీసీ ట్రోఫీల్లో గెలిచే అవకాశం ఉండకపోవచ్చు. అది వారి జట్టును చూస్తే అర్థమైపోతుంది. భారత్ ‘సి’ జట్టు కూడా పాక్‌ ప్రధాన టీమ్‌ను ఓడించగలదు. ఐపీఎల్‌లో ఆడిన భారత క్రికెటర్లకు కూడా పాక్‌ను ఓడించగల సత్తా ఉంది. పాకిస్థాన్‌ ఎప్పటికీ ఇలాంటి భారీ స్టేడియంలో ఆడాలని కలలు కూడా కనలేదు. ఒక వేళ మరో అవకాశం లభించినా.. ఇటువంటి ఆటతీరునే ప్రదర్శిస్తే మాత్రం గెలవడం కష్టం’’ అని శ్రీశాంత్‌ తెలిపాడు.


బాబర్‌ అజామ్‌ చాలా విషయాల్లో మారాలి: గౌతమ్‌ గంభీర్‌

‘‘పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ చాలా విషయాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతడి ఆటతీరు, వ్యక్తిత్వంతోపాటు మైండ్‌సెట్‌ కూడా మారాలి. షాహిద్‌ అఫ్రిది, ఇమ్రాన్‌ నజిర్, సయీద్ అన్వర్, సోహైల్‌ వంటి దూకుడైన బ్యాటింగ్‌ లైనప్‌ గతంలో పాకిస్థాన్‌కు ఉండేది. అయితే, ఇప్పుడున్న జట్టులో టాప్‌-3 బ్యాటర్లు ఒకేలా ఆడుతున్నారు. వారిలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ అయితే బెటర్. అతడు చాలా కీలకమైన మూడోస్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. గణాంకాలను చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా పాక్‌ తరఫున అత్యధిక పరుగులు చేసే బ్యాటర్‌గా అతడు నిలుస్తాడు. కానీ, టోర్నీల్లో జట్టును గెలిపిస్తేనే గౌరవం దక్కుతుంది. వసీమ్ అక్రమ్‌ 1992 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో మూడు వికెట్లు తీశాడు. అప్పటి వరకు ఎప్పుడూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయలేదు. అయినా, సరే అతడి బౌలింగ్‌ గురించి అప్పట్లో మాట్లాడుకున్నారు. దానికి కారణంగా వారు వరల్డ్‌ కప్‌ను గెలిచారు. అలాగే 2011 ఫైనల్‌లో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్థెనె సెంచరీ కొట్టినా.. ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. ఎందుకంటే భారత్‌ వరల్డ్‌ కప్‌ నెగ్గింది’’ అని గంభీర్‌ వివరించాడు.


షహీన్ వికెట్లు తీయగల బౌలరే.. కానీ..: వసీమ్‌ అక్రమ్‌

పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్ షహీన్ అఫ్రిది నుంచి ఇంకా ఆశించిన స్థాయిలో బౌలింగ్‌ ప్రదర్శన రాలేదని.. మున్ముందు మ్యాచుల్లో చూస్తామనే విశ్వాసం ఉందని పాక్‌ మాజీ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘షహీన్‌ అద్భుతమైన బౌలర్‌. వరల్డ్‌ కప్‌లో నాణ్యమైన బౌలింగ్‌ వేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్‌ తీయగల బౌలర్. కానీ, అతడిలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం స్థాయి తక్కువగా ఉంది. ఒక వేళ వికెట్లు తీయలేనప్పుడు పరుగులను నియంత్రించాలి. అంతకుమించి ఏం చేయకూడదు. ఒకటీ లేదా రెండు మంచి బౌలింగ్‌ స్పెల్స్‌ పడితే చాలా వరకు గాడిలోకి వచ్చేస్తాడు’’ అని అక్రమ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని